పోలీసుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
విజయవాడ: తప్పు చేసిన ప్రజాప్రతినిధులపై పోలీసు అధికారులు తమంతటతాము చర్యలు తీసుకునే మాట అటుంచితే.. ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడానికి జంకుతున్నారు. రవాణాశాఖ ఆఫీస్‌లో టీడీపీ నేతలు గన్‌మెన్‌పై దాడికి పాల్పడిన ఘటనలో చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
వైఎస్‌ఆర్ సీపీ నేతలు పార్థసారధి, అంబటి రాంబాబు తదితరులు రెండు రోజుల క్రితం ఈ ఘటనపై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించిన సీఐ చంద్రశేఖర్.. కనీసం రశీదు కూడా ఇవ్వలేదని వారు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గన్‌మెన్‌పై దాడి ఘటన కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. పోలీసుల తీరుపట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.