ఉప్పల్‌వాయి గ్రామ చేదబావుల్లో జలసిరులు
సాక్షి, కామారెడ్డి : చుట్టు పక్కల గ్రామాల్లో బిందెడు నీళ్లకు గోస పడుతుంటే ఆ ఊళ్లో మాత్రం చేదబావుల్లో నీరు పుష్కలంగా ఊరుతోంది. నాలుగు అడుగుల లోతులో ఉన్న నీళ్లను తోడుకునేందుకు బొక్కెన వేసి రెండు చేతులతో నీటిని పైకి లాక్కుంటారు. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం ఉప్పల్‌వాయి గ్రామంలో ఇళ్లల్లో వందకు పైగా చేదబావులు ఉన్నాయి. తాతల కాలం నుంచి ఆ ఊరి జనం చేదబావులను వాడుతున్నారు.
ఎక్కడ కరువొచ్చినా ఉప్పల్‌వాయిలో మాత్రం నీళ్లకు కరువు అన్న ముచ్చటే తెలియదని గ్రామస్తులు అంటున్నారు. ఇరవై ఏళ్ల నాడు ఒకసారి బావుల్లో నీరు కొంతమేర తగ్గినా, తర్వాతి కాలంలో ఏనాడూ ఊటలు తగ్గలేదని పేర్కొంటున్నారు. ఉప్పల్‌వాయి గ్రామంలో 438 ఇళ్లు ఉన్నాయి. గ్రామ జనాభా 2,478. గ్రామంలో 145 వరకు చేదబావులు ఉన్నాయి. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా, చాలామంది చేదబావుల నీటిని కూడా వాడుతున్నారు.
కొందరు చేదబావుల్లో మోటార్లు ఏర్పాటు చేసుకోగా, మిగతావారు గిరక ద్వారా చేదుకుంటున్నారు. చాలా ఇళ్ల ముందు చేతబావి కనిపిస్తుంది. బయటకు వెళ్లి వచ్చినవారు బొక్కెనతో నీటిని చేదుకొని కాళ్లు, చేతులు కడుక్కుని ఇంట్లోకి అడుగుపెడుతుంటారు. గ్రామంలో పాత ఇళ్ల వద్ద చేదబావులు ఉన్నాయి. కొత్తగా బంగళాలు నిర్మించుకుంటున్న వారు మాత్రం బోర్లు వేయించుకుంటున్నారు.
బావులు ఎన్నడూ ఎండిపోలేదు
నాకు ఇప్పుడు డెబ్బై ఏళ్లపైనే ఉంటయి. నాకు బుద్ధి తెలిసిన నాటి నుంచి బావులు ఎండిపోయింది ఎన్నడూ ఎరుకలేదు. బిందెలతో ముంచుకున్నం. బొక్కెనలతో రెండు చేతులు వేస్తే చాలు నీళ్లు అందుతాయి. మా తాతల కాలం నుంచి ఊళ్లో నీళ్లకు కరు వు లేదు. బావుల్లో నీరు పుష్కలంగా ఉంటోంది. –ఆల నారాయణ, ఉప్పల్‌వాయి
అవసరం ఉన్నప్పుడల్లా చేదుకుంటం...
మా ఇంట్లో రెండు కుటుంబాలున్నాయి. అవసరం ఉన్నప్పుడల్లా బావిలో నుంచి చేదుకుంటాం. రెండుసార్లు చేతులు వేస్తే చాలు బొక్కెన పైకి వచ్చేస్తుంది. నాకు పెళ్లయి ఇక్కడికి వచ్చిన నాటి నుంచి బావుల్లో నీళ్లు ఎండిపోయింది ఎన్నడూ లేదు. నీళ్ల ఇబ్బంది ఎదురు కాలేదు. – సుతారి మహేశ్వరి, ఉప్పల్‌వాయి
మా తాత తవ్వించిన బావి...
మా ఇంటి దగ్గర మా తాతలు తవ్వించిన బావి ఎన్నడూ ఎండిపోలేదు. ఇప్పుడు మేం కూడా బావి నీటిని వాడుకుంటున్నం. బావికి మోటార్ బిగించి పైన ట్యాంకుకు కనెక్షన్ ఇచ్చాం. ట్యాంకు ద్వారా నీటిని వాడుకుంటున్నాం.
–శంకర్‌గౌడ్, ఉప్పల్‌వాయి
Comments
Please login to add a commentAdd a comment