నో ఫ్లైజోన్!
- తిరుమల కొండపై చక్కర్లు కొడుతున్న విమానాలు
- ఆందోళనలో ఆలయ భద్రత
- నో ఫ్లై జోన్ ప్రకటనలో తీవ్ర జాప్యం
- కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సన్నద్ధమవుతున్న టీటీడీ
శ్రీవారి ఆలయ గగనతలంపై తరచూ విమానాలు ప్రయాణించడం ఆందోళన కలిగిస్తోంది. తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు.
సాక్షి,తిరుమల: దేశంలో ఉగ్రవాద చర్యలు పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా భద్రత విభాగం అప్రమత్తతో ఉంది. అయినప్పటికీ ముష్కరుల టార్గెట్‌లో తిరుమల కూడా ఉండడం భక్తకోటికి ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర నిఘా వర్గాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తరచూ విమానాలు తిరుమల ఆల య గగన తలంపై అతి సమీపంలోనే తిరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
గతంలో అద్వానీ నేతృత్వంలోని పార్లమెంటరీ భద్ర తా కమిటీ తిరుమల ఆలయంపై విమానాలు తిరగకుండా చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చింది. మూడేళ్లు అవుతున్నా అది ఆచరణకు నోచుకోలేదు. టీటీడీ ధర్మకర్తల మండలిలో కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అయినప్పటికీ ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు.
కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీటీడీ నిర్ణయం
ఆలయ గగనతలంపై విమానాలు చక్కర్లు కొట్టే పరిస్థితి రోజురోజుకీ పెరిగిపోతుండడంతో శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు. అదే పరిస్థితి టీటీడీ అధికారుల్లోనూ ఉంది. దీనిపై కేంద్ర పౌర విమానయానశాఖపై ఒత్తిడి తేవాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, టీటీడీ సీవీఎస్‌వో నాగేంద్రకుమార్ కేంద్రంతో చర్చిస్తున్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి తమ వాదన వినిపించి తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించుకునేలా ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు.