సాక్షి, న్యూఢిల్లీ : జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్నమాట వాస్తవమేనని మొట్టమొదటి సారిగా అంగీకరించిన పాక్ విదేశాంగ మంత్రి, మసూద్ ప్రస్తుతం క్యాన్సర్‌తో బాధ పడుతున్నారని తెలిపారు. పాకిస్థాన్ సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మసూద్‌ను సోమవారం ఉదయం భావల్పూర్‌లోని జైషే మొహమ్మద్ శిబిరానికి తరలించినట్లు పాకిస్థాన్ మీడియా తెలియజేసింది. మసూద్ చనిపోయాడన్న, బతికున్నాడన్నా అదో పెద్ద వార్తగా నేడు ప్రపంచ మీడియా ప్రచారం చేస్తోంది? ఇంతకు మసూద్ ఎవరు? ఎక్కడ పుట్టాడు? ఎలా మిలిటెంట్‌గా మారాడు? ఆయనకు పాకిస్థాన్‌కు ఉన్న అనుబంధం ఎలాంటిది? ఆయనకు మన దేశంలో జరగుతున్న ఉగ్ర దాడులకున్న సంబంధం ఏమిటీ?
సరిగ్గా 20 ఏళ్ల క్రితం అంటే, 1999, డిసెంబర్‌లో నేపాల్ రాజధాని కఠ్మాండు నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ–814ను మసూద్ అజర్ అనుచరులు హైజాక్ చేసి కాందహార్‌కు తరలించారు. అందులోని 155 మంది ప్రయాణికులను బందీ చేసుకున్నారు. ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న మసూద్ అజర్‌ను విడుదల చేస్తేనే బందీలను సురక్షితంగా విడుదల చేస్తామని హైజాకర్లు హెచ్చరించారు. అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వారి హెచ్చరికకు లొంగిపోవాల్సి వచ్చింది. హైజాకర్ల డిమాండ్ మేరకు మరో ఇద్దరు టెర్రరిస్ట్ నాయకులతోపాటు మసూద్‌ను అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ ప్రత్యేక విమానంలో కాందహార్‌కు తీసుకెళ్లి హైజాకర్లకు అప్పగించారు.
మసూద్ అజర్ ప్రాముఖ్యత గురించి ఆ రోజే ప్రపంచానికి మొదటిసారి తెలిసి వచ్చింది. అంతకుముందు రెండు సార్లు మసూద్ జైలు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఆయన గురించి మొదటిసారి భారత్‌కు తెలిసి వచ్చింది. 1994లో పోర్చుగీసు పాస్‌పోర్టుపై బంగ్లాదేశ్ మీదుగా కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాకు వచ్చినప్పుడు మసూద్ అజర్ యాదృశ్చికంగా భారత సైనికులకు పట్టుబడ్డారు. అప్పటికే పేరుబడ్డ సజ్జద్ అఫ్ఘాని అనే టెర్రరిస్టుతో కలిసి ఆటోలో వెళుతుండగా తనిఖీలో సైనికులతో అఫ్ఘానితోపాటు మసూద్‌ను అరెస్ట్ చేశారు.
స్కూల్ హెడ్‌మాస్టర్ కొడుకు
భారత్‌లో పట్టుపడ్డప్పడు దాదాపు 30 ఏళ్లు ఉన్న మసూద్ అజర్ పాకిస్థాన్, పంజాబ్ రాష్ట్రంలోని భావల్పూర్‌లో పుట్టాడు. ఆయన తండ్రి ఓ స్కూల్ హెడ్‌మాస్టర్. 1980వ దశకంలో సోవియట్–అఫ్ఘానిస్థాన్ యుద్ధాలతో స్ఫూర్తి పొందిన మసూద్ అఫ్ఘానిస్థాన్ తరపున సోవియట్ దళాలపై మిలెటెంట్ పోరాటాలు జరిపాడు. ఆ తర్వాత 1990వ దశకంలో కశ్మీర్‌లో ప్రవేశించి మిలిటెంట్ కార్యకలాపాలు ప్రారంభించాడు. 1994లో యాధశ్చికంగా అరెస్ట్ అయ్యాడు. అప్పుడు హర్కతుల్ అన్సార్ అనే మిలిటెంట్ సంస్థకు అతను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు.
1999, డిసెంబర్‌లో విడుదలయ్యాక నేరుగా పాకిస్థాన్ వెళ్లాడు. కార్గిల్ యుద్ధంలో పరాజయం భారంతో ఉన్న పాకిస్థాన్ సైనికులు, ఐఎస్‌ఐ ఆయనకు ఆశ్రయం కల్పించింది. ఆ తర్వాత కొద్దికాలం అఫ్ఘాన్‌లో గడిపిన మసూద్ పాకిస్థాన్ తిరిగొచ్చి బాలకోట్‌లో జేషే మొహమ్మద్ సంస్థను ఏర్పాటు చేశాడు. 2000లో మళ్లీ కశ్మీర్‌లో ప్రవేశించిన భారత సైనికులకు వ్యతిరేకంగా అనేక మిలిటెంట్ దాడులు జరిపించాడు. పాక్ సైనిక, ఐఎస్‌ఐ అధికారులతో ఆయన కశ్మీర్‌లోని సులభంగా వచ్చి అంతకన్నా సులభంగా బాలకోట్ వెళ్లేవాడు. కశ్మీర్‌లోని షాపియన్, కుల్గామ్, అనంత్‌నాగ్, పుల్వామా ప్రాంతాల్లో స్థానిక మిలిటెంట్లను చేరదీసి మంచి పట్టు సాధించాడు.
మసూద్‌కు వీవిఐపీ సెక్యూరిటీ
2000, జనవరిలో కరాచిలోని ఓ మసీదు నుంచి ముస్లిం ప్రజలనుద్దేశించి మసూద్ అజర్ ప్రసంగించాడు. ఈ విషయాన్ని ఓ పాకిస్థాన్ జర్నలిస్ట్ రుజువు చేయగా, దాన్ని పాక్ ఐఎస్‌ఐ ఖండించింది. మసూద్ జాడ తమకే తెలియడం లేదని బుకాయించింది. ఆ జర్నలిస్టు స్వయంగా వెళ్లి మసూద్ అజర్ కలసుకున్నారు. మసూద్‌కున్న సైనిక సెక్యూరిటీని చూసిన ఆ జర్నలిస్ట్, వీవీఐపీలకు కూడా ఉండనంత సెక్యూరిటీ ఉందంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మసూద్ అజర్ 1999లో భారత్ నుంచి విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు భారత్‌కు వ్యతిరేకంగా 45 జైషే ఆత్మాహుతి దాడులు జరిపించాడు. వాటిలో పార్లమెంట్, ఎర్రకోట సైనిక శిబిరంపై జరిగిన దాడులు కూడా ఉన్నాయి. దాంతో ఆయన్ని ‘భారత ఒసామా బిన్ లాడెన్’గా భారత మీడియా అభివర్ణించింది.
బాలకోట్‌లో స్థావరం
బాలకోట్‌లో మసూద్ అజర్ టెర్రరిస్ట్ శిక్షణా శిబిరం ఉన్నట్లు 2006లో ఓ అమెరికన్ ‘టెర్రరిస్ట్ ఎక్స్‌పర్ట్’ కాలిఫోర్నియా కోర్టుకు తెలిపారు. ఆయన అందుకు సాక్ష్యాలు 2001 నుంచి 2004 మధ్య శాటిలైట్ రికార్డు చేసిన ఛాయా చిత్రాలను చూపించారు. ఎప్పటిలాగా అప్పుడు పాకిస్థాన్ ప్రభుత్వం ఆ వార్తను ఖండించింది. ఆ తర్వాత పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పర్వేజ్ ముషార్రఫ్‌నే హత్య చేయడానికి జైషే ఉగ్రవాదులు ప్రయత్నించడం, ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిళ్లు తీవ్రమవడంతో తప్పనిసరై 2008 నుంచి పాన్ సైన్యం జైషే చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.
2014లో మళ్లీ ప్రత్యక్షం
పాక్ సైనిక చర్యలతో అజ్ఞాతంలోకి వెళ్లిన మసూద్ 2014లో హఠాత్తుగా పాకిస్థాన్‌లో ప్రజల మధ్య మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. 2016లో పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక స్థావరంపై జైషే ఆత్మాహతి దాడికి పాల్పడడంతో మసూద్‌పై కఠిన చర్యలకు భారత ప్రభుత్వం, పాక్‌ను డిమాండ్ చేసింది. తాత్కాలికంగా మసూద్‌ను అదుపులోకి తీసుకున్న పాక్ సైన్యం రాచ మర్యాదలు చేసి విడిచిపెట్టింది. పఠాన్‌కోట్ నుంచి పుల్వామా ఉగ్ర దాడి వరకు జరిగిన అనేక ఉగ్ర దాడులతో మసూద్ అజర్‌కు ప్రత్యక్ష సంబంధం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment