సాక్షి, సిద్ధిపేట: కీలక సమయంలో బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నాయకులపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీలు మారే వారిని పవర్ బ్రోకర్లుగా పేర్కొన్నారు. కొంతమంది రాజకీయ అవకాశ వాదులు పార్టీని విడిచి వెళ్లిపోతున్నారని, ఇదేం పార్టీకి కొత్తకాదని అన్నారు.తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు 10 మంది కూడా పార్టీలో లేరని, అయినా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెచ్చి చూపెట్టారని ప్రస్తావించారు.
ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పక్కన ఉన్న నాయకులను కాంగ్రెస్ వాళ్లు ఇలాగే కొన్నారని గుర్తు చేశారు. నాయకులను కాంగ్రెస్ కొనవచ్చు కానీ ఉద్యమకారులను కొనలేరు, కార్యకర్తలను కొనలేరని అన్నారు. పార్టీలోకి మధ్యలో వచ్చిన వాళ్ళు పార్టీలోంచి వెళ్లిపోతున్నారని తెలిపారు. పోయినవారిని రేపు కాళ్ళు మొక్కిన మళ్ళీ పార్టీలోకి తీసుకోవద్దని పార్టీ నిర్ణయించిందని పేర్కొన్నారు.
కష్ట కాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టేనన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారిని పార్టీలోకి రానిచ్చే పరిస్థితి లేదన్నారు.. ఇది ఆకులు రాలే కాలమని, ఇప్పుడు అట్లనే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులు చెత్తకుప్పలో కలిసిపోతున్నాయని అన్నారు. ఆకులు పోయాక మళ్లీ కొత్త చిగురు వచ్చి ఆ చెట్టు వికసిస్తుందన్నారు. కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చని, తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటదని తెలిపారు.
చదవండి: కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా వాళ్లను మళ్లీ పార్టీలో చేర్చుకోం: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment