న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లపై ఉగ్రవాదులు దాడికి వ్యూహం పన్నారన్న హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా దేశంలోని జమ్మూ, అమృత్‌సర్, జైపూర్, గాంధీనగర్, కాన్పూర్, లక్నోలతో సహా 30 ప్రధాన నగరాలపై పేలుళ్లకు పథకం రచించినట్లు సమాచారం అందడంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ అప్రమత్తం చేసింది.
ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌ను హిట్ లిస్ట్‌లో చేర్చామంటూ పౌర విమానయాన భద్రతా విభాగానికి జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పేరుతో లేఖ అందింది. సెప్టెంబర్ 10వ తేదీన పంపినట్లు ఉన్న ఈ లేఖలో ఆర్టికల్ 370 రద్దుకు ప్రతీకారంగా దాడులకు పాల్పడనున్నట్లు ఉగ్రసంస్థ పేర్కొంది. అలాగే ఎయిర్ బేస్ కేంద్రాలు ఉన్న శ్రీనగర్, అవంతిపొర, జమ్మూ, పఠాన్ కోట్, హిందన్‌లపై దాడులు చేస్తామని హెచ్చరికలతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశం ఉందని, అదీ ఎయిర్‌బేస్ కేంద్రంగా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment