
శ్రీనగర్: ఉగ్రవాదులు దాడులకు పాల్పడతారనే సమాచారంతో కశ్మీర్‌లో భద్రతా బలగాలు సోమవారం హై అలర్ట్ ప్రకటించాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి. ‘భద్రతాబలగాలే లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు భారీ దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఉప్పందించాయి. హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ రియాజ్ నైకూను చంపినందుకు ప్రతీకారంగా కారు బాంబు, లేక ఆత్మాహుతి దాడి జరిపేందుకు కుట్ర పన్నినట్లు మాకు తెలిసింది’ అని ఓ అధికారి తెలిపారు. రంజాన్ మాసంలో ఎంతో ప్రాముఖ్యమున్న 17వ రోజున గతంలో ఇక్కడ ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన సందర్భాలున్నాయని ఆయన అన్నారు.