child sale
-
శిశు విక్రయ ఘటన.. కలెక్టర్ సీరియస్.. ఆసుపత్రి సీజ్
సాక్షి, కామారెడ్డి జిల్లా: శిశు విక్రయ ఘటనలో సమన్విత ఆసుపత్రిపై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. వైద్య శాఖ అధికారులు ఆసుప్రతిని సీజ్ చేశారు. అనుమతి లేకున్నా.. ఫెర్టిలిటీ పేరుతో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ, స్త్రీ లింగం పై వివక్ష చట్టం కింద కేసులు నమోదు చేశారు. శిశు విక్రయ కేసులో ఆసుపత్రి ప్రభుత్వ వైద్యుడు సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా, పుట్ట బోయేది ఆడో మగో తెలుసుకోవడానికి జనం ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లకు పరుగులు తీస్తుండగా.. వారి ఆసక్తిని సొమ్ము చేసుకుంటూ వాటి నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పుట్టేది అడబిడ్డ అని తెలియగానే కడుపులోనే చంపేయాల నుకుంటున్నవారి అవసరాన్ని సొమ్ము చేసుకుంటూ అబార్షన్లు చేస్తున్నారు. స్కానింగ్, అబార్షన్ల కోసం రెండు మూడు రాష్ట్రాల నుంచి కామారెడ్డిలోని సమన్విత ఆస్పత్రికి వచ్చేవారంటే.. ఆ ఆస్పత్రి ఎంత ఫేమస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆస్పత్రులలో తనిఖీలు చేయకుండా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులూ ఈ పాపంలో భాగమయ్యారు.గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగాలేనపు డు, బిడ్డ వల్ల తల్లికి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నపుడు అబార్షన్ చేస్తారు. దీనికి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనుమతులు పొందాల్సి ఉంటుంది. సమన్విత ఆస్పత్రికి దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని వైద్యారోగ్య శాఖ అధికారుల విచారణలో వెల్లడైంది. కాగా సమన్విత ఆస్పత్రిలో వైద్య సేవలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంటీపీకి సంబంధించి చార్జీలు పొందుపరచడాన్ని చూసి వైద్య ఆరోగ్యశాఖ అధికారుల అవాక్కయ్యారు. మూడు నెలలలోపు గర్భవిచ్ఛిత్తి కోసం రూ. 5 వేలు, మూడు నెలలు దాటిన గర్భవిచ్ఛిత్తి కోసం రూ. 10 వేలు చార్జీగా అందులో పేర్కొనడం విశేషం. -
పిల్లలను కొన్న వారి పై కేసులు బయటపడ్డ ముఠా ఆడియో
-
పాపం పసివాళ్లు
-
వాట్సాప్‌లో ఫొటోలు.. ముహూర్తం రోజున డెలివరీ..
సాక్షి, హైదరాబాద్: పాలుతాగే పసికందులను అపహరించి, విమానాలు, రైళ్లలో రాష్ట్రాలు దాటించి పిల్లలు లేని దంపతులకు విక్రయిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. ఫెర్టిలిటీ సెంటర్లు, ఆస్పత్రులు, క్లినిక్‌లలో పనిచేసే ఫోర్త్‌క్లాస్ ఉద్యోగులను ఏజెంట్లుగా పెట్టుకొని, దంపతుల సమాచారం సేకరించి, మధ్యవర్తుల సహాయంతో ఐదేళ్లుగా ఈ అక్రమ దందా సాగుతోంది. ఢిల్లీ, పుణే నగరాల్లో రోజుల శిశువులను ఎత్తుకొచ్చి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ఒక్క పసికందును రూ.1.80 లక్షల నుంచి రూ.5.50 లక్షల చొప్పున అమ్మేస్తున్నారు. ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించిన 11 మంది మధ్యవర్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలను మల్కాజ్గిరి డీసీపీ పీవీ.పద్మజ, శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) అధికారులతో కలిసి రాచకొండ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి మంగళవారం మీడియాకు వెల్లడించారు.👉ఈనెల 22న పీర్జాదిగూడలో మూడు నెలల పాపను విక్రయిస్తుండగా మేడిపల్లి పోలీసులు స్థానిక ఆర్ఎంపీ శోభారాణితోపాటు స్వప్న, షేక్ సలీంలను అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులను విచారించగా వీరి తరహాలోనే ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 8 మంది మధ్యవర్తుల పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కేసును రివర్స్ ఇన్వెస్టిగేషన్ చేశారు. అన్నోజిగూడకు చెందిన బండారి హరిహర చేతన్– బండారి పద్మ, కుషాయిగూడకు చెందిన యాట మమత, ఉప్పుగూడకు చెందిన ముధావత్ రాజు, విజయవాడకు చెందిన బలగం సరోజ, ముధావత్ శారద, ముంతాజ్, జగన్నాథం అనురాధలను పట్టుకున్నారు. ఈ మధ్యవర్తుల సహాయంతో ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణేకు చెందిన కన్నయ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంతానం లేని దంపతులకు పిల్లలను విక్రయిస్తున్నారు. ఐదేళ్లలో 60 మంది శిశువులను విక్రయించారు. తాజా కేసులో 16 మంది పిల్లలను విక్రయానికి పెట్టగా.. ఏడుగురిని ఏపీ, 9 మందిని తెలంగాణకు చెందిన దంపతులు కొనుగోలు చేశారు. మధ్యవర్తులను విచారించిన పోలీసులు 16 మంది చిన్నారులను కాపాడారు. శిశువిహార్‌కు తరలించారు. వీరిలో 12 మంది అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలున్నారు. ప్రతి శిశువు అమ్మకంపై ఒక్క ఏజెంట్‌కు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు లాభం పొందేవారు. పరారీలో ఉన్న నిందితులు కిరణ్, ప్రీతి, కన్నయ్యల కోసం పోలీసులు గాలిస్తున్నారు.ముహూర్తం చెబితే పిల్లాడు డెలివరీవాట్సాప్, టెలిగ్రాం వంటి సామాజిక మాధ్యమాలలో పిల్లల ఫొటోలు పంపిస్తారు. శిశువుల రంగు, ముఖ కవలికలను బట్టి ఎంపిక చేసుకుంటారు. ఫలానా ముహూర్తానికి పిల్లాడు కావాలని చెబితే చాలు ఆ సమయానికే పిల్లాడిని తీసుకొచ్చి అప్పగిస్తారు. రోజుల వయస్సున శిశువులనే దంపతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ వయసులో అయితేనే తనకు పుట్టిన బిడ్డగా, పిల్లలకు కూడా వీరే సొంత తల్లిదండ్రులని భావిస్తారు.పిల్లలకు దూరం చేయకండి పిల్లలను రెస్క్యూ హోంకు తరలిస్తుండగా అప్పటివరకు పెంచి పోషించిన తల్లిదండ్రులు తమ పిల్లలను దూరం చేయొద్దంటూ రాచకొండ కమిషనరేట్ ముందు అడ్డుపడ్డారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు తల్లిదండ్రులను మేడిపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఓ దంపతులను ‘సాక్షి’ పలకరించగా.. పెళ్లై 12 ఏళ్లు అయినా పిల్లలు కలగలేదని, ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోవడంతో ఆఖరికి దిక్కుతోచని స్థితిలో రెండున్నర ఏళ్ల క్రితం ఆరు రోజుల పసికందును కొనుగోలు చేశామని రావులపాలెంకు చెందిన ఓ జంట తెలిపారు. రూ.3.5 లక్షలు ఖర్చు చేసి 21వ రోజును ఘనంగా చేశామన్నారు. రూ.కోట్లాది ఆస్తిపాస్తులను వారసుడి పేరు మీద రాసేందుకూ సిద్ధమయ్యామని చెప్పారు. ఇలాంటి సమయంలో పిల్లాడిని పోలీసులు తమ నుంచి దూరం చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. -
రెండో పెళ్లి కోసం తొమ్మిది నెలల పసికందుని 'అమ్మే'సింది
చెన్నై: ప్రస్తుతం సమాజంలో వివాహ వ్యవస్థకు విలువ లేకుండా పోతోంది. భారతదేశ కుటుంబ వ్యవస్థ గురించి ప్రపంచ దేశాలన్ని ప్రశంసిస్తుంటే దానికి విరుద్ధంగా ఇటీవల కాలంలో ఎక్కువగా జంటలు విడిపోయి కుటుంబ వ్యవస్థకు అర్థం లేకుండా చేయడం అత్యంత బాధాకరం. ఒక వేళ వాళ్లకు పిల్లలు లేకపోతే సరే కానీ ఉంటే వారి పరిస్థితి గురించి ఇక చెప్పవల్సిన అవసరం లేదు. కానీ చెన్నైలోని ఒక జంట విడిపోయి మళ్లీ పెళ్లి చేసుకోవడం కోసం కన్న బిడ్డనే విక్రయించిన ఒక ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన అందర్నీ విస్మయానికి గురి చేసింది. (చదవండి: హక్కుల భంగం.. ఇదా మీ తీరు?) వివరాల్లోకెళ్లితే చెన్నైలోని విరుధునగర్ జిల్లాకు చెందిన జెబమలార్(28) అనే ఆమెకు అదే జిల్లాకు చెందిన ఆర్ మణికందన్(38)తో 2019లో వివాహం జరిగింది. కొద్ది నెలలకు తమ వైవాహిక జీవితంలో సమస్యలు రావడంతో ఇద్దరు విడిపోయారు. పైగా వారికి తోమ్మిది నెలల బాబు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో జెబమలార్ తన బాబుని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకు పునర్వివాహం చేయాలనకున్నారు, కానీ దీనికి ఆమె కొడుకు(9 నెలలు) అడ్డుగా ఉన్నాడని ఆ పసికందుని అమ్మేయాలని ఆమె, ఆమె తల్లిదండడ్రులు, సెల్వరాజ్, కురిబా, సోదరుడు ఆంటోని, మామా డానియెల్ భావించారు. దీంతో ఇద్దరూ బ్రోకర్లు కార్తికేయన్, జేసుదాసుని సంప్రదించారు. ఈ మేరకు ఆమె భర్త మణికందన్‌కి ఈ విషయాలు ఏమి తెలియదు. అయితే పిల్లలు లేని ఒక జంట సెల్వమణి, అతని భార్య శ్రీదేవి దంపతులకు ఆ బాబును రూ. 3 లక్షలకు అమ్మేశారు. ఈ మేరకు మణికందన్ తన బిడ్డ కోసం జెబమలార్ దగ్గరకు వెళ్తే బిడ్డ లేదు. దీంతో మణికందన్ అనుమానంతో పోలీసులను సంప్రదించాడు. ఈ క్రమంలో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులు ఆ పిల్లడిని కొనుగోలు చేసిన దంపతులను, మీడియేటర్లను అరెస్ట్ చేశారు. మరోవైపు ఆ పసికందు తల్లి జెబమలార్ ఆమె సంబంధికులు పరారీలో ఉన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని ఒక జంట తమ పెద్ద కూతురి(16) వైద్య చికిత్స నిమిత్తం తమ 12 ఏళ్ల చిన్న కూతురిని తమ పొరుగువారికి విక్రయించిన సంఘటన మరిచిపోకముందే ఈ ఘటన జరగడం బాధాకరం. (చదవండి: స్పైసీ మ్యాగీ మిర్చి గురూ) -
తల్లీ, కుమార్తెల ఘరానా మోసం.. పిల్లల్ని సాకుతామని తీసుకెళ్లి..
సాక్షి, మైసూరు (కర్ణాటక): మైసూరుతో పాటు జిల్లాలో చిన్నపిల్లలను పోషిస్తామని తీసుకెళ్లి విక్రయిస్తున్న వ్యవహారంలో తల్లీ కుమార్తెను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నంజనగూడుకు చెందిన శ్రీమతి అలియాస్ సరస్వతి, ఆమె కుమార్తె లక్ష్మి. నెలరోజుల కిందట జ్యోతి అనే పేద మహిళకు మైసూరులో మగబిడ్డ పుట్టగా, ఆమె వెంట ఉన్న శ్రీమతి బిడ్డను తాను సాకుతానని ఇంటికి తెచ్చుకుంది. కొన్నిరోజుల తరువాత ఆ బిడ్డను ఇతరులకు డబ్బులకు అమ్ముకుంది. నా బిడ్డ నాకు కావాలని జ్యోతి వచ్చి అడగడంతో వేరేవారికి ఇచ్చేశానని శ్రీమతి చెప్పింది. నా బిడ్డను ఇప్పించాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది, శ్రీమతి, ఆమె కుమార్తె కలిసి జిల్లాలో పలువురి బిడ్డలను ఇలా అమ్ముకున్నారని తెలిసి పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కో శిశువును రూ.3 – 5 లక్షల వరకు అమ్మేసినట్లు వారు ఒప్పుకున్నారు. -
ఆరా తీసి.. ఆశ చూపి
శంషాబాద్ : శిశు విక్రయాల ముఠా గుట్టు రట్టయింది. సులభ మార్గంలో డబ్బు సంపాదనే ధ్యేయంగా శిశువుల విక్రయాన్ని వృత్తిగా మార్చుకున్న వ్యక్తిని ఆర్జీఐఏ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 12 మంది చిన్నారులను విక్రయించినట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. నిందితుడితోపాటు అతనికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. బుధవారం శంషాబాద్ డీసీపీ పి.వి. పద్మజ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గ్రామానికి చెందిన గంగాధర్‌రెడ్డి (32) మొదటి భార్యకు విడాకులిచ్చి 2013 నుంచి నగరంలోని గాజులరామారంలో నివాసముంటున్నాడు. సంతాన సాఫల్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఇతడు అక్కడికి వచ్చిపోయే వారిలో అధిక సంతానం ఉన్న వారి వివరాలు సేకరించేవాడు. వారి అవసరాలను గుర్తించి వారి పసికందులను తీసుకొచ్చి విక్రయించే దందాను గత మూడేళ్లుగా కొనసాగిస్తున్నాడు. తాజాగా మాచర్ల శివపురం తండాలోని లక్ష్మీ అనే మహిళకు మూడో సంతానంగా పుట్టిన పదిహేను రోజుల ఆడ శిశువును తీసుకుని ఆమెకు రూ.83 వేలు ఇచ్చాడు. ఆ పాపను తీసుకుని గతంలో ఇలాంటి వ్యవహారంలో తనకు సహకరించిన శంషాబాద్ పట్టణంలో రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివాసముంటున్న సురేష్, మంగ దంపతులకు అప్పగించాడు. శిశువుకు అధిక ధర వచ్చే వరకు ఆలనాపాలనా చూసుకోవాలని అప్పజెప్పాడు. అయితే అకస్మాత్తుగా ఆ దంపతుల వద్ద చిన్నారి కనిపించడంతో.. అనుమానం వచ్చిన ఎయిర్‌పోర్టులో పనిచేసే ఓ క్యాబ్ డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. ఈ నెల 23న రంగంలోకి దిగిన పోలీసులు ముందుగా మంగను అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం పన్నెండు మంది చిన్నారులు మంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా శిశువుల విక్రయ దందా వెలుగుచూసింది. గంగాధర్‌రెడ్డి గతంలో కూడా ఓ పసికందును తన వద్ద కొన్ని రోజులు ఉంచి ఆలనాపాలనా చూసినందుకు రూ. 10 వేలు ఇచ్చాడని వెల్లడించింది. ఆ పాపను స్థానికంగా తహసీన్ పాషా అనే వ్యక్తికి రూ. 1.60 వేలకు విక్రయించినట్లు తెలిపింది. మంగ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గంగాధర్‌రెడ్డిని రెండురోజుల కిందట అతడి స్వగృహంలో అరెస్ట్ చేశారు. గతంలో విక్రయించిన చిన్నారితో పాటు మంగ వద్ద ఉన్న చిన్నారిని సైతం బండ్లగూడలోని శిశువిహార్‌కు తరలించారు. పోలీసుల దర్యాప్తులో మొత్తం 12 మంది పసికందులను తాను విక్రయించినట్లు గంగాధర్‌రెడ్డి వెల్లడించాడు. గతంలో అతడిపై గాంధీనగర్, మాదన్నపేట, ఛత్రినాకా పోలీస్స్టేషన్ల పరిధిలో ఇదే తరహా కేసులు నమోదయ్యాయి. బెయిల్‌పై వచ్చిన అతడు తిరిగి అదే దందాను కొనసాగిస్తున్నాడు. ఈ కేసులో మంగను రెండురోజుల కిందటే పోలీసులు రిమాండ్‌కు తరలించగా గంగాధర్‌కు విక్రయాలకు సహకరించిన శ్రీను, శిరీష, శారద, అరుణ లక్ష్మీలను రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఏసీపీ అశోక్‌కుమార్‌గౌడ్, సీఐ మహేష్‌లు పాల్గొన్నారు. -
దారుణం : రూ.200లకు కన్నబిడ్డను అమ్మిన అమ్మ
ఈశాన్య రాష్ట్రం త్రిపురలో దారుణం జరిగింది. తినడానికి తిండిలేని ఓ గిరిజన కుటుంబం పూట గడవడం కోసం రెండేళ్ల కుమారుడిని రూ.200లకు అమ్ముకున్నారు. ఈసంఘటన రాష్ట్ర రాజధాని అగర్తలాకు 112కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్కుమార్పురాలో జరిగింది. రుయనాభాటీ రేయంగ్ దంపతులు కటిక పేదరికం అనుభవిస్తున్నారు. వీరికి ప్రభుత్వం తరపున ఏ సంక్షేమ పథకాలు అందంటం లేదు. ఒకపూట కూడా తినడానికి తిండి లేని సమయాన తన రెండేళ్ల కుమారుడిని మచ్కుంభీర్కు చెందిన ఆటో డ్రైవర్ ధన్షాయ్కు గత ఏప్రిల్ 13న కేవలం రూ.200లకు అమ్ముకున్నారు. అయితే ఈసంఘటనపై సమాచారం అందుకున్న ఛైల్డ్ లైన్ స్వచ్చంద సంస్థ ఈసంఘటనను తీవ్రంగా ఖండించింది. తల్లీ బిడ్డలను తిరిగి కలిపే బాధ్యత తీసుకుంది. జిల్లా పాలనాధికారులు, పోలీసుల సహకారంతో బాలుడి తల్లి రుయనాభాటీతోపాటు, బాలుడిని కొనుగోలు చేసిన ధన్షాయ్తో పలుసార్లు చర్చలు జరిపింది. ఈసందర్భంగా రుయనాభాటీ విధిలేని పరిస్థితుల్లో తన రెండో భర్త, బాలుడిని అమ్మమని బలవంతం పెడితేనే అమ్మినట్లు పేర్కొంది. పలు దఫాలు ఇరువురితో చర్చలు జరిపిన తరువాత బాలుడిని కన్నతల్లికి అప్పగించినట్లు ఛైల్డ్‌లైన్ సభ్యులు మృణాళిని రక్షిత్ తెలిపారు. బాలుడిని కొనుగోలు చేసిన ధన్షాయ్కు నలుగురు కుమర్తెలు ఉన్నారు. దీంతో కుమారుడు కావాలని బాలుడిని కొనుగోలు చేశారు. చర్చల అనంతరం బాలుడిని కన్నతల్లికి అప్పగించినా, ఆర్థికంగా బాలుడుకు అండగా ఉండటానికి అంగీకరించారు. అంతేకాకుండా రుయనాభాటీ కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామని జిల్లా అధికారులు హామీ ఇచ్చారు. అయితే ఈసంఘటనని త్రిపుర ప్రభుత్వం ఘండించింది. ఇలాంటి సంఘటనలకు రాష్ట్రంలో అవకాశం లేదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేయడానికి, ప్రతిపక్షాలు పన్నిన కుట్ర అని సంక్షేమ శాఖా మంత్రి బిజితానాథ్ ఆరోపించారు. -
పిల్లలను అమ్మినా కొనుగోలు చేసినా నేరమే
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: పిల్లలను అమ్మినా..కొనుగోలు చేసినా శిక్షార్హులేనని జిల్లా శిశుసంరక్షణ శాఖఅధికారి లక్ష్మణ్ హెచ్చరించారు మెదక్ మండలం వాడిపంచాయతీ పరిధిలోని మెట్టుతండాకు చెందిన దేవ్‌సోత్ అనిత, రవిదంపతులకు మూడో కాన్పులో సైతం ఆడపిల్ల పుట్టిందని గతనెల పసిపాపను విక్రయించిన విషయంపై ఇటీవల సాక్షి దినపత్రికలో ‘ఆడపిల్ల పుట్టిందని అమ్మేశారు’ అనేశీర్షిక వార్త ప్రచురితం అయింది. ఈ కథనానికి స్పందించిన జిల్లా శిశుసంరక్షణ అధికారులు సోమవారం తండాకు వచ్చి పసిపాపను విక్ర యించిన విషయంపై తల్లితండ్రులను ఆరాతీశారు. మగబిడ్డ పుడుతుందను కుంటే ఆడపిల్ల పుట్టిందని ఇప్పటికే తమకు ఇద్దరు ఆడసంతానం ఉన్నందున పోషించే స్థోమతలేక విక్రయించామని పాపతల్లి తండ్రులు తెలిపారు. కొనుగోలు చేసిందెవరో తమకు తెలియదని రూ. 4 వేలుఇచ్చి కనిపించకుండా తీసుక పోయారని అనిత అధికారుల ముందు పేర్కొంది. ఈ విషయంపై స్పందించిన జిల్లా అధికారి రత్నం మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఏడుగురిని విక్రయించారని తెలిపారు. అందులో ఎక్కువగా కౌడిపల్లి మండలంలో జరుగుతున్నాయన్నారు. త్వరలో గిరిజనతండాల్లో పిల్లల సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేసి పిల్లలను కాపాడేందుకు అన్నిచర్యలు తీసుకుంటామన్నారు. పిల్లల తల్లితండ్రులకు సరైన అవగాహన లేకనే ఇలాజరుగుతోందన్నారు. పాపను ఎవరికి విక్రయించారో చెప్పకుంటే పోలీసుస్టేషన్లో కేసుపెట్టి కొనుగోలు చేసిన వారినుంచి పసిపాపను రప్పిస్తామని ఆయన అనిత దంపతులను హెచ్చరించారు. కొనుగోలు చేసిన వారువెంటనే శిశువును తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ పాప అవసరం ఉంటే అధికారి కంగా దత్తత తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం అనిత, రవిదంపతుల మొదటి సంతానం స్వర్ణను బాలసదనంలో చేర్పించి ఉచిత చవువుకోసం ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ తార్య మాట్లాడుతూ మెట్టుతండాలో అంగన్వాడి కానీ, పాఠశాలకానిలేక నిరక్షరాస్యత పెరుగుతుందని అధికారులకు చెప్పారు. దీంతో ఈ విషయాన్ని తమప్రాజెక్టు అధికారిద్వార జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసెకెల్లి తండాలో అంగన్వాడీ సెంటర్‌తోపాటు, ప్రాథమిక పాఠశాలను సైతం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హమీఇచ్చారు. కార్యక్రమంలో సీడీపీవో విజయలక్ష్మి, అంగన్వాడీ సూపర్వైజర్ వింద్యారాణి, సిబ్బంది విఠల్, సర్పంచ్ తార్య తధితరులున్నారు.