సాక్షి, కామారెడ్డి/బీబీపేట: ‘బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నరు. ఇన్నిరోజులు ఓపిక పట్టినం. ఇగ ఊరుకునేది లేదు. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టుడే. మాటకు మాట అంటం. ఈంట్ కా జవాబ్ పత్తర్ సే దేవూంగా. వడ్లు కొనమంటే కథలు చెబుతుండ్రు. ఈ అంశంపై కేంద్రం మెడలు వంచేవిధంగా ఈ నెల 12న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఉద్యమస్ఫూర్తితో ఆందోళనలు చేపడతాం’అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం కామారెడ్డిలో జరిగిన నియోజకవర్గ టీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ సాఫ్ట్ అయ్యారని అనుకుంటున్నారా.. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. ఇక నుంచి పాత కేసీఆర్‌ను చూస్తరు’అని హెచ్చరించారు. ‘ధాన్యం కొనుగోలు చేయబోమని ఢిల్లీ బీజేపీ అంటది, వరిపంట వేయుండ్రని సిల్లీ బీజేపీ చెబుతది.. ఇదెక్కడి పద్ధతి. బీజేపీ నేతలు ఎక్కువ నీలుగుతున్నరు. బాండ్‌పేపర్ మీద సంతకాలతో మోసం చేసి గెలిచినోళ్లు, తెలంగాణ కోసం ఏమీ చేయనోళ్లు ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నరు. టీఆర్‌ఎస్ తగిన సమాధానం చెబుతుంది’అని అన్నారు. తెలంగాణ పథకాలను కర్ణాటకలో అమలు చేయాలని, లేదంటే తమను తెలంగాణలో కలపాలని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే శివకుమార్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమండ్ చేస్తుంటే, ఇక్కడి బీజేపీ నేతలకు మాత్రం అవి కనబడవని ఎద్దేవా చేశారు.
జాతి నిర్మాణంలో తెలంగాణ కీలకం
బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు కూడా పింఛన్లు ఇస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రులను అభివృద్ధి చేశామని, వెయ్యి గురుకులాలు తెరిచి 5 లక్షల మంది పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఐదు శాతం జీడీపీతో జాతి నిర్మాణంలో కీలకంగా మారిందని, తలసరి ఆదాయం రెట్టింపు అయిందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లపై బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారి నాలుకలు కోసే దాక వదలమని మంత్రి ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జహీరాబాద్ ఎంపీ బీబీ, జుక్కల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు హన్మంత్ సింధే, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: (KTR: వసూలు ఇక్కడ.. ఖర్చు అక్కడా?)
మహేశ్‌బాబును తీసుకొచ్చేవాళ్లం గదా..
ప్రత్యేక ‘మిషన్’తో పనిచేసి సాగు, తాగునీటి ఇబ్బందులు తీర్చామని, విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపామని, అదేస్ఫూర్తితో విద్య, వైద్య రంగాలపై దృష్టి పెట్టామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో జనగామకు చెందిన వ్యాపారవేత్త సుభాష్‌రెడ్డి–రజనీ దంపతులు రూ.6 కోట్ల వ్యయంతో ఆధునిక వసతులతో నిర్మించిన ‘తిమ్మయ్యగారి సుశీల–నారాయణరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల’భవనాన్ని మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తదితరులతో కలసి కేటీఆర్ ప్రారంభించారు.
‘సుభాష్‌రెడ్డి స్ఫూర్తితో మా నాయనమ్మ సొంత గ్రామమైన పోసానిపల్లె (కోనాపూర్)లో ప్రాథమిక పాఠశాలను తీర్చిదిద్దుతాను’అని పేర్కొన్నారు. శ్రీమంతుడు సినిమా తన కొడుకు నిహాంత్‌ను ఆలోచింపచేసిందని, పుట్టిన ఊరికి ఏదైనా సేవ చేయాలని ప్రేరేపించడంతో స్కూల్ భవనాన్ని కట్టించానని సుభాష్‌రెడ్డి తనతో చెప్పారని కేటీఆర్ తెలిపారు. ఆ విషయం ముందుగానే చెబితే ఆ సినిమా హీరో మహేశ్‌బాబును ప్రారంభోత్సవానికి తీసుకొచ్చేవాళ్లమని అన్నారు. జూనియర్ కాలేజీ పూర్తయిన తరువాత మహేశ్‌బాబును తీసుకొస్తానని చెప్పారు. ప్రతిఒక్కరూ సుభాష్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకుని సొంత ఊరి రుణం తీర్చుకోవాలని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు అండగా నిలవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment