సాక్షి, కామారెడ్డి: ఓ మహిళ తన భర్త కోసం 40 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. నిరాహార దీక్ష నేటికి 41వ రోజుకు చేరుకుంది. భర్త నవీన్ ఇంటి ముందే ఆమె న్యాయ పోరాటం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు అశోక్ నగర్ కాలనీలో భర్త కోసం భార్య పైడి అరుణ భర్త ఇంటిముందు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాలో మాట్లాడుతూ.. పైడి నవీన్‌తో తనకు 2017 సంవత్సరంలో పెళ్లి జరిగిందని, పెళ్లి సమయంలో 14 లక్షల నగదు , 23 తులాల బంగారం కట్నంగా ఇచ్చామని తెలిపారు. పెళ్లి తర్వాత ఆరు నెలల వరకు తాము బాగానే ఉన్నామని, ఆ తర్వాత అదనంగా రూ. 15 లక్షల కట్నం తీసుకురావాలని తన అత్తమామలు వేధింపులకు గురిచేశారని చెప్పారు.
తన మామ సురేందర్ అసభ్యకర పదజాలంతో దూషించాడని ఆరోపించారు. తనకు పిల్లలు పుట్టరని వదంతులు సృష్టించి తన భర్తకు మరో పెళ్లి చేయాలని కుట్ర పన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ విషయం తెలిసిన వెంటనే కుల పెద్దల సమక్షంలో మాట్లాడిన్నట్టు తెలిపారు. కానీ, తాజాగా మరో అమ్మాయితో తన భర్తకు పెళ్లి చేయాలని తన అత్తమామలు చూస్తున్నారని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం రోజైనా తనకు న్యాయం చేయలని అరుణ కోరుతున్నారు. తనకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు.
చదవండి: వృద్ధుడిని నమ్మించి..కోటి రూపాయలతో ఉడాయించి
Comments
Please login to add a commentAdd a comment