
సాక్షి, హైదరాబాద్: ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ అధ్యక్షుడు డా.హసన్ రౌహనీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గురు, శుక్రవారాల్లో(15, 16 తేదీల్లో) రౌహనీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయంలో కస్టమ్స్ మరియు ఇమిగ్రేషన్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ జోషి ఆదేశించారు. రౌహనీకి బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి ఆర్పీ సింగ్ స్వాగతం పలుకుతారని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
ఇరానియన్లతో సమావేశం..
హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ మహ్మద్ హఘ్‌బిన్ ఘోమీ మాట్లాడుతూ, తమ దేశాధ్యక్షుడి పర్యటనకు తెలంగాణ ప్రభుత్వం అతితక్కువ సమయంలో ఏర్పాట్లు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అధ్యక్షుడి పర్యటనలో 21 మంది ప్రతినిధులు కూడా పాల్గొంటారన్నారు. పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఇరానియన్లతో రౌహనీ సమావేశమవుతారని సీఎస్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా, నగర పోలీస్ కమిషనర్ వి.వి.శ్రీనివాసరావు, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి దానకిషోర్, హైదరాబాదు కలెక్టర్ యోగితారాణా, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్, అడిషనల్ డీజీ అంజనీ కుమార్, ప్రోటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీందర్, రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ ఈ.విష్ణువర్థన్‌రెడ్డి, ఫైర్ సర్వీసెస్ డీజీ రాజీవ్ రతన్ తదితరులు పాల్గొన్నారు.