కామారెడ్డి: కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. రచ్చకెక్కిన విభేదాలు  | Conflict Between In Kamareddy District Congress Leaders | Sakshi
Sakshi News home page

కామారెడ్డి: కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. రచ్చకెక్కిన విభేదాలు 

Published Mon, Apr 25 2022 3:13 PM | Last Updated on Mon, Apr 25 2022 3:13 PM

Conflict Between In Kamareddy District Congress Leaders - Sakshi

సాక్షి, కామారెడ్డి: పీసీసీ ఐటీ సెల్‌ చైర్మన్‌ మదన్‌మోహన్‌ రావుపై సస్పెన్షన్‌ వేటుతో జిల్లా కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి రచ్చకె క్కాయి. ఇరువర్గాలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున చర్యలు తీసుకున్నామని డీసీసీ అధ్యక్షుడు చెబుతుండగా.. పీసీసీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిని సస్పెండ్‌ చేసే అధికారం డీసీసీ అధ్యక్షుడికి ఎక్కడిదంటూ ప్రత్యర్థి వర్గం ప్రశ్నిస్తోంది. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ)పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ చైర్మన్‌ హోదాలో ఉన్న మాజీ మంత్రి షబ్బీర్‌అలీ దశాబ్దాలుగా జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దిక్కులా ఉన్నారు.

చదవండి: కరప్షన్‌.. కలెక్షన్‌.. కేసీఆర్‌..! : ఆర్‌ఎస్పీ 

అయితే ఇటీవలి కాలంలో మదన్‌మోహన్‌రావు షబ్బీర్‌అలీకి వ్యతిరేకంగా పావులు కదుపుతుండడం ఆయనకు మింగుడు పడడం లే దు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీని కాదని వేరుగా కార్యక్రమాలు చేపట్టడంపై షబ్బీర్‌అలీ వర్గం గుర్రుమంటోంది. జహీరాబాద్‌ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన మదన్‌మోహన్‌ కామారెడ్డిలో తన ఇంటి దగ్గర ఓ కార్యాలయాన్ని ప్రారంభించడం, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడి ఎన్నికల్లో షబ్బీర్‌అలీ తనయుడిని ఓడించడం ద్వారా షబ్బీర్‌అలీపై ఆధిపత్యం చాటుకునే ప్రయత్నం చేశారన్న ప్రచారం ఉంది.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఇ ప్పటికే రెండు వర్గాలుగా చీలిపోయింది. నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి వర్గం పార్టీ ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు చేపడుతోంది. అయితే మదన్‌మోహన్‌రావు వర్గం వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలా రెండు వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతుండండతో కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఎల్లారెడ్డి నియోజక వర్గంలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా రెండు వర్గాల మధ్య గొడవలు సైతం జరిగాయి. ఫ్లెక్సీలు చించుకున్నారు.

జిల్లా అంతటా వివాదం 
గతంలో జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంనుంచి పోటీ చేసి ఓటమి పాలయిన మదన్‌మోహన్‌రావుకు జిల్లా అంతటా పరిచయాలు పెరిగాయి. దీంతో ఆయన జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల్లో పర్యటిస్తూ తన వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. దీంతో పారీ్టలో వివాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్‌అలీదే పైచేయిగా ఉన్నా.. ఇటీవల ఆయనను కాదని మదన్‌మోహర్‌రావు జాబ్‌మేళా నిర్వహించారు.

దీనికి పీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ అజారుద్దీన్‌ను రప్పించడం ద్వారా షబ్బీర్‌అలీకి సవాల్‌ విసిరారని భావిస్తున్నారు. అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా నేతలు విడిపోయి ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు పరిస్థితి దిగజారింది. బాన్సువాడలోనూ రెండు వర్గాలయ్యాయి. మదన్‌మోహన్‌రావు చర్యలను ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు తప్పుపడుతున్నారు. తమ నియోజకవర్గంలో తమకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

డీసీసీ అధ్యక్షుడిపై ట్రోలింగ్‌.. 
సస్పెన్షన్‌ వ్యవహారంలో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డీసీసీ అధ్యక్షుడిని వివరణ కోరడాన్ని మదన్‌మోహన్‌రావు వర్గం తనకు అనుకూలంగా తీసుకుంటోంది. మాజీ మంత్రి షబ్బీర్‌అలీ ప్రధాన అనుచరుడైన డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావుపై సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోలింగ్‌ చేస్తోంది. పీసీసీ ప్రతినిధిని సస్పెండ్‌ చేసే హక్కు డీసీసీ అధ్యక్షుడికి ఎక్కడిదంటూ మదన్‌మోహన్‌రావు అనుచరులు వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. అంతేగాక డీసీసీ అధ్యక్షుడి లేఖ, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లేఖలను జత చేసి ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి’ అంటూ పేర్కొంటూ కైలాస్‌ శ్రీనివాస్‌రావ్‌ ఫొటో మార్ఫింగ్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు. ఇలా రెండువర్గాల మధ్య రోజురోజుకు ముదురుతున్న వివాదంతో పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి. వివాదాన్ని పరిష్కరించాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరుతున్నారు.

48 గంటల్లో వివరణ ఇవ్వండి
పీసీసీ ఐటీసెల్‌ చైర్మన్‌గా ఉన్న మదన్‌మోహన్‌రావును సస్పెండ్‌చేసే అధికారం డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావ్‌కు లేదని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పేరుతో ఆదివారం ఓ లేఖ విడుదలైంది. పీసీసీ నేతలను సస్పెండ్‌ చేసే అధికారం జిల్లా స్థాయి నేతలకు లేదన్న ఆయన.. ఎలాంటి ఆధారాలతో ఈ చర్యలు తీసుకున్నారో 48 గంటల్లో వివరణ ఇవ్వాలని కోరారు. వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement