కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎన్.శ్వేత
మహిళా పోలీసులు అంటే రిసెప్షన్, బందోబస్తులకే పరిమితం అనేది ఒకనాటి మాట. మహిళా పోలీసులు అంటే హోంగార్డు నుంచి డిజీ స్థాయి వరకు ఎక్కడ చూసినా వారే అనేది నేటి మాట. సెంట్రీ గార్డ్, పెట్రోలింగ్, డ్రైవర్ పోలీస్ స్టేషన్, సర్కిల్, సబ్‌డివిజన్ ‘ఎనీ డ్యూటీ.. వుయ్ డూ ఇట్’ అనే కాన్ఫిడెన్స్ మహిళా పోలీసుల్లో పెరిగిందని అంటూ పోలీసు శాఖలో మహిళా శక్తి గురించి ఐపీఎస్ ఆఫీసర్, కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎన్.శ్వేత ‘సాక్షి’కి వివరించారు.
‘‘గతంలో పోలీసు శాఖలో ఎక్కడో ఒక చోట మహిళా సిబ్బంది ఉండేవారు. ఏవైనా ఆందోళన ప్రదర్శనలు, వీఐపీల కార్యక్రమాలు ఉంటే మహిళల కోసం మహిళా పోలీసులను ఎక్కడెక్కడి నుంచో రప్పించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భద్రత విషయంలో వుమెన్ సేఫ్టీ వింగ్ తీసుకుంటున్న అనేక చర్యలు మహిళల్లో ఎంతో ధైర్యాన్ని నింపుతున్నాయి. మహిళలు, విద్యార్థినులు, యువతులపై వేధింపులు, దాడులను నిరోధించడంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ‘షీ టీం’ల ద్వారా పోలీసు శాఖ చాలా వరకు సక్సెస్ అయ్యింది. అలాగే వేధింపులు, దాడులకు గురైన మహిళలను చేరదీసి వారికి ధైర్యాన్ని కలిగించేందుకు ‘భరోసా’ కేంద్రాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి.
భారీగా మహిళల హాజరు
ఇటీవల పోలీసు ఎస్సైతో పాటు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షకు భారీ సంఖ్యలో యువతులు హాజరయ్యారు. అందులో ఎంపికైన వారు ఎసై ్స, కానిస్టేబుల్ శిక్షణ కూడా పూర్తి చేసుకుని విధుల్లో చేరారు. మరోవైపు పోలీసు శాఖలో హోంగార్డు నుంచి అదనపు డీజీ స్థాయి వరకు మహిళా అధికారులు తమ పనితీరుతో గుర్తింపు పొందుతున్నారు. చాలా మంది మహిళా అధికారులు శాంతిభద్రతల పరిరక్షణలో తమదైన శైలిలో పనిచేస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు.
శ్వేత, ఐపీఎస్
రాష్ట్రంలో అన్ని విభాగాలకు కలిపి 55 వేల మంది వరకు పోలీసులు ఉండగా, అందులో కానిస్టేబుల్ నుంచి అదనపు డీజీ స్థాయి వరకు 4,829 మంది ఉన్నారు. అలాగే 2 వేల మందికి పైగా హోంగార్డులుగా పనిచేస్తున్నారు. పోలీసు శాఖలో మొత్తం ఉద్యోగుల్లో మహిళల సంఖ్య ప్రస్తుతం 10 శాతానికి చేరింది. ఇంకా పెరగాల్సి ఉంది. ఇటీవల ప్రభుత్వం పోలీసు శాఖ ఉద్యోగాలలో మహిళలకు 33 శాతం కేటాయించిన మీదట వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో కొద్దిమంది మాత్రమే మహిళలు ఉన్న పోలీసు శాఖలో ఇప్పుడు దాదాపు ఏడు వేల పైచిలుకు మహిళా అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు.
డ్రైవింగ్.. ఎనీ టైమ్..
మహిళా పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్సైలు అందరికీ డ్రైవింగ్‌లో శిక్షణ ఉంటుంది. అవసరం ఏర్పడినపుడు వెహికిల్‌ను వారే స్వయంగా నడుపుకుని వెళ్లేలా శిక్షణ ఇస్తారు. మహిళా కానిస్టేబుళ్లు సెంట్రీ డ్యూటీతో పాటు బందోబస్తు డ్యూటీలు, డ్రైవింగ్, పెట్రోలింగ్, ట్రాఫిక్ డ్యూటీలన్నీ చేస్తున్నారు. ఏ డ్యూటీ అయినా చేయగలమని నిరూపిస్తున్నారు. అందుకు మానసికంగానూ సంసిద్ధులయ్యారు. అన్ని రకాల డ్యూటీలు మగవారితో సమానంగా చేసి సత్తా చాటుతున్నారు.
మరింత ప్రోత్సాహం అవసరం
మహిళా పోలీసు అధికారులు, సిబ్బందిని ప్రోత్సహిస్తే మరింతగా దూసుకుపోతారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎంతో మంది మహిళా ఉన్నతాధికారులు తమ సత్తా చాటుతున్నారు. పోలీసు డ్యూటీ అనగానే మగవారిదనే భావన సమాజంలో మెల్లమెల్లగా మాయమైపోతోంది. దీనికి అనుగుణంగా పోలీసు శాఖలో చేరడానికి మహిళలూ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పది శాతం వరకు మహిళల సంఖ్య పెరిగింది. మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది.
మహిళలకు అండగా...
పోలీసు స్టేషన్‌కు వెళ్లాలంటే మహిళలు జంకే పరిస్థితులు ఉండేవి. ఆపద ఉందని పోలీసు స్టేషన్‌కు వెళితే తమ గోడు వినేవారు ఉండకపోగా, వాళ్ల నుంచి వచ్చే ప్రశ్నలు ఇబ్బందిపెట్టేవిగా ఉండేవి. అయితే పోలీసు శాఖలో మహిళలు అధికారులుగా వచ్చిన తరువాత అనేక మార్పులు జరిగాయి. ప్రభుత్వం కూడా మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతీ ఠాణాలో మహిళా రిసెప్షనిస్టును ఉంచడం ద్వారా మహిళలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఏర్పడింది. అలాగే మహిళలపై దాడుల నిరోధానికి షీ టీమ్స్ ఏర్పాటు, మహిళపై జరిగే అఘాయిత్యాల్లో బాధితులకు ‘సఖి’ అండగా నిలవడం, ఇంకా ఎన్నో చర్యలు చేపట్టింది. ముఖ్యంగా మహిళా అధికారులు ఉన్న చోట బాధిత మహిళలు నేరుగా వెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తద్వారా వారికి సత్వర న్యాయం అందుతోంది. పోలీసు శాఖలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం ద్వారా మహిళలకు కొండంత అండ దొరికినట్టయ్యింది’’ అని వివరించారు శ్వేత.
– ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment