డిచ్‌పల్లి(నిజామాబాద్ రూరల్): మెస్ హాల్‌లోని బెంచీ మీద కూర్చునే విషయమై ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్ధిపూర్ శివారులోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ నగరంలోని గౌతంనగర్‌కు చెందిన ఓవిద్యార్థి(14) బర్ధిపూర్ మైనారిటీ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
మధ్యాహ్న భోజన సమయంలో మెస్ హాల్‌లోని బెంచీ మీద కూర్చునే విషయమై ఈ విద్యార్థితోపాటు మరో విద్యార్థి పోటీపడ్డారు. ‘నేను ముందుగా వచ్చానంటే, నేను ముందుగా వచ్చాను’అని ఇద్దరూ గొడవపడ్డారు. సదరు విద్యార్థి ఛాతీపై పిడికిలి బిగించి బలంగా కొట్టడంతో నేలపై బోర్లా పడిపోయాడు. టీచర్లు, తోటి విద్యార్థులు వెంటనే వచ్చి బాధిత విద్యార్థిని పైకి లేపేందుకు యత్నించగా, అప్పటికే అపస్మారకస్థితికి చేరుకున్నాడు.
ఆందోళన చెందిన ఉపాధ్యాయులు ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ ఎండీ జమీల్‌కు చేరవేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి బాధిత విద్యార్థిని తరలించగా వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించా రు. ఉపాధ్యాయులు ఇచ్చిన సమాచారం మేరకు ఆస్పత్రికి చేరుకున్న బాధితుడి తల్లి, కుటుంబీకులు, బంధువులు మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు.
విద్యార్థి మృతిపై పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది భిన్నమైన కథనాలు చెప్పడంతో అతడి కుటుంబీకులు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే ప్రిన్సిపాల్‌సహా బా ధ్యులైన సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డిచ్‌పల్లి ఎస్సై గణేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment