
మంచినీళ్లనుకుని యాసిడ్ తాగి అస్వస్థతకు గురైన విజయ్‌కుమార్
నిజామాబాద్ నాగారం: గుక్కెడు మంచి నీళ్లు ఇవ్వమంటే యాసిడ్ ఇచ్చారు. ఓ షాపింగ్ మాల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రిపాలు కావాల్సి వచ్చింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మహమ్మద్‌నగర్ గ్రామానికి చెందిన ఎల్.విజయ్‌కుమార్ దుస్తుల కొనుగోలు కోసం శనివారం కుటుంబ సభ్యులతో కలసి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చారు.
నెహ్రూపార్కు సమీపంలోని ఓ షాపింగ్‌మాల్ వెళ్లి దుస్తులు కొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ దాహంగా ఉందని మంచి నీళ్లు ఇవ్వమని సిబ్బందిని కోరారు. సిబ్బంది నీళ్ల మాదిరిగానే ఉండే యాసిడ్ బాటిల్ ఇచ్చారు. విజయ్‌కుమార్ గొంతులోకి పోసుకోగానే తీవ్ర మంట ప్రారంభమై అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స ప్రారంభించిన వైద్యులు పేషెంట్ పరిస్థితి ఇప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు.
దీంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని హైదరాబాద్‌కు తరలించారు. అంతకు ముందు షాపింగ్ మాల్ నిర్వాహకులతో విజయ్‌కుమార్ కుటుంబ సభ్యులకు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా అది యాసిడ్ కాదంటూ అందులో పనిచేసే ఆనంద్ అనే ఉద్యోగి కొంచెం నోట్లో పోసుకోవడంతో గొంతులో మంటరేగి అతను కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment