సాక్షి, కామారెడ్డి: ‘కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తడని అనంగనే ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయినయి. జబ్బలు చరిచినోళ్లు తప్పించుకునే పరిస్థితి ఏర్పడింది. అసలే కామారెడ్డి తెలంగాణ ఉద్యమాల గడ్డ. షబ్బీర్ అలీ అసోంటోళ్లు పోటీ నుంచి తప్పుకున్నరు. ఇగ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీకి వస్తడట. రేవంత్‌రెడ్డి.. దమ్ముంటే రా చూసుకుందాం. డిపాజిట్ కూడా దక్కనీయం. చిత్తుచిత్తుగా ఓడిస్తం.
పోరాటాల గడ్డ మీద తెలంగాణ ద్రోహులకు స్థానం లేదు’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన సభల్లో కేటీఆర్ మాట్లాడారు. ‘కేసీఆర్ పోటీ చేస్తున్నడని తెలవంగనే కొందరు నాయకులు పోటీ నుంచి తప్పుకున్నరు. షబ్బీర్ అలీ పోటీ చేయనని పక్కన కూసున్నట్టు మీడియాలో చూసిన. కేసీఆర్ మీద పోటీ చేయడం అంటే పోచమ్మ గుడి ముందు మేకపోతును బలిచ్చినట్టే. గ్రామగ్రామాన ప్రజలే ఏకగ్రీవంగా కేసీఆర్‌కు మద్దతు ఇస్తున్నరు. పోటీ ఏకపక్షమే’అని పేర్కొన్నారు.
కామారెడ్డికి గోదావరి తెస్తాం
‘పుట్టుక నుంచి చావు వరకు కేసీఆర్ పథకాలు ఇంటింటికీ చేరినయి అంటూ బిడ్డ పుట్టగానే కేసీఆర్ కిట్టు వస్తది, ఏదేని పరిస్థితుల్లో ప్రాణాలు పోతే కేసీఆర్‌బీమాతో ఆదుకుంటాం’అని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ రాకతో కామారెడ్డి రూపురేఖలే మారిపోతాయన్నారు. కామారెడ్డి ప్రాంతానికి గోదావరి జలాలు తెచ్చి ఈ ప్రాంత ప్రజల కాళ్లు కడుగుతామన్నారు. ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. ‘కామారెడ్డిలో కేసీఆర్ గెలిస్తే ఎవరు చూసుకుంటరని కొందరు అంటున్నరు. ఇక్కడ ప్రత్యేక అధికారిని పెడతం.
ఆయన పర్యవేక్షణలో అన్నీ జరుగుతయి. ఈ ప్రాంతానికి చెందిన ఆర్డీవో ముత్యంరెడ్డి గజ్వేల్‌లో ప్రత్యేకాధికారిగా పనిచేసి అక్కడి ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. అవసరమైతే ఆయన్నే ఇక్కడ పెట్టుకుని పాలన సాగించుకుంటాం. నాది పక్క నియోజక వర్గం సిరిసిల్ల.. నేను వారం, పదిరోజులకోసారి వస్తూపోతూనే ఉంట. ఇక మీదట కామారెడ్డిలో ఆగుత. ఇక్కడి ప్రజల కష్టాలను నేనే తీరుస్తా’అని కేటీఆర్ అన్నారు.
మంత్రి ప్రశాంత్‌రెడ్డి, విప్ గంప గోవర్ధన్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని పనులు చూస్తారని తెలిపారు. గంప గోవర్ధన్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో శ్రమించారని, ఇంకా సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలా అభివృద్ధి జరగాలంటే సీఎం పోటీ చేయాలని గంప గోవర్ధన్ సీఎంను కోరడంతో పోటీకి సిద్ధమయ్యాడన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీ చేసినా కేసీఆర్ విజయం సాధిస్తారని, ఇక్కడ పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని చెప్పారు.
వాళ్లకు ఓటేసి కష్టాలు పడదామా?
కాంగ్రెస్‌కు 11 సార్లు అధికారం ఇస్తే వాళ్లు చేసిందేమి లేదని, ఇప్పుడు ఏదో చేస్తా అంటే ఎవరు నమ్మాలని కేటీఆర్ ప్రశ్నించారు.70 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్ల రైతుబంధు ఇచ్చిన ప్రభుత్వం ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. దేశంలో 28 రాష్ట్రాలుంటే ఒక్క రాష్ట్రంలోనైనా 24 గంటలు రైతులకు కరెంటు ఇస్తున్నరా అని ప్రశ్నించారు. మూడు గంటల కరెంటు ఇస్తామని రేవంత్‌రెడ్డి, రైతుబంధు వద్దని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని, వాళ్లకు ఓటేసి కష్టాలు పడదామా అని అన్నారు. సభలో విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తప్పు చేస్తే ఎంతటివారైనా శిక్షిస్తాం....
కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త చంద్రశేఖర్‌రెడ్డి సస్పెన్షన్‌పై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... పార్టీ సీనియర్ నాయకుడు తిర్మల్‌రెడ్డిపై దౌర్జన్యం చేసినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. తప్పుడు పనులు చేసేవారిని, ప్రజలను ఇబ్బంది పెట్టేవారిని క్షమించేది లేదన్నారు. పార్టీ నాయకుడైనా, కార్యకర్త అయినా సరే తప్పు చేస్తే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment