Terrorist actions
-
‘జమ్ము కశ్మీర్లో కల్లోలానికి ఉగ్రవాదుల యత్నం’
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కేరాన్ సెక్టార్ సరిహద్దుల్లో చొరబాటుకు హత్నించిన ముగ్గురు ఉత్రవాదులను ఆదివారం భారత ఆర్మీ మట్టుబెట్టింది. ఈ ఘటనపై తాజాగా కేరాన్ సెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ కుల్కర్ణి మాట్లాడారు.‘జూలై 13,14 తేదీల్లో రాత్రి సమయంలో ఉగ్రవాదుల చొరబాటు యత్నించటంతో దాడులు జరిపాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నెలకొన్న శాంతి పరిస్థితులకు భంగం కలిగించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నట్లు మాకు నిఘా సమాచారం ఉంది. ..అమర్నాథ్ యాత్ర సందర్భంగా ఇక్కడ కల్లోలం సృష్టించాలని ఉగ్రవాదులు యత్నించారు. ఉగ్రవాద దాడులకు సంబంధించి.. జూలై 12నే మాకు ఇంటెలిజెన్స్ నుంచి మాకు సమాచారం అందింది. దట్టమైన అడవుల నుంచి కేరాన్ సెక్టార్ గుండా విదేశీ ఉగ్రవాదులు చొరబడతారన్న సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని జమ్ము కశ్మీర్ పోలీసులు ధృవీకరించారు. జూలై 13, 14 తేదీ రోజుల్లో రాత్రి మేము చాలా అప్రమత్తంగా ఉన్నాం. .. ఆర్మీ, బీఎస్ఎఫ్, జమ్ము కశ్మీర్ పోలీసు సయుక్తగా ఉగ్రవాదుల చొరబడే చోట దాడులు చేశాం. అయితే చికటి ఉండటంతో ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోయారు. టెర్రరిస్టుల వద్ద భారీ ఆయుధాలు ఉన్నాయి. బాగా శిక్షణ పొందిన ఉగ్రవాదులు చొరబడటానికి యత్నించారు. ఇక.. మేము జరిపిన కాల్పుల్లో ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతమయయ్యారు. వారి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం’అని ఎన్ఆర్ కుల్కర్ణి తెలిపారు. -
హైదరాబాద్ ఉగ్ర కదలికల్లో కీలక అంశాలు
-
సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర.. మైనర్‌కు స్పెషల్ టాస్క్!
న్యూఢిల్లీ: మొహాలీలోని పంజాబ్ పోలీసు హెడ్‌క్వార్టర్‌పై మే 9న జరిగిన గ్రెనేడ్ దాడి ఘటనలో ఓ జువైనల్‌తో సహా ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. వారిని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను హత్య చేసే పనిని అరెస్టైన జువైనల్ (మైనర్)కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మైనర్‌తో పాటు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసిన మరో వ్యక్తిని అర్షదీప్ సింగ్‌గా గుర్తించారు. ఆగస్టు 4న హరియాణాలో ఐఈడీని స్వాధీనం చేసుకున్న కేసులో నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకు పాల్పడ్డ నిందితుడు లారెన్స్ బిష్ణోయ్, జగ్గూ భగ్వాన్ పూరియాలు.. సల్మాన్ ఖాన్‌ను హత్య చేయాలని మైనర్‌తో పాటు దీపక్ సురాక్పుర్, మోను దగర్‌కు బాధ్యతలు అప్పగించారు. పంజాబ్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌పై గ్రెనేడ్ దాడిలో అరెస్టయిన జువైనల్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌కు చెందిన వ్యక్తి కాగా.. దీపక్ హరియాణాలోని సురఖ్పుర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ‘మహారాష్ట్ర నాందెడ్‌లో ఏప్రిల్ 5న బిల్డర్ సంజయ్ బియాని హత్య కేసులో జువైనల్ నిందితుడు. అలాగే.. గత ఏడాది ఆగస్టు 4న అమృత్‌సర్‌లో గ్యాంగ్‌స్టర్ రాణా కండొవాలియా హత్య కేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మరోవైపు.. పంజాబ్‌లోని తరణ్ తరణ్ ప్రాంతానికి చెందిన అర్షదీప్ సింగ్.. కరుక్షేత్ర ప్రాంతంలో ఐఈడీ రికవరీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అలాగే.. మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాలో నిందితుడు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జువైనల్‌తో పాటు అర్షదీప్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సల్మాన్ ఖాన్‌ను హత్య చేయాలని లారెన్స్ బిష్ణోయ్, సురఖ్పుర్, దగర్‌లు తనకు టాస్క్ ఇచ్చినట్లు జువైనల్ తెలిపాడు. ఆ తర్వాత ఖాన్ కన్నా ముందు కొండవాలియాను హత్య చేయాలని సూచించటంతో అతడిని హతమార్చారు. దర్యాప్తులో వెల్లడించిన మరిన్ని కేసులను పరిశీలిస్తున్నాం’ అని పోలీసు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ప్రియుడంటే కియారాకు ఎంత ప్రేమో, వైరల్ వీడియో -
కశ్మీర్లో హై అలర్ట్
శ్రీనగర్: ఉగ్రవాదులు దాడులకు పాల్పడతారనే సమాచారంతో కశ్మీర్లో భద్రతా బలగాలు సోమవారం హై అలర్ట్ ప్రకటించాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి. ‘భద్రతాబలగాలే లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు భారీ దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఉప్పందించాయి. హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ రియాజ్ నైకూను చంపినందుకు ప్రతీకారంగా కారు బాంబు, లేక ఆత్మాహుతి దాడి జరిపేందుకు కుట్ర పన్నినట్లు మాకు తెలిసింది’ అని ఓ అధికారి తెలిపారు. రంజాన్ మాసంలో ఎంతో ప్రాముఖ్యమున్న 17వ రోజున గతంలో ఇక్కడ ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన సందర్భాలున్నాయని ఆయన అన్నారు. -
పాక్‌కు సరైన రీతిలో బదులిస్తాం: ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్న పాకిస్తాన్‌కు సరైన రీతిలో బదులిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే హెచ్చరించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కశ్మీర్‌లోని హంద్వారాలో పౌరుల ప్రాణాలను కాపాడేందుకు ఉగ్రవాదుల తూటాలకు ఎదురొడ్డి అమరులైన కల్నల్ అశుతోష్ శర్మతో పాటు మరో నలుగురు జవాన్ల పట్ల దేశం గర్విస్తోందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ సైన్యం తరచుగాకాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, భారత్‌లోకి ఉగ్రవాదులను రవాణా చేస్తోందని ఆరోపించారు. జనం ప్రాణాలను బలిగొంటున్న కరోనా మహమ్మారిపై పోరాడాలన్న ఆసక్తి పాకిస్తాన్‌కు లేదని, ప్రస్తుతం దాని దృష్టి మొత్తం భారత్‌లోకి ఉగ్రవాదులను పంపడంపైనే ఉందని మండిపడ్డారు. తీరు మార్చుకోకపోతే పాకిస్తాన్‌కు గుణపాఠం తప్పదని తేల్చిచెప్పారు. -
అనంత్‌నాగ్‌లో భారీ ఎన్కౌంటర్
-
ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఉగ్ర అలర్ట్
సాక్షి, నెల్లూరు: తమిళనాడులో ఉగ్రవాదులు చొరబడ్డారన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరంగా చేపట్టింది. ముఖ్యంగా శ్రీహరికోట రాకెట్ కేంద్రం, కృష్ణపట్నం పోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. సీఐఎస్ఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు గస్తీని నిర్వహిస్తున్నారు. తీరం వెంబడి కోస్ట్‌గార్డ్, మెరైన్, స్థానిక పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు. మత్స్యకార గ్రామాల్లోని ప్రజలతో సమావేశాలు నిర్వహించి కొత్తవ్యక్తులు సంచరిస్తున్నట్లు గుర్తించినా, అనుమానస్పదంగా ఎవరైనా కనిపించినా వెంటనే సమాచారం అందించాలని సూచనలు చేస్తున్నారు. జిల్లాలో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి సిబ్బందితో సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలిచ్చారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా రెండురోజులుగా పోలీసు అధికారులు జిల్లాను జల్లెడ పట్టారు. పర్యటన రద్దు అయినా తనిఖీలను కొనసాగుతూనే ఉన్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు కొనసాగిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. -
పాకిస్తాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
వాషింగ్టన్: భారత్‌పై మళ్లీ ఉగ్రవాదులు దాడులు జరిపితే తీవ్ర చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ‘‘ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలుగా మారిన ప్రాంతాల (పాక్)పై సహనాన్ని ప్రదర్శించేదే ప్రసక్తే లేదన్నారు. భారత్‌లో ఇంకొక్క ఉగ్రదాడి జరిగినా పాక్ తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉండాలి’ అని వైట్‌హౌజ్‌కు చెందిన ఒక అధికారి బుధవారం మీడియాతో పేర్కొన్నారు. ‘పాకిస్థాన్‌లోని టెర్రరిస్ట్ గ్రూపులపై అమెరికా కఠిన చర్యలు తీసుకోడానికి వెనుకాడదు. ఉగ్రవాద నిర్మూలనకు పాక్ సరైన చర్యలు చేపట్టాలి. ప్రధానంగా జైష్-ఏ-మహ్మద్, లష్కర్-ఏ-తయిబా లాంటి ఉగ్రవాద సంస్థలను నిర్వీర్యం చేయాలి. ఉగ్రదాడులతో తిరిగి భారత ఉపఖండంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూడాలనేదే మా అభిమతం’ అని ఆయన తెలిపారు. ‘పాకిస్థాన్ తగు చర్యలు తీసుకోకుంటే ఇండియాలో మళ్లీ దాడులు జరిగే అవకాశముంది. దీనివల్ల ఇరు దేశాల మధ్య తిరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదముంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో భారత వైమానిక దాడుల అనంతరం ఉగ్రవాదులు, వారి శిబిరాల మీద పాక్ ఎలాంటి చర్యలు తీసుకుందోనని వేచి చూస్తాం’ అని తెలిపారు. ఉగ్రవాదాన్ని అరికట్టాల్సిందే ‘ఉగ్రవాదాన్ని తుదమొట్టించడానికి అంతర్జాతీయ సమాజం ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరముందని అమెరికా భావిస్తోంది. పాక్ కూడా ఉగ్రవాద సంస్థల మీద కొన్ని చర్యలు తీసుకుంది. కొన్ని ఉగ్ర గ్రూపుల నిర్వీర్యం చేయడంతోపాటు జైషే మహ్మద్ సంస్థ పరిపాలనా కార్యకలాపాలను నియంత్రించే దిశగా నడుం బిగించింది. కానీ టెర్రరిస్ట్‌లను అరెస్ట్ చేయడం.. తర్వాత కొన్ని రోజులకు వారిని వదిలేయడం, దేశంలో ఎక్కడికైనా తిరిగే హక్కు, స్వేచ్ఛగా ర్యాలీలు చేసుకునే అనుమతులను ఉగ్ర నాయకులకు కల్పించడం పాక్‌కు పరిపాటి అయిపోయింది. అందుకే ఇంకొన్నాళ్లు పాకిస్థాన్ తీసుకునే చర్చలను నిశితంగా పరిశీలిస్తాం. పాక్‌కు ఉన్న ఆర్థిక అవసరాల దృష్ట్యా ఆ దేశం ఉగ్రవాద నిర్మూలన చర్యలను వేగవంతం చేసి, అంతర్జాతీయ సమాజం ముందు బాధ్యతాయుత దేశంగా నిలబడాలి. లేని పక్షంలో పాక్‌కు ఆర్థిక కష్టాలు తప్పవు. భారత్‌లో ఉగ్రవాదుల అటాక్, బాలాకోట్‌లో ఇండియన్ ఆర్మీ వాయు దాడులతో దాయాది దేశాల ఆర్మీలు ఇంకా హై అలర్ట్‌గానే ఉన్నాయి. ఇంకొక్క దాడి ఆ పరిస్థితులను ఇంకా క్లిష్టతరం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాంటి వాటికి తావివ్వొద్దనే తాము ముందస్తుగా పాక్‌ను హెచ్చరిస్తున్నాం. ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు అటు ఇస్లామాబాద్‌తో ఇటు న్యూఢిల్లీతో మేము సంప్రదింపులు జరిపి.. ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేశాం’ అని సదరు వైట్‌హౌజ్ అధికారి తెలిపారు. -
ఆ బాధ వాళ్లకూ తెలియాలి
జైపూర్ / ఇస్లామాబాద్: పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదుల అనాగరిక చర్యలపై ప్రతీకారం తీర్చుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. ఓ బీఎస్ఎఫ్ జవాన్ గొంతును పాక్ సైనికులు కత్తితో కోయడం, కశ్మీర్లో పోలీసులను ఉగ్రవాదులు కిడ్నాప్‌చేసి హత్యచేసిన ఘటనలపై రావత్ ఈ మేరకు స్పందించారు. జైపూర్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘భారత జవాన్లపై పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదులు పాల్పడుతున్న ఇలాంటి అనాగరిక, ఆటవిక ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాక్ వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన సమయం వచ్చింది. ఈ బాధేంటో వాళ్లకూ తెలియాలి. అయితే ఈ సందర్భంగా పాకిస్తాన్ పాటించే అనారిగక, ఆటవిక విధానాలను భారత్ అనుసరించకూడదు’ అని తెలిపారు. సరిహద్దులో ఓ బీఎస్ఎఫ్ జవాన్‌ను పాక్ సైన్యం తుపాకితో కాల్చి, గొంతు కోయడంపై స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కావనీ, దీనిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం: పాక్ రావత్ వ్యాఖ్యలపై పాక్ తీవ్రంగా స్పందించింది. భారత్‌తో యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామనీ, అయితే దేశ ప్రయోజనాల రీత్యా శాంతినే ఆకాంక్షిస్తున్నామని పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ తెలిపారు. -
ప్రోత్సహించేవారూ బాధ్యులే
కఠ్మాండు: ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తున్న దేశాలను గుర్తించి ఉగ్ర హింసకు వాటినీ బాధ్యుల్ని చేయాలని బిమ్స్టెక్(బంగాళాఖాత దేశాల ఆర్థిక, సాంకేతిక కూటమి) దేశాలు పిలుపునిచ్చాయి. ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాద చర్యలు సమర్థనీయం కావని ఎండగట్టాయి. ఉగ్రవాదం, సీమాంతర వ్యవస్థీకృత నేరాలు ప్రపంచ శాంతికి పెను విఘాతం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. నేపాల్ రాజధాని కఠ్మాండులో నాలుగో బిమ్స్టెక్ దేశాల సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా 7 సభ్యదేశాలు ఏకాభిప్రాయంతో కఠ్మాండు డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. భారత్ నుంచి ప్రధాని మోదీ ఈ సమావేశానికి హాజరయ్యారు. రెండు రోజుల సదస్సు ఫలప్రదంగా జరిగిందని, విభిన్న రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని సభ్యదేశాలు పునరుద్ఘాటించాయని మోదీ తెలిపారు. ఇంధన రంగంలో సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి బిమ్స్టెక్ గ్రిడ్ ఇంటర్కనెక్షన్ ఏర్పాటుకు అవగాహనా ఒప్పందం కుదిరింది. పశుపతినాథ్ ఆలయ పరిసరాల్లో యాత్రికుల కోసం కొత్తగా నిర్మించిన ‘భారత్ నేపాల్ మైత్రి ధరమ్‌శాల’ను నేపాల్ ప్రధాని ఓలితో కలసి మోదీ ప్రారంభించారు. అనంతరం నేపాల్, థాయ్‌లాండ్, మయన్మార్, భూటాన్ దేశాధినేతలతో విడిగా భేటీ అయ్యారు. తదుపరి బిమ్స్టెక్ సదస్సుకు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. డిక్లరేషన్ ముఖ్యాంశాలు.. ► ఉగ్రభూతం, సీమాంతర నేరాలపై పోరాటానికి గట్టి ప్రయత్నాలు జరగాలి. సభ్య దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పోత్సహించే సమగ్ర విధానాలు అవలంబించాలి. ► సభ్య దేశాల పోలీసులు, నిఘా వర్గాలు, న్యాయ వ్యవస్థ మధ్య సమన్వయం పెంచాలి. ► హోం మంత్రులు, జాతీయ భద్రతా అధికారుల సమావేశాలు తరచుగా నిర్వహించాలి. ► పరస్పర ఆర్థికాభివృద్ధి నిమిత్తం బహుళ రంగాల్లో సభ్యదేశాల మధ్య అనుసంధానత పెరగాలి. ► అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు న్యాయబద్ధంగా, అన్ని దేశాలకు ఒకే విధంగా వర్తించేలా ఉండాలి. ► దక్షిణ, ఆగ్నేయాసియాకు వారధిగా ఉన్న బిమ్స్టెక్ను ప్రాంతీయ సర్వతోముఖాభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలి. ► అభివృద్ధి లక్ష్యాల సాధనకు పేదరికం పెద్ద అడ్డుగోడగా ఉంది. సుస్థిరాభివృద్ధికి 2030 ఎజెండాను అమలుచేయడానికి కృషి జరగాలి. ► వాతావరణ మార్పుపై అంతర ప్రభుత్వ నిపుణుల కమిటీ నియామకానికి అవకాశాలను పరిశీలించాలి. ► చివరగా, శాంతియుత, సుస్థిర, బలోపేత బిమ్స్టెక్ సాధనకు సభ్యదేశాలు కలసికట్టుగా పాటుపడాలి. భాగమతి తీరంలో యాత్రికులకు బస.. పశుపతినాథ్ ఆలయ పరిసరాల్లో యాత్రికులు విశ్రాంతి తీసుకునేందుకు నిర్మించిన 400 పడకల విడిది భవనాన్ని మోదీ, నేపాల్ ప్రధాని ఓలితో ప్రారంభించారు. భారత ఆర్థిక సాయంతో భాగమతి నదీ ఒడ్డున నిర్మించిన ఈ భవనంలో యాత్రికులు బస చేసేందుకు విశ్రాంతి గదులు, కిచెన్, భోజన శాల, లైబ్రరీ తదితర సౌకర్యాలను ఏర్పాటుచేశారు. ఇది కేవలం విశ్రాంతి భవనమే కాదని, భారత్–నేపాల్‌ల స్నేహానికి చిహ్నమని మోదీ వ్యాఖ్యానించారు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ రచనల్ని నేపాలీ భాషలో ప్రచురించాలని నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. మరోవైపు, బిమ్స్టెక్ సదస్సు సందర్భంగా మోదీ నేపాల్, థాయ్‌లాండ్, మయన్మార్, భూటాన్ దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రాక్సాల్ (బిహార్)–కఠ్మాండు మధ్య వ్యూహాత్మక రైల్వే లైను నిర్మాణానికి భారత్, నేపాల్‌లు అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) కదుర్చుకున్నాయి. -
నో ఫ్లైజోన్!
- తిరుమల కొండపై చక్కర్లు కొడుతున్న విమానాలు - ఆందోళనలో ఆలయ భద్రత - నో ఫ్లై జోన్ ప్రకటనలో తీవ్ర జాప్యం - కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సన్నద్ధమవుతున్న టీటీడీ శ్రీవారి ఆలయ గగనతలంపై తరచూ విమానాలు ప్రయాణించడం ఆందోళన కలిగిస్తోంది. తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. సాక్షి,తిరుమల: దేశంలో ఉగ్రవాద చర్యలు పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా భద్రత విభాగం అప్రమత్తతో ఉంది. అయినప్పటికీ ముష్కరుల టార్గెట్‌లో తిరుమల కూడా ఉండడం భక్తకోటికి ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర నిఘా వర్గాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తరచూ విమానాలు తిరుమల ఆల య గగన తలంపై అతి సమీపంలోనే తిరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. గతంలో అద్వానీ నేతృత్వంలోని పార్లమెంటరీ భద్ర తా కమిటీ తిరుమల ఆలయంపై విమానాలు తిరగకుండా చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చింది. మూడేళ్లు అవుతున్నా అది ఆచరణకు నోచుకోలేదు. టీటీడీ ధర్మకర్తల మండలిలో కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అయినప్పటికీ ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీటీడీ నిర్ణయం ఆలయ గగనతలంపై విమానాలు చక్కర్లు కొట్టే పరిస్థితి రోజురోజుకీ పెరిగిపోతుండడంతో శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు. అదే పరిస్థితి టీటీడీ అధికారుల్లోనూ ఉంది. దీనిపై కేంద్ర పౌర విమానయానశాఖపై ఒత్తిడి తేవాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, టీటీడీ సీవీఎస్వో నాగేంద్రకుమార్ కేంద్రంతో చర్చిస్తున్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి తమ వాదన వినిపించి తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించుకునేలా ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. -
ఇప్పటికైనా మేల్కొంటారా?!
సంపాదకీయం: ఉగ్రవాద చర్యలు మనకు కొత్తగాదు. దేశంలో ఏదో ఒక మూల అలాంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటినుంచీ గుణపాఠాలు తీసుకుని పాలనా యంత్రాంగం ఎంతో అప్రమత్తంగా ఉంటుందని, ఉండాలని సామాన్యులు ఆశిస్తారు. కానీ, ఆ ఆశ అడియాసేనని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఆదివారం బీజేపీ బహిరంగ సభకు కొన్ని నిమిషాల ముందు సంభవించిన పేలుళ్లు నిరూపించాయి. ఈ పేలుళ్లలో సాధారణ పౌరులు అయిదుగురు, బాంబు పేల్చడానికి ప్రయత్నించిన ఉగ్రవాది ఒకరు మరణించారు. మరో 98మంది గాయపడ్డారు. సభకు చాలాముందు పేలుళ్లు జరగడంవల్ల తొక్కిసలాట చోటుచేసుకోలేదుగానీ... లేనట్టయితే మృతుల సంఖ్య చాలా ఎక్కువుండేది. పేలుళ్లు జరిగిన వెంటనే అదుపులోకి తీసుకున్న కొందరిలో ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన వారిద్దరున్నట్టు పోలీసులు చెబుతున్న సమాచారం. ఏడుచోట్ల జరిగిన పేలుళ్లలోనూ ఉగ్రవాదులు టైమర్లు వాడారు. పేలుళ్లు పాట్నాకు కొత్త కావొచ్చు. కానీ, కొన్ని నెలలక్రితమే ఆ రాష్ట్రంలోని బుద్ధ గయలో ఇవి సంభవించాయి. అంతేకాదు... పొరుగునే ఉన్న నేపాల్‌లో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నట్టు, వారు బీహార్‌ను రక్షితప్రాంతంగా పరిగణిస్తున్నట్టు ఇటీవలి ఘటనలు నిరూపిస్తున్నాయి. దేశంలో పలు ఉగ్రవాద ఘటనలతో సంబంధం ఉన్న యాసిన్ భత్కల్ బీహార్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలోనే పోలీసులకు చిక్కాడు. సాధారణ పరిస్థితుల్లోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసు కోవాల్సి ఉండగా పాట్నాలో ఆదివారం బీజేపీ బహిరంగసభ నిర్వహిస్తున్నందు వల్ల మరింత అప్రమత్తతతో మెలగవలసింది. ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎప్పటినుంచో ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్నారు. అలాంటి నాయకుడు హాజరవుతున్న సభ సందర్భంగా ఒకటికి రెండుసార్లు భద్రతా ఏర్పాట్లను సరిచూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ, పాట్నాలోని ఏడుచోట్ల పేలుళ్లు జరగడాన్ని చూస్తే ఆ తరహా చర్యలు తీసుకోలేదని అర్ధమవుతోంది. బీజేపీ సభ కోసం 5,000 మంది పోలీసులను నియమించామని ప్రభుత్వం చెబుతున్నా... వారంతా ట్రాఫిక్‌ను చక్కదిద్దడంలోనే గడిపారు. సభకు హాజరవుతున్న సామాన్య పౌరుల, వీఐపీల భద్రత గురించి, ముందస్తు ఏర్పాట్ల గురించి వారు పెద్దగా పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం సభా స్థలివద్ద ఉండాల్సిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఆ దరిదాపుల్లో లేదు. భారీ బహిరంగ సభ జరుగుతున్నచోట కనీసం ఒక్క అంబులెన్స్‌ను అయినా అందు బాటులో ఉంచాలని పోలీసులకు తోచలేదు. ఘటన జరిగిన వెంటనే అందులో గాయపడినవారిలో కొందరిని మోసుకుపోవడం, మరికొందరిని ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లడం ఆశ్చర్యం కలిగించింది. పేలుళ్లకు వారు స్పందించిన తీరే చిత్రాతిచిత్రం. మొదటి పేలుడు పాట్నా రైల్వే స్టేషన్లో ఉదయం 9.30 సమయానికి జరిగింది. అటు తర్వాత వేర్వేరుచోట్ల వరసపేలుళ్లు సంభవించాయి. చిట్టచివరి పేలుడు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో గాంధీమైదాన్ ఆవరణలో జరిగింది. అప్పటికి మోడీ తన ప్రసంగాన్ని ఇంకా ప్రారంభించలేదు. తొలి పేలుడు జరిగాక ఒకటి రెండుచోట్ల బాంబులను కనుగొని నిర్వీర్యంచేసిన మాట వాస్తవమేగానీ భారీగా జనం గుమిగూడుతున్న గాంధీమైదాన్‌లో మాత్రం దుండగులు దాడికి దిగవచ్చన్న అనుమానం ఏ దశలోనూ పోలీసులకు రాలేదు! అక్కడ అయిదుచోట్ల పేలుళ్లు జరిగిపోయాయి. అయితే, ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ పోలీసుల వైఫల్యాన్ని అంగీకరించడం లేదు. తమకు సంబంధించినంతవరకూ భద్రతాపరమైన లోపాలు ఏమీ లేవని ఆయనంటున్నారు. అసలు అటు కేంద్ర నిఘా సంస్థగానీ, రాష్ట్ర నిఘా సంస్థలుగానీ ముందస్తు హెచ్చరికలేమీ చేయలేదని ఆయన వివరిస్తున్నారు. కేంద్ర గూఢచార సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) దీనికి భిన్నమైన కథనాన్ని చెబుతోంది. పేలుళ్లు జరిగే అవకాశం ఉన్నదని తాము ముందే అప్రమత్తం చేశామని అంటున్నది. బీహార్ ప్రభుత్వ ప్రకటనకూ, ఐబీ వివరణకూ పొంతనే లేదు. మన ప్రారబ్ధం ఇదే. అంతా అయిన తర్వాత మేం చెప్పామని వారూ... చెప్పలేదని వీరూ అంటారు. ఎందుకింత గందరగోళం నెలకొంటున్నదో, సమన్వయం కొరవడుతున్నదో అంతుపట్టదు. ఆమధ్య జరిగిన హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ పేలుళ్ల సమయంలోనూ ఇలాగే పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించాయి. ముందే చెప్పామని ఐబీ... లేదు లేదని స్థానిక పోలీసులు భిన్న కథనాలు వినిపించారు. అటు తర్వాత బుద్ధగయలో పేలుళ్లు జరిగినప్పుడూ ఇదే పునరావృతమైంది. ఆచరణలో ఇలా వరస వైఫల్యాలు సంభవిస్తున్నప్పుడు ఏ దశలో తలెత్తిన లోపాలు అందుకు దారితీస్తున్నాయో సమీక్షించుకోవాలి. మరోసారి అవి జరగకుండా ఏంచేయాలో ఆలోచించాలి. మార్గదర్శకాలు రూపొందించాలి. కానీ, అటు కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ట్ర ప్రభుత్వాలుగానీ ఇలాంటి కసరత్తులు జరుపుతున్నట్టు లేవు. అందుకే, పదే పదే అవే పొరపాట్లు... అదే గందరగోళం... అవే దుష్ఫలితాలు వస్తున్నాయి. అసలు పేలుళ్ల ప్రాంతాన్ని సందర్శించిన కొద్దిసేపటికే ఒక చలన చిత్రం ఆడియో ఉత్సవానికి కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే హాజరయ్యా రంటేనే మన నేతల్లో నిర్లిప్త ధోరణి ఎంతగా పెరిగిపోయిందో అర్ధమవుతుంది. ఆరుగురు మరణించి, దాదాపు వందమంది గాయపడిన ఉదంతం జరిగిన నగరంలోనే ఈ తరహా కార్యక్రమంలో ఆయన ఎలా పాల్గొనగలిగారో ఊహించ లేం. నేతల్లో ఉండే ఇలాంటి ధోరణే కిందిస్థాయి యంత్రాంగంలో అలసత్వాన్ని పెంచుతున్నది. తమను తాము సరిచేసుకోవడమే కాదు... కిందిస్థాయిలో సమూల ప్రక్షాళనకు పూనుకోనట్టయితే పాట్నా ఘటనల వంటివి పునరావృతమవుతాయని ఇప్పటికైనా నేతలు గుర్తించాలి. తక్షణమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలి.