
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. దాదాపు 12మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లోకి చొరబడ్డారని, పిర్ పంచాల్ పర్వత శ్రేణుల మీదుగా పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వీరు ఈ నెలలోనే జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించారని నిఘా వర్గాలకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో జమ్మూకశ్మీర్, దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒకేసారి 12 మందికిపైగా ఉగ్రవాదులు దేశంలోకి రావడం ఆందోళన రేపుతోంది.
ఈ క్రమంలో జమ్మూకశ్మీర్, ఢిల్లీలో దాడులు జరిగే అవకాశముందని ఐబీ హెచ్చరికలు జారీచేసింది. 12మంది ఉగ్రవాదులు ప్రస్తుతం మూడు గ్రూపులుగా విడిపోయి.. ప్రతి గ్రూపులో నలుగురు చొప్పున ఉన్నారని, దక్షిణ కశ్మీర్‌లోని ట్రాల్, షోపియన్, పుల్వామా జిల్లాల్లో వీరు యాక్టివ్‌గా సంచరిస్తున్నారని భదత్రా సంస్థలకు చెందిన ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. దక్షిణ కశ్మీర్‌లో గతవారం రోజుల్లోనే దాదాపు 12 ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ దాడులను చాలావరకు భద్రతా దళాలు తిప్పికొట్టాయి.