సాక్షి, కామారెడ్డి : జాతీయస్థాయిలో కామారెడ్డి జిల్లాకు అత్యుత్తమ పురస్కారం లభించింది. డిజిటల్ గవర్నెన్స్‌లో వెబ్‌రత్న –2020 అవార్డుకు ఎంపికైంది. ఈ విషయాన్ని కలెక్టర్ శరత్ శనివారం తెలిపారు. అవార్డుకు ఎంపికవడానికి కారణాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో జిల్లా గురించి సంక్షిప్తంగా మ్యాప్, చరిత్ర, పరిపాలన విభాగం, జనాభా తదితర అంశాలను వివరణాత్మకంగా రూపొందించి వెబ్‌సైట్‌లో సమాచారాన్ని నమోదు చేశామన్నారు. జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారుల వివరాలు, ఫోన్‌నెంబర్లు, ఇతర అన్ని రకాల సమాచారాన్ని పొందుపరిచామని తెలిపారు. వెబ్‌సైట్‌లో జిల్లా పరిపాలన, చారిత్రక, భౌగోళిక నేపథ్యం గురించి చిత్రాలతో వివరించామన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జీఐజీడబ్ల్యూ నిబంధనల ప్రకారం నవీకరించిన సమాచారం అందుబాటులో ఉందన్నారు.
కలెక్టర్ శరత్
పర్యాటక సమాచారం, ప్రదేశాలు, వసతి, సంస్కృతి, పండుగలు, ఉత్పత్తులు, ముఖ్యమైన దేవాలయాల సమాచారాన్ని ఇంగ్లిష్, తెలుగు భాషల్లో జిల్లా వెబ్‌సైట్‌లో నమోదు చేశామని వివరించారు. ఆసక్తికర సంఘటనలు, మతపరమైన ప్రదేశాల ఫొటో గ్యాలరీలు, పథకాలు, ప్రాజెక్టులు లాంటి వివరాలతో వెబ్‌సైట్ సమగ్ర సమాచారాన్ని కలిగి ఉందన్నారు. హోంపేజీలో తాజా రోజువారి సంఘటనలు, ప్రెస్‌నోట్‌లు, కోవిడ్–19 సమాచారం ఉంచుతున్నామని తెలిపారు. జిల్లా వెబ్‌సైట్‌ను బలమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించామని, ఎప్పటికప్పుడు నవీకరిస్తున్నామని వివరించారు. కామారెడ్డి జిల్లా https://kamareddy.telangana.gov.in వెబ్‌సైట్ సేవలను ప్రజలందరూ వినియోగించుకుని అభిప్రాయాలను తెలపాలని కోరారు. ఈనెల 30 వతేదీన ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకోనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment