న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో భారత్ సహా అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పిన పాకిస్తాన్ మరోసారి తన బుద్ధి చూపించుకుంది. ఉడి, పుల్వామా ఘటనలకు పాల్పడినట్లుగా భావిస్తున్న ఉగ్ర సంస్థలు జైషే మహ్మద్, లష్కర్-ఎ-తొయిబాలను మాత్రమే నిషేధించిన దాయాది దేశం... నిషేధిత ఉగ్ర సంస్థల సరికొత్త జాబితాలో కొన్నింటిని ‘వాచ్‌లిస్టు’లో పెట్టి తన విధానమేమిటో స్పష్టం చేసింది. లష్కర్-ఎ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ స్థాపించిన జమాత్-ఉద్- దావా(జేయూడీ), ఫతా-ఈ- ఇన్సానియత్(ఎఫ్‌ఏఐ)లను నిషేధిస్తామన్న పాక్.. వాటిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొంది. ఈ మేరకు సోమవారం నిషేధిత ఉగ్ర సంస్థల జాబితాలో వాటికి చోటు కల్పించలేదు.
అప్పుడలా..ఇప్పుడేమో ఇలా..
ఉగ్రవాద నిరోధక చట్టం-1997లోని షెడ్యూల్-I ప్రకారం 68 సంస్థలను నిషేధించిన పాకిస్తాన్.. జేయూడీ, ఎఫ్‌ఏఐలను మాత్రం షెడ్యూల్-IIలోని అండర్ వాచ్ జాబితాలో పెట్టింది. అయితే ఫిబ్రవరి 21న విడుదల చేసిన జాబితాలో ఈ రెండు సంస్థలను నిషేధిస్తున్నట్లుగా పాక్ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో చర్చించిన జాతీయ భద్రతా కమిటీ సూచనల మేరకు జేయూడీ, ఎఫ్‌ఏఐలను నిషేధిస్తున్నట్లు తెలిపారు. కానీ తాజా జాబితాలో మాత్రం వాటిని అండర్ వాచ్ లిస్టులో ఉంచడం గమనార్హం. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్- ఉగ్రవాదులకు డబ్బు చేకూరే మార్గాలను పరిశీలించే సంస్థ)లో తమకు ఉన్న ‘గ్రేలిస్టు’ హోదాను తొలగించుకునేందుకు మొదట ఈ రెండు సంస్థలను నిషేధించినట్లుగా పాక్ ప్రకటించింది.
అయితే ప్రస్తుతం ప్రకటించిన జాబితాతో తన బుద్ధి మారదని నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో... ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ నిజ స్వరూపం మరోసారి బయటపడిందని, ఎఫ్‌ఏటీఎఫ్‌ను మోసం చేసేందుకు పాక్ ప్రభుత్వ వర్గాలు ఇలాంటి గిమ్మిక్కులకు పాల్పడ్డాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా కశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టిస్తున్న లష్కర్-ఏ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ 1990లో ఎఫ్ఏఐను, 2002లో జేయూడీని స్థాపించాడు. ఎఫ్‌ఏఐ చారిటీ సంస్థగా కొనసాగుతుండగా.. జేయూడీ లష్కర్‌కు అనుసంధానంగా రాజకీయ పార్టీ ముసుగులో పనిచేస్తోంది. ఇక 2001లో భారత పార్లమెంట్‌పై దాడి, 2006లో ముంబై పేలుళ్లు, 26/11 ముంబై ఘటన వంటి పలు ఉగ్రదాడులకు లష్కర్ పాల్పడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment