నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): ‘నా భార్యంటే నాకు ప్రాణం. ఆమెలేని జీవితం నాకొద్దు’అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ధర్మారెడ్డి గ్రామానికి చెందిన భూమా రాజాగౌడ్ (26)కు రెండేళ్ల కిందట సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన శిరీషతో వివాహమైంది. ఆరు నెలలపాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత శిరీషను ఆమె కుటుంబసభ్యులు కాపురానికి పంపకపోవడంతో పెద్దల సమక్షంలో మాట్లాడి రాజాగౌడ్‌ను అతని తల్లిదండ్రులు తుర్కపల్లికి పంపించారు. తుర్కపల్లిలో రాజాగౌడ్ కల్లు అమ్మగా వచ్చిన రూ.3 లక్షలు శిరీష తండ్రి చింతల రాజాగౌడ్‌కు ఇచ్చాడు.
అతడు తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన శిరీష నెలకిందట కల్లుమందు తాగింది. ఇది తెలిసి అదే సమయంలో రాజాగౌడ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తర్వాత రాజాగౌడ్ ఒక్కడే ధర్మారెడ్డి గ్రామానికి వచ్చాడు. రాజాగౌడ్ తన మామ రాజాగౌడ్‌కు శనివారం ఫోన్‌చేయగా తనతో మాట్లాడేది ఏమీలేదని, వరకట్నం కేసు వేస్తామని బెదిరించినట్లు మృతుడి తండ్రి శివరామ గౌడ్ తెలిపారు. దీంతో తన భార్య తనకు దక్కదేమోనని బెంగతోపాటు అత్తమామలు, ఇతర కుటుంబసభ్యుల బెదిరింపులతో రాజాగౌడ్.. సోమవారం సాయంత్రం మండలంలోని తాండూర్ శివారులో గల అటవీప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. రాజాగౌడ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై రాజయ్య తెలిపారు.
చదవండి: పెళ్లిరోజు వేడుకలు.. అంతలోనే విషాదం!
Comments
Please login to add a commentAdd a comment