వాషింగ్టన్: నేటికి కూడా పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులకు నిరంతరం మద్దతు ఇవ్వడమే కాక వారికి సురక్షితమైన స్వర్గంగా పనిచేస్తున్నదని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్, అఫ్గనిస్తాన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులపై పాక్ ఇంకా నిర్ణయాత్మక చర్యలు తీసుకోలేదు అని అమెరికా విదేశాంగ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. ‘ప్రాంతీయంగా పుట్టుకొచ్చిన కొన్ని ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ సురక్షితమైన స్వర్గధామంగా కొనసాగుతోంది’ అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపీయో ఆరోపించారు. తమ దేశంలో నివసిస్తున్నట్లు భావిస్తున్న ఉగ్రవాద నాయకులను విచారించడానికి పాకిస్తాన్ ఎటువంటి ప్రయత్నం చేయలేదని ఈ నివేదిక పేర్కొంది. 2008లో ముంబై దాడుల సూత్రధారి జైషే ఈ మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్, సాజిద్ మీర్ వంటి ఇతర ఉగ్రవాద నాయకులను విచారించడానికి పాకిస్తాన్ ఎలాంటి ప్రయత్నం చేయలేదని నివేదిక పేర్కొన్నది. వీరిద్దరూ పాకిస్తాన్ రక్షణలో నివసిస్తున్నారని ప్రపంచం అంతా తెలుసు. కానీ అక్కడి ప్రభుత్వం ఈ వాదనలను తిరస్కరిస్తుంది అని తెలిపింది.
ఉగ్రవాద గ్రూపులను అంతం చేయడంలో పాకిస్తాన్ ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమైందని కూడా పేర్కొంది. అయితే 2019 ఫిబ్రవరిలో జమ్మూ కశ్మీర్‌లో భద్రతా దళాలపై దాడి చేసిన తర్వాత పాక్ ఉగ్రవాద గ్రూపులకు అందించే ఆర్థిక సాయాన్ని నిలిపివేయడానికి కొన్ని చర్యలు తీసుకున్న మాట వాస్తవం అని ఈ నివేదిక వెల్లడించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి పాకిస్తాన్ 2015లో జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. కానీ ఎలాంటి పురోగతి సాధించలేదు అని నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment