
దుబాయ్: మధ్య ప్రాచ్యంలో కీలక నేతగా ఎదిగిన ఒమన్ సుల్తాన్ ఖాబూస్ బిన్ సైద్(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా బెల్జియంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారని ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఈ క్రమంలో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించినట్లు తెలిపింది. అయితే ఆయన మరణానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. కాగా బ్రిటీష్ పాలన నుంచి శాంతియుతంగా అధికారం చేపట్టిన ఖాబూస్.. దాదాపు 50 ఏళ్ల పాటు దేశ పాలకుడిగా బాధ్యతలు నిర్వహించారు. 1970 నుంచి మరణించే వరకు సుదీర్ఘ కాలంపాటు సుల్తాన్‌గా వ్యవహరించారు. అయితే ఆయనకు సంతానం లేకపోవడంతో ప్రస్తుత పాలకుడిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న విషయంపై సందిగ్దత నెలకొంది.
ఈ నేపథ్యంలో ఖాబూస్ వారసుడి ప్రకటనపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఒమన్ సైన్యాధికారులు.. ఆయన కుటుంబానికి విఙ్ఞప్తి చేశారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగిత.. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా... పాలనా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే సింహాసనాన్ని అధిష్టంచబోయే వ్యక్తి గురించి ప్రజలకు తెలియాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కాగా రాచ కుటుంబం ఈ బాధ్యతను తీసుకోనట్లయితే.. ఒమన్ నిబంధనల ప్రకారం... మిలిటరీ, భద్రతా అధికారులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కలిసి పాలకుడిగా తమకు నచ్చిన వ్యక్తిని రహస్య పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో ఖాబూస్ ముగ్గురు కజిన్లు.. అసద్, షీహాబ్, హైతం బిన్ తారిఖ్ అల్- సైద్‌లలో ఎవరో ఒకరికి సింహాసనం దక్కే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో 2017లో ఉప ప్రధానిగా అసద్ బిన్ తారీఖ్‌ను ఎంపిక చేస్తూ.. అతడి పేరిట ఖాబూస్ రాయల్ డిక్రీపై సంతకం చేసినందున ఆయననే వారసుడిగా ప్రకటించే అవకాశం ఉందని సీటెల్‌కు చెందిన రచయిత(గల్ఫ్ రాజ్యాల రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉన్నవారు)క్రిస్టేన్ ఉల్రిచ్‌సేన్ అన్నారు. నలభైతొమ్మిదిన్నరేళ్ల ఖాబూస్ పాలనను కొనసాగించే సత్తా అసద్‌కు ఉందని అభిప్రాయపడ్డారు. ఇక ఇరాన్- అమెరికా పరస్పర ప్రతీకార దాడుల నేపథ్యంలో ఒమన్ పాలకుడు మరణించడంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఖాబూస్.. అమెరికా- ఇరాన్‌లతో స్నేహ సంబంధాలు కలిగి ఉండేవారు. ఇరు దేశాల మధ్య అణు ఒప్పందం కుదరడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇరు దేశాల అధినేతలతో మైత్రితో మెలిగేవారు. (అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు.. ఈ విరోధం నేటిది కాదు)