![Williamson heroics lead New Zealand to Tri-Nation final](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/kane.jpg.webp?itok=LZCSlOZn)
అజేయ సెంచరీతో న్యూజిలాండ్‌ను గెలిపించిన స్టార్ బ్యాటర్
రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 6 వికెట్లతో నెగ్గి ఫైనల్లోకి కివీస్
మాథ్యూ బ్రీజ్‌కీ శతకం వృథా
లాహోర్: ముక్కోణపు వన్డే టోర్నమెంట్‌లో రెండు వరుస విజయాలతో న్యూజిలాండ్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి పోరులో ఆతిథ్య జట్టు పాకిస్తాన్‌ను చిత్తు చేసిన కివీస్ రెండో లీగ్ మ్యాచ్‌లో సఫారీలను ఓడించింది. సోమవారం జరిగిన ఈ పోరులో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌తోనే వన్డేల్లో అరంగేట్రం చేసిన మాథ్యూ బ్రీజ్‌కీ (148 బంతుల్లో 150; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకంతో చెలరేగాడు. కెరీర్ తొలి వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా బ్రీజ్‌కీ ఘనత సాధించాడు. వియాన్ ముల్డర్ (60 బంతుల్లో 64; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా, జేసన్ స్మిత్ (51 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం న్యూజిలాండ్ 48.4 ఓవర్లలో 4 వికెట్లకు 308 పరుగులు చేసి గెలిచింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేన్ విలియమ్సన్ (113 బంతుల్లో 133 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు సెంచరీ సాధించగా... ఓపెనర్ డెవాన్ కాన్వే (107 బంతుల్లో 97; 9 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో చేజార్చుకున్నాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 187 పరుగులు జోడించారు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత విలియమ్సన్‌కు ఇదే మొదటి శతకం కావడం విశేషం. దాదాపుగా ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు వన్డేల్లో ఇది వరుసగా ఐదో ఓటమి. బ్రీజ్‌కీతో పాటు మరో ముగ్గురు బౌలర్లు ఈథన్ బాష్, సెనురాన్ ముత్తుసామి, మిహ్‌లాలి ఎంపొంగ్‌వానా ఇదే వన్డేతో అరంగేట్రం చేశారు. దాంతో జట్టు బౌలింగ్ బలహీనంగా మారిపోయింది. బుధవారం
పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్ ఫలితం తర్వాత న్యూజిలాండ్‌తో ఫైనల్లో తలపడే జట్టేదో తేలుతుంది.
150: దక్షిణాఫ్రికా క్రికెటర్ మాథ్యూ బ్రీజ్‌కీ అరంగేట్రం వన్డేలో చేసిన స్కోరు. ఆడిన తొలి వన్డేలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా బ్రీజ్‌కీ నిలిచాడు. 47 ఏళ్లుగా వెస్టిండీస్ ప్లేయర్ డెస్మండ్ హేన్స్ పేరిట ఉన్న రికార్డును బ్రీజ్‌కీ బద్దలు కొట్టాడు. 1978లో ఆస్ట్రేలియాతో
జరిగిన వన్డేలో హేన్స్ 148 పరుగులు సాధించాడు.
4: బరిలో దిగిన తొలి వన్డేలోనే సెంచరీ చేసిన నాలుగో దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా బ్రీజ్‌కీ గుర్తింపు
పొందాడు. గతంలో కొలిన్ ఇంగ్రామ్ (124; జింబాబ్వేపై 2010లో), తెంబా బవూమా (113; ఐర్లాండ్‌పై 2016లో), రీజా హెన్‌డ్రిక్స్ (102; శ్రీలంకపై 2018లో) ఈ ఘనత సాధించారు.
2: దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన క్రమంలో న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ వన్డేల్లో 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తక్కువ ఇన్నింగ్స్‌లలో 7 వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా విలియమ్సన్ (159 ఇన్నింగ్స్) నిలిచాడు. ఈ జాబితాలో హాషిమ్ ఆమ్లా (150 ఇన్నింగ్స్) తొలి స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment