‘హ్యాట్రిక్’పై గురి
♦ నేడు పాకిస్తాన్‌తో భారత్ ‘ఢీ’
♦ దుర్భేద్యంగా మిథాలీ రాజ్ బృందం
♦ మహిళల వన్డే ప్రపంచకప్
దాయాదుల మధ్య ఇది మరో క్రికెట్ యుద్ధమే కానీ ఈసారి మహిళలది. జైత్రయాత్ర కొనసాగించేందుకు ఓ జట్టు... బోణీ కొట్టాలన్న ఆశతో మరో జట్టు ఢీకొనేందుకు సిద్ధమయ్యాయి. వరుస విజయాలతో భారత మహిళలు దూసుకెళుతుంటే... వరుస వైఫల్యాలతో పాక్ పరువు కోసం పాకులాడుతోంది. ఎలాగైనా దాయాదిని ఓడించి గెలుపు బాట పట్టాలని చూస్తోంది. కానీ ఆల్‌రౌండ్ నైపుణ్యమున్న మిథాలీ సేనను పాక్ ఏ మాత్రం నిలువరిస్తుందో చూడాలి.
డెర్బీ: ఇప్పుడు మహిళల వంతు వచ్చింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు సమరానికి సై అంటున్నాయి. చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆదివారం లీగ్ పోరు జరగనుంది. వరుస విజయాలిచ్చిన ఆత్మవిశ్వాసంతో మిథాలీ సేన ఉండగా ... అసలు బోణీనే చేయని పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్ కీలకం. విజయంతో గెలుపు బాట పడితే తర్వాత సెమీస్ లక్ష్యంపై ఆలోచించవచ్చనే ధైర్యంతో ఉంది.
తిరుగులేని రికార్డు...
పాకిస్తాన్‌పై భారత మహిళలది తిరుగులేని రికార్డు. ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ భారతే గెలిచింది. మిథాలీ సారథ్యంలోనే ఏకంగా 8 మ్యాచ్‌లు గెలవడం విశేషం. ఇక ప్రపంచకప్ చరిత్ర కూడా భిన్నంగా ఏమీ లేదు. ఈ మెగా ఈవెంట్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మిథాలీ సేననే విజయం వరించింది. ఇక ఈ చరిత్రను పక్కనపెట్టి... కేవలం ఈ టోర్నీనే పరిశీలిద్దామంటే... ఇందులోనూ భారత్ జోరు, హోరు ఏమాత్రం తక్కువలేదు... ప్రత్యర్థులకు తలొగ్గలేదు. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ను, రెండో మ్యాచ్‌లో గత రన్నరప్ విండీస్‌ను కంగుతినిపించింది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ మొదలు బౌలర్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు.
ఏ అవకాశాన్నీ వదులుకోవడంలేదు. ఎవరినీ తక్కువ అంచనా వేయడం లేదు. ఓపెనింగ్‌లో స్మృతి మంధన అసాధారణరీతిలో రాణిస్తోంది. ఇంగ్లండ్‌తో కేవలం 10 పరుగుల తేడాతో సెంచరీ అవకాశాన్ని కోల్పోయిన ఆమె ఆ వెంటనే విండీస్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో అజేయ సెంచరీ చేసింది. విజయసారథి మిథాలీ రెండు మ్యాచ్‌ల్లోనూ నిలకడగా ఆడింది. మిడిలార్డర్‌లో దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్‌లు కూడా పాక్ బౌలర్ల భరతం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలోనూ భారత పేసర్లు, స్పిన్నర్లు సమష్టిగా రాణిస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకనొక దశలో లక్ష్యంవైపు దూసుకెళుతున్న ప్రత్యర్థి జట్టును స్పిన్నర్లు దీప్తి శర్మ, పూనమ్ యాదవ్‌లు సమర్థంగా కట్టడి చేశారు.
గెలుపే లక్ష్యంగా పాక్
మరోవైపు సనా మీర్ సారథ్యంలోని పాక్ పరిస్థితి భారత్‌కు పూర్తి భిన్నంగా ఉంది. టీమిండియా రెండు విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో ఉంటే... పాక్ రెండు పరాజయాలతో డీలా పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పాక్ లక్ష్యం సెమీసో... ఫైనలో కాదు. ఒక్క గెలుపే! ఎందుకంటే ఒక్కసారి గెలుపుబాట పడితే తమ ప్లేయర్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక ముందు జరిగే మ్యాచ్‌ల్లో ధీమాతో ఆడే అవకాశం ఏర్పడుతుంది. పైగా జోరుమీదున్న మిథాలీ సేనను ఓడిస్తే వచ్చే కిక్కే వేరు.
జట్లు (అంచనా)
భారత్: మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధన, పూనమ్ రౌత్, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, మోనా మేశ్రమ్, వేద కృష్ణమూర్తి, జులన్ గోస్వామి, శిఖా పాండే, పూనమ్ యాదవ్, సుష్మ వర్మ.
పాకిస్తాన్: సనా మీర్ (కెప్టెన్), అయేషా జాఫర్, నహిదా ఖాన్, జవేరియా ఖాన్, బిస్మా మరూఫ్, నయిన్ అబిది, కైనత్ ఇంతియాజ్, అస్మావియా ఇక్బాల్, సిద్రా నవాజ్, నష్రా సంధు, సాదియా యూసుఫ్.
మధ్యాహ్నం గం. 2.50 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం