
Photo Courtesy: BCCI/IPL
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ (Digvesh Singh Rathi)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గట్టి షాకిచ్చింది. వికెట్ తీసిన సంబరంలో ‘అతి’ చేసినందుకు గానూ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం మేర కోత వేయడంతో పాటు.. అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను జత చేసింది. అసలేం జరిగిందంటే..
ఐపీఎల్-2025లో భాగంగా లక్నో మంగళవారం పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో మ్యాచ్ ఆడింది. ఏకనా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసింది. ఐడెన్ మార్క్రమ్ (18 బంతుల్లో 28), నికోలస్ పూరన్ (30 బంతుల్లో 44), ఆయుశ్ బదోని (33 బంతుల్లో 41), అబ్దుల్ సమద్ (12 బంతుల్లో 27) రాణించారు.
అర్ష్‌దీప్ సింగ్‌కు మూడు వికెట్లు
ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో లక్నో జట్టు ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు స్కోరు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో మెరవగా.. లాకీ ఫెర్గూసన్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
ప్రియాన్ష్ ఆర్య విఫలం
ఇక లక్ష్య ఛేదన మొదలుపెట్టిన కాసేపటికే పంజాబ్.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య వికెట్ కోల్పోయింది. లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ అవుట్‌సైడ్ ఆఫ్ దిశగా.. సంధించిన షార్ట్ బంతిని ఆడే క్రమంలో బ్యాట్ టాప్ ఎడ్జ్‌కు తగిలింది. అయితే, షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో గాల్లోకి లేచిన బంతిని.. మిడాన్ నుంచి పరిగెత్తుకుని వచ్చిన ఫీల్డర్ శార్దూల్ ఠాకూర్ ఒడిసిపట్టాడు.
రాఠీ ‘ఓవరాక్షన్’
ఈ క్రమంలో మొత్తంగా తొమ్మిది బంతులు ఎదుర్కొన్న ప్రియాన్ష్ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. అయితే, అతడు క్రీజు వీడుతున్న సమయంలో దగ్గరికి పరిగెత్తుకు వచ్చిన దిగ్వేశ్ రాఠీ ‘ఓవరాక్షన్’ చేశాడు. పుస్తకంలో అతడి పేరును రాసుకుంటున్నట్లుగా వికెట్ తీసిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.
#DigveshRathi provides the breakthrough as #PriyanshArya heads back!
P.S: Don't miss the celebration at the end! 👀✍🏻
Watch LIVE action of #LSGvPBKS ➡ https://t.co/GLxHRDQajv#IPLOnJiostar | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar! | #IndianPossibleLeague pic.twitter.com/TAhHDtXX8n— Star Sports (@StarSportsIndia) April 1, 2025
ఈ నేపథ్యంలో దిగ్వేశ్ రాఠీ చర్యను తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్ పాలక మండలి అతడిపై కఠిన చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ మీడియా అడ్వైజరీ కమిటీ ప్రకటన విడుదల చేసింది.
జరిమానా
‘‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5లో గల లెవల్ 1 నిబంధనను దిగ్వేశ్ రాఠీ అతిక్రమించాడు. మ్యాచ్ రిఫరీ నిర్ణయం ప్రకారం అతడిపై చర్యలు తీసుకున్నాం’’ అని పేర్కొంది. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు డీమెరిట్ పాయింట్ జతచేసినట్లు వెల్లడించింది.
కాగా ఢిల్లీకి చెందిన దిగ్వేశ్ సింగ్ రాఠీ ఈ ఏడాదే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో మ్యాచ్ సందర్భంగా విశాఖపట్నం వేదికగా ఎంట్రీ ఇచ్చిన ఈ రైటార్మ్ స్పిన్నర్ తొలి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు మొత్తంగా మూడు మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు.
పంజాబ్ ఘన విజయం
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ప్రియాన్ష్ ఆర్య వికెట్ తీసిన ఆనందం లక్నోకు ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69) అర్ధ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52), నేహాల్ వధేరా (25 బంతుల్లో 43) ధనాధన్ దంచికొట్టి అజేయంగా ఇన్నింగ్స్‌తో.. జట్టును విజయతీరాలకు చేర్చారు. 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
చదవండి: రూ. 27 కోట్లు దండుగ!.. పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా!