ఎల్లారెడ్డి: నిండు గర్భిణికి సకాలంలో వైద్యం అందకపోవడంతో పురిటిలోనే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబసభ్యులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీనగర్ తండాకు చెందిన దేశెట్టి రాజేశ్వరికి శుక్రవారం వేకువజామున పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108 అంబులెన్స్‌లో ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉదయం 10 గంటల వరకు కూడా ఆస్పత్రికి వైద్యులు రాలేదు.
ఆ తర్వాత వచ్చిన వైద్యురాలు నిషాత్ బూతుల్ గర్భిణీని పరీక్షించి ఇంకా కొద్దిసేపు వేచి చూద్దామని చెప్పి వెళ్లిపోయింది. మధ్యాహ్నానికి పురిటినొప్పులు ఎక్కువ కావడంతో గర్భిణిని కామారెడ్డికిగానీ, బాన్సువాడకుగానీ తీసుకునివెళ్లాలని సిబ్బంది సూచించారు. చేసేదేమీ లేక కుటుంబసభ్యులు అత్యవసరంగా స్థానికంగానే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆపరేషన్ చేయగా అప్పటికే గర్భంలోనే మగశిశువు మృతి చెందింది. తల్లి పరిస్థితి సైతం ప్రాణాపాయంలో ఉందని వైద్యులు తెలిపారు.
మృత శిశువుతో రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు వచ్చి విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శిశువు మృతి విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్రమోహన్‌ను వివరణ కోరగా, పురిటిలోనే శిశువు ఉమ్మనీరు మింగడంతో శ్వాస ఆడక మృతి చెందినట్లు చెప్పారు. ఆస్పత్రిలోని గైనకాలజిస్టు నిషాత్ బూతుల్ సెలవులో ఉన్నా గర్భిణి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి పిలిపించామన్నారు. గర్భిణిని కామారెడ్డికి రిఫర్ చేసినప్పటికీ సకాలంలో తరలించకపోవడంతో శిశువు మృతి చెందిందని తెలిపారు.
చదవండి: మరో గుడ్‌న్యూస్.. త్వరలోనే జేఎల్‌ఎం పోస్టుల భర్తీ
Comments
Please login to add a commentAdd a comment