కామారెడ్డి క్రైం: పోలీసుల కళ్లు కప్పి... గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని తరలిద్దామనుకున్నారు. కానీ అదుపుతప్పిన వాహనం వారిని పట్టుబడేలా చేసింది. ఆదివారం సాయంత్రం కామారెడ్డి పట్టణ శివారులో జరిగిన ఈ ఘటనలో పోలీసులు 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌వైపు నుంచి నిజామాబాద్ వైపు ఓ వాహనం వెళ్తోంది. క్యాసంపల్లి శివారులోకి రాగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే వారు వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యారు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే దేవునిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకుని చూడగా వాహనంలో గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. రెండు కిలోల గంజాయి ప్యాకెట్లు 15 ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
సంఘటనా స్థలం కామారెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుందని భావించి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ, రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment