సాక్షి, కామారెడ్డి జిల్లా: శిశు విక్రయ ఘటనలో సమన్విత ఆసుపత్రిపై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. వైద్య శాఖ అధికారులు ఆసుప్రతిని సీజ్ చేశారు. అనుమతి లేకున్నా.. ఫెర్టిలిటీ పేరుతో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ, స్త్రీ లింగం పై వివక్ష చట్టం కింద కేసులు నమోదు చేశారు. శిశు విక్రయ కేసులో ఆసుపత్రి ప్రభుత్వ వైద్యుడు సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, పుట్ట బోయేది ఆడో మగో తెలుసుకోవడానికి జనం ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లకు పరుగులు తీస్తుండగా.. వారి ఆసక్తిని సొమ్ము చేసుకుంటూ వాటి నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పుట్టేది అడబిడ్డ అని తెలియగానే కడుపులోనే చంపేయాల నుకుంటున్నవారి అవసరాన్ని సొమ్ము చేసుకుంటూ అబార్షన్లు చేస్తున్నారు. స్కానింగ్, అబార్షన్ల కోసం రెండు మూడు రాష్ట్రాల నుంచి కామారెడ్డిలోని సమన్విత ఆస్పత్రికి వచ్చేవారంటే.. ఆ ఆస్పత్రి ఎంత ఫేమస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆస్పత్రులలో తనిఖీలు చేయకుండా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులూ ఈ పాపంలో భాగమయ్యారు.
గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగాలేనపు డు, బిడ్డ వల్ల తల్లికి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నపుడు అబార్షన్ చేస్తారు. దీనికి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనుమతులు పొందాల్సి ఉంటుంది. సమన్విత ఆస్పత్రికి దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని వైద్యారోగ్య శాఖ అధికారుల విచారణలో వెల్లడైంది. కాగా సమన్విత ఆస్పత్రిలో వైద్య సేవలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంటీపీకి సంబంధించి చార్జీలు పొందుపరచడాన్ని చూసి వైద్య ఆరోగ్యశాఖ అధికారుల అవాక్కయ్యారు. మూడు నెలలలోపు గర్భవిచ్ఛిత్తి కోసం రూ. 5 వేలు, మూడు నెలలు దాటిన గర్భవిచ్ఛిత్తి కోసం రూ. 10 వేలు చార్జీగా అందులో పేర్కొనడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment