శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మూకశ్మీర్‌లో మొదలైన సాయుధ బలగాల నిఘా ఇప్పటికీ కొనసాగుతోంది. ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేందుకే కశ్మీర్‌లో వేల సంఖ్యలో సైనికుల్ని మోహరించామని కేంద్ర హోంశాఖ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే కశ్మీర్‌లో ఆంక్షలు సడలిస్తున్నామని, అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని కేంద్రం వెల్లడించింది. అయితే, కేంద్రం చెప్తున్న మాటలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జమ్మూకశ్మీర్‌లో పర్యటించాలనుకున్న విపక్ష సభ్యుల బృందాన్ని శ్రీనగర్‌లోనే అడ్డుకోవడం.. ఆదివారం జరిగిన ఓ సంఘటన ఈ సందేహాలకు బలం చేకూరుస్తోంది. నిరసన కారులు రాళ్లు రువ్వడంతో ఓ పౌరుడు మృతి చెందాడు. ఈ ఘటన దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
(చదవండి : ‘ఫోన్‌ల కంటే ప్రాణాలే ముఖ్యం’)
వివరాలు.. జాదిపొర ఉరంహాల్‌కు చెందిన ఓ వ్యక్తి తన ట్రక్‌లో ఇంటికి వెళ్తున్నాడు. అయితే, అది ఆర్మీ వాహనాన్ని పోలి ఉండటంతో భ్రమపడ్డ కొందరు నిరసనకారులు దానిపై రాళ్లు రువ్వారు. ఒక్కసారిగా పెద్దఎత్తున రాళ్లదాడి జరగడంతో అతని తలకు బలమైన గాయం అయింది. దాంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడు మహమ్మద్ ఖలీల్‌దార్‌గా గుర్తించారు. ఈ ఘటనలో ప్రమేయమున్న వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని డీజీపీ దిల్‌బాగ్ సింగ్ చెప్పారు. ఇక ఇదే నెలలో నిరసనకారుల రాళ్ల దాడిలో ఓ 11 ఏళ్ల బాలిక ప్రాణాలు విడిచింది. విచక్షణ మరిచిన నిరసనకారులు ఉన్మాదులుగా మారుతున్నారని విమర్శలొస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment