
మౌంట్ మాంగనుయ్: మహిళల వన్డే ప్రపంచకప్ లో పాకిస్తాన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆరు పరుగుల తేడాతో గెలిచింది. చేతిలో రెండు వికెట్లు ఉండగా పాకిస్తాన్ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి ఓవర్ వేసిన దక్షిణాఫ్రికా పేసర్ షబ్నిమ్ (3/41) ఐదు బంతుల్లో మిగిలిన రెండు పాక్ వికెట్లు తీసి తమ జట్టును గెలిపించింది. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 49.5 ఓవర్లలో 217 పరుగుల వద్ద ఆలౌటై ఈ టోర్నీలో వరుసగా మూడో ఓటమి చవిచూసింది. ఒమైమా (65; 7 ఫోర్లు), నిదా దార్ (55; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అంతకుముందు దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 223 పరుగులు సాధించింది. లౌరా వోల్వార్ట్ (75; 10 ఫోర్లు), సునె లుస్ (62; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు.