
న్యూఢిల్లీ: దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న రక్షణ సంబంధిత సవాళ్లను, భవిష్యత్‌తో ఎదుర్కోబోయే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని విస్తృతమైన రక్షణ విధానాన్ని రూపొందించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ అధ్యక్షతన హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్ సమావేశమయ్యారు. సమావేశంలో నూతన రక్షణ విధాన రూపకల్పనపై దృష్టి పెట్టారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల జమ్మూ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద పేలుడు పదార్థాలున్న డ్రోన్స్ ప్రత్యక్షమైన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. డ్రోన్ల ఘటనపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులున్నారని అనుమానాలున్నాయి. దీంతో కొత్త పాలసీ రూపకల్పనపై పలువురు మంత్రులు, శాఖలు కసరత్తులు చేస్తున్నాయి.
కొత్తవిధానం రూపకల్పన, అమలులో వివిధ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ మిలటరీ, వైమానిక, నౌకా దళాలు కీలక పాత్ర పోషిస్తాయని సదరు వర్గాలు వెల్లడించాయి. డ్రోన్ ఎటాక్స్ వంటి నూతన సవాళ్లను ఎదుర్కొనడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, యాంటీ డ్రోన్ టెక్నాలజీపై దృష్టి సారించాలని కేంద్రం త్రివిధ దళాలకు సూచించింది. రక్షణ దళాలకు నూతన సాంకేతికతను అందించడం, ఇందుకోసం నవ యువతను, స్టార్టప్స్‌ను భాగస్వాములుగా చేసుకోవడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఇప్పటికే కృత్తిమ మేధ, రోబోటిక్స్, డ్రోన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర కొత్త సాంకేతికతలపై మిలటరీ దృష్టి సారించింది. రాబోయే వారాల్లో త్రివిధ దళాలు, కీలక భద్రతా వ్యూహకర్తలు మరిన్ని సమావేశాలు నిర్వహించి, కొత్త పాలసీపై చర్చలు జరుపుతారు. జమ్ము ఘటన అనంతరం ఎయిర్‌ఫోర్స్ జమ్మూలోని స్టేషన్ల వద్ద భద్రతను పెంచింది. రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచే డ్రోన్లను గుర్తించి పేల్చేసే సాంకేతికతను ఇప్పటికే డీఆర్‌డీఓ రూపొందించింది. దీన్ని మరింత విస్తృతీకరించేందుకు కృషి జరుగుతోంది.
చదవండి:
ప్రైవేట్ ఆస్పత్రులు వినియోగించని వ్యాక్సిన్లు రాష్ట్రాలకు ఇవ్వండి
HP: ఔషధ మొక్కల పెంపకానికి ఆయుష్ 128.94 లక్షలు