భారీ కుట్రకు పాక్‌ పన్నాగం.. మసూద్‌ విడుదల! | Jaish Chief Masood Azhar Secretly Released From Pakistan | Sakshi
Sakshi News home page

భారీ కుట్రకు పాక్‌ పన్నాగం.. మసూద్‌ విడుదల!

Published Mon, Sep 9 2019 9:32 AM | Last Updated on Mon, Sep 9 2019 10:35 AM

Jaish Chief Masood Azhar Secretly Released From Pakistan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌పై ఉగ్రకుట్రకు పాల్పడేందుకు పాకిస్తాన్‌ వ్యూహాలు రచిస్తోంది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదాకు కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం భారత్‌ను భారీ దెబ్బతీయాలని ఆదేశం పావులు కదుపుతోన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజాద్‌ను జైలు నుంచి రహస్యంగా విడుదల చేసినట్లు భారత ఇంటిలిజెన్స్‌ వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భారత్‌-పాక్‌ సరిహద్దుల్లోని పంజాబ్‌, రాజస్తాన్‌, సియోల్‌కోట ప్రాంతాల్లో భారత బలగాలను అప్రమత్తం చేయాలని ఐబీ హెచ్చరించింది. భారత్‌పై ప్రతీకార చర్యలకు ఎప్పటి నుంచో కాలుదువ్వుతున్న పాక్‌.. అజార్‌ను విడుదల చేసి ప్రత్యేక వ్యూహాలు రచించినట్లు ఐబీ అనుమానం వ్యక్త చేస్తోంది.

భారత్‌పై దాడికి పాల్పడేందుకు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులకు దిశానిర్థేశం చేయడానికి రెండురోజుల క్రితం మసూద్‌ను రహస్యంగా విడుదల చేశారని ఐబీ పేర్కొంది. కాగా అజాద్‌ను అరెస్ట్‌ చేయాల్సిందిగా ఇటీవల అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలు పాక్‌పై ఒత్తిడి చేయడంతో అతన్ని అరెస్ట్‌ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని అణచివేస్తున్నామని అంతర్జాతీయ సమాజం ముందు నటిస్తూనే పాక్‌ ఇలాంటి వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. కశ్మీర్‌ అంశం అనంతరం రెండు దేశాల మధ్య వాతావరణం యుద్ధ రీతిలో మాటల తూటాలు పేలిన విషయం తెలిసిందే. పాక్‌ మాటలకు భారత్‌ కూడా అదేరీతిలో ధీటైన సమాధానమే ఇచ్చింది.

పాక్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ అడుగుముందుకేసి కశ్మీర్‌కు తాము అండగా ఉంటామని, అవసరమైతే భారత్‌తో యుద్ధానికి కూడా సిద్ధంగా ఉంటామని గెంతులేశారు. భారత్‌పై త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేరొందిన అజార్‌ను భారత్‌పై యుద్ధానికి ఉసిగొల్పేందుకు జైలు నుంచి విడుదల చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. భారత నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న ఆర్మీ, రక్షణ సిబ్బంది సరిహద్దులో భద్రతను మరింత పెంచింది. బలగాలను అప్రమత్తం చేసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement