నాగరాజు (ఫైల్)
మచిలీపట్నంటౌన్: కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నం సమీపంలోని గరాలదిబ్బలో టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్‌సీపీ నాయకుడు ఒడుగు నాగరాజు (46) మృతిచెందాడు. దీంతో మృతితో మచిలీపట్నం మండలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆదివారం నాగరాజు అంత్యక్రియలు నిర్వహించారు. మచిలీపట్నం మండలం గరాలదిబ్బలో పంచాయతీ ఎన్నికల తరువాత వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య తరచు వివాదాలు చెలరేగుతున్నాయి.
ఈ నేపథ్యంలో గత నెల 5వ తేదీ రాత్రి వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు దాడులు చేశారు. వైఎస్సార్‌సీపీ వారి ఇళ్లల్లోకి వెళ్లి కత్తులు, ఇనుపరాడ్లు, బరిసెలు, రాళ్లతో వీరంగం చేశారు. టీడీపీ వర్గీయుల దాడిలో ఒడుగు నాగరాజు, నిరీక్షణరావు, శివరాజు, రాజ్‌కుమార్, ఏడుకొండలు, శివ తీవ్రంగా గాయపడ్డారు. అన్నం తింటున్న నిరీక్షణరావును బరిసెతో పొడిచారు. ఆ బరిసె కన్ను మీదుగా ముఖంపై గుచ్చుకుంది. నాగరాజుకు కత్తిగాయమైంది.
గాయపడినవారిని ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. వారం రోజులు చికిత్స తీసుకున్న నాగరాజు ఇంటికి చేరుకున్నాడు. తరువాత వాంతులవడం, అనారోగ్యంగా ఉండటంతో జూన్ 22న ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించటంతో మచిలీపట్నం ప్రభుత్వ వైద్యులు విజయవాడకు రిఫర్ చేశారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కొద్దిరోజుల చికిత్స తరువాత పరిస్థితి మరింత విషమించటంతో మరింత మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ నాగరాజు శనివారం సాయంత్రం మరణించాడు.
గరాలదిబ్బలో టెన్షన్ టెన్షన్..
వైఎస్సార్‌సీపీ నాయకుడు నాగరాజు మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. నాగరాజు మృతికి టీడీపీ శ్రేణులే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతనెల 5న జరిగిన దాడి ఘటనపై బొడ్డు వీరవెంకటేశ్వరావు (నాని), బొడ్డు నాగబాబు (చిన్న)తో సహా 12 మంది టీడీపీ వర్గీయులపై పలు సెక్షన్ల కింద రూరల్ ఎస్‌ఐ జి.వాసు కేసు నమోదు చేశారు. నాగరాజు మృతితో వారిపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చిలకలపూడి, పెడన, చల్లపల్లి సీఐలు శ్రీధర్‌బాబు, వీరయ్యగౌడ్, రవికుమార్, ఐదుగురు ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment