
Photo Courtesy: BCCI/IPL
సొంత మైదానంలో తొలి మ్యాచ్‌లోనే లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)కు చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్ కింగ్స్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. కనీసం మరో 20- 25 పరుగులు చేసి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు.
హోం గ్రౌండ్‌లో పిచ్ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమయ్యామని.. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని పంత్ అన్నాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా లక్నో మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. లక్నో బ్యాటింగ్‌కు దిగింది.
పంత్ ఫెయిల్
టాపార్డర్‌లో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (18 బంతుల్లో 28) తొలిసారి రాణించగా.. ఇన్ ఫామ్ ఓపెనర్ మిచెల్ మార్ష్ మాత్రం డకౌట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన నికోలస్ పూరన్ (30 బంతుల్లో 44) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ పంత్ (5 బంతుల్లో 2) మాత్రం మరోసారి పూర్తిగా నిరాశపరిచాడు.
ఈ క్రమంలో ఆయుష్ బదోని (33 బంతుల్లో 41) మెరుగ్గా బ్యాటింగ్ చేయగా.. డేవిడ్ మిల్లర్ (18 బంతుల్లో 19) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆఖర్లో అబ్దుల్ సమద్ మెరుపు ఇన్నింగ్స్ (12 బంతుల్లో 27) ఆడటంతో లక్నో 170 పరుగుల మార్కు దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
పంజాబ్ ఫటాఫట్
ఇక లక్ష్య ఛేదనలో పంజాబ్ ఆరంభంలోనే ప్రియాన్ష్ ఆర్య(8) వికెట్ కోల్పోయినప్పటికీ.. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు సాధించాడు. ఇక శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52 నాటౌట్) మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. నేహాల్ వధేరా (25 బంతుల్లో 43 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
Statement victory ✅
Skipper's second 5⃣0⃣ this season ✅
Consecutive wins ✅
Punjab Kings cap off a perfect day 🙌#TATAIPL | #LSGvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/HSrX8KwiY4— IndianPremierLeague (@IPL) April 1, 2025
ఈ నేపథ్యంలో 16.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ జయకేతనం ఎగురవేసింది. లక్నోపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలో పంజాబ్ గెలుపొందింది. మరోవైపు.. మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న లక్నోకు ఇది రెండో ఓటమి.
పాఠాలు నేర్చుకుంటాం.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను
ఈ క్రమంలో ఓటమి అనంతరం లక్నో సారథి రిషభ్ పంత్ మాట్లాడుతూ.. ‘‘మేము మరిన్ని పరుగులు సాధించాల్సింది. కనీసం మరో 20- 25 రన్స్ చేయాల్సింది. అయితే, ఆటలో ఇవన్నీ సహజమే. మా సొంత మైదానంలో వికెట్‌ను అంచనా వేసేందుకు ఇంకా సమయం పడుతోంది.
ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే భారీ స్కోర్లు సాధించడం చాలా కష్టం. అయితే, జట్టులోని ప్రతి సభ్యుడు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. స్లో వికెట్ ఉంటుందని భావించాం. ఈ మ్యాచ్ ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి. అయితే, ఇందులో మాకు కొన్ని సానుకూలతలు కూడా ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.
చదవండి: ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు నో ఛాన్స్! కెప్టెన్ ఎవరంటే?