బారికేడ్లను తోసుకుంటూ వస్తున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు, అడ్డుకుంటున్న పోలీసులు
కామారెడ్డి టౌన్: టీఆర్‌ఎస్, బీజేపీ నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో కామారెడ్డి జిల్లా కేంద్రం సోమవారం రణరంగంగా మారింది. అవినీతి, అక్రమాలు, కబ్జాలపై బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలు పదిరోజులుగా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇరు పార్టీలు చర్చలకు సిద్ధమై మున్సిపల్ కార్యాలయంలో ప్రజాదర్బార్‌కు సోమవారం పిలుపునిచ్చారు. దీంతో ప్రజాదర్బార్‌కు అనుమతి లేదంటూ పోలీసులు 30యాక్టు అమలు చేసి, ఉదయం 9 గంటలకే మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మున్సిపల్ చైర్‌పర్సన్ తండ్రి నిట్టు వేణుగోపాల్‌రావు 10 గంటలకు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం వారిని అరెస్టు చేసి దేవునిపల్లి స్టేషన్‌కు తరలించారు. మరోవైపు బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి రమణారెడ్డి, ఏడుగురు బీజేపీ కౌన్సిలర్లు, భూ కబ్జా బాధితులతో కలిసి కార్యాలయం ముందున్న మోర్ సూపర్ మార్కెట్ వద్దకు చేరుకున్నారు. టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, అధికారులు వచ్చి బాధితులకు సరైన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ప్రజలెవరూ గుమిగూడొద్దని హెచ్చరించిన పోలీసులు బాధితులను పక్కకు లాక్కెళ్లారు. దీంతో బీజేపీ నేతలు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా ప్రతిఘటించిన బీజేపీ నేతలు ర్యాలీగా పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ధర్నా నిర్వహించారు. అక్కడా పోలీసులు, బీజేపీ నేతల మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. అనంతరం.. రమణారెడ్డితో పాటు బీజేపీ కౌన్సిలర్లు, నేతలను అరెస్టు చేసిన పోలీసులు వివిధ స్టేషన్‌లకు తరలించారు. రెండు పార్టీల ఆందోళనతో ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment