మధ్యప్రదేశ్‌లో తొలి దశ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను పూరించే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే కాంగ్రెస్ నేటివరకూ రాష్ట్రంలోని అన్ని స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయలేకపోయింది. సీనియర్ నేతలు ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో వెనుకంజ వేయడమే దీనికి ప్రధాన కారణమనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో 29 లోక్‌సభ స్థానాలు ఉండగా, పరస్పర ఒప్పందంతో ఖజురహో పార్లమెంటరీ స్థానాన్ని సమాజ్‌వాదీ పార్టీకి కాంగ్రెస్ అప్పగించింది. ఇంకా 28 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ 28 స్థానాల్లో కాంగ్రెస్ 10 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను నిర్ణయించగలిగింది. 18 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ఇంకా నిర్ణయించలేదు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం దిగ్విజయ్ సింగ్, అజయ్ సింగ్, అరుణ్ యాదవ్, ఉమంగ్ సింగర్, జైవర్ధన్ సింగ్, ప్రియవ్రత్ సింగ్, జితు పట్వారీ, వివేక్ తంఖా తదితర సీనియర్ నేతలు ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ ఆహ్వానించింది. అయితే వీరిలోని పలువురు తమకు ఆసక్తి లేదని చెబుతున్నారని సమాచారం.
పార్టీలోని అనుభవజ్ఞులను రంగంలోకి దింపాలని యోచిస్తున్నా వారు పోటీకి విముఖత చూపడంతో అభ్యర్థుల జాబితా ఇంకా ఖరారు కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు పలువురు ఎమ్మెల్యేలను రంగంలోకి దింపాలని కూడా పార్టీ యోచిస్తోందని సమాచారం. పార్టీ హైకమాండ్ నేరుగా సీనియర్ నేతలతో మాట్లాడిన తర్వాతనే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల పేర్లను ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment