దోవల్ అదుర్స్.. నాడు ఫోన్లో.. నేడు భేటీలో
వాషింగ్టన్: సంస్కరణల విషయంలోనే కాదు.. దేశ సంరక్షణ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా వేగంగా ముందుకు వెళుతోంది. అమెరికాలో కొత్త ప్రభుత్వం కొద్ది రోజుల్లో కొలువు దీరనున్న నేపథ్యంలో అగ్ర రాజ్యంతో బలమైన దోస్తీకి చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోవల్ అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారుగా విధులు నిర్వర్తించనున్న మైఖెల్ ఫ్లిన్‌ను కలిశారు.
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలు, ఉమ్మడిగా అమలుచేయాల్సిన వ్యూహాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో దోవల్‌కు మైఖెల్ గొప్ప గౌరవాన్ని ఇచ్చారంట. అంతేకాదు, ఆధునిక యుగంలో అత్యంత వేగంగా దూసుకెళుతున్న దేశం భారత్ అని, భారత ఆర్థిక వ్యవస్థను, విలువలను తాము గౌరవిస్తామని కూడా దోవల్ తో ఆయన అన్నట్లు భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది. గతంలోనే మైఖెల్‌తో దోవల్ ఫోన్ లో మాట్లాడగా సమావేశానికి ఆయన అమెరికా ఆహ్వానించారట. ఆ మేరకే ఆయన తాజాగా వెళ్లి భారత్- అమెరికా రక్షణ అంశాలపై పలు అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది.