
Photo Courtesy: BCCI/JioHotstar
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డులకెక్కాడు టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant). ఐపీఎల్-2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఈ వికెట్ కీపర్ కోసం ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ పంత్‌ను సొంతం చేసుకుని.. జట్టు పగ్గాలు అప్పగించింది.
అయితే, లక్నో సారథిగా తొలి మ్యాచ్‌లోనే పంత్ విఫలమయ్యాడు. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా స్థాయికి తగ్గట్లు రాణించలేక.. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. ఇక రెండో మ్యాచ్‌లో మాత్రం పంత్‌కు ఊరట దక్కింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో లక్నో గెలుపొందడంతో అతడు తొలి విజయం అందుకున్నాడు. అయితే, సొంత మైదానంలో మాత్రం మళ్లీ పాత కథే పునరావృతమైంది.
పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో మంగళవారం నాటి మ్యాచ్‌లో లక్నో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సమిష్టి వైఫల్యం కారణంగా హోం గ్రౌండ్‌లో తొలి మ్యాచ్‌లోనే పరాజయాన్ని చవిచూసింది. ఇక ఇప్పటి వరకు లక్నో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ పంత్ బ్యాటర్‌గా విఫలం కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
బ్యాటర్‌గా విఫలం
తొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రిషభ్ పంత్ ఆరు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. రెండో మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్‌తో పోరులో పదిహేను బంతుల్లో పదిహేను పరుగులు చేయగలిగాడు. ఇక తాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో ఐదు బంతులు ఎదుర్కొని కేవలం రెండే పరుగులు చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో పంత్ బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రూ. 27 కోట్లు దండుగ!
‘‘పంత్‌కు ఏమైంది? హ్యాట్రిక్ అట్టర్‌ఫ్లాప్‌లు.. రూ. 27 కోట్లు.. లక్నో బూడిదలో పోసినట్లే..’’ అంటూ సోషల్ మీడియా వేదికగా పంత్‌పై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. మరోవైపు.. ప్రతి మ్యాచ్ తర్వాత లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా పంత్‌తో సంభాషిస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా
తాజాగా పంజాబ్‌తో మ్యాచ్ తర్వాత కూడా గోయెంకా పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పంత్ చేతులు కట్టుకుని నిలబడగా.. అతడి వైపు వేలు చూపిస్తూ మరీ గోయెంకా సీరియస్ అయిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోయెంకా తీరుపై కూడా ట్రోల్స్ వస్తున్నాయి. గతంలో కేఎల్ రాహుల్‌తో ఇలాగే వ్యవహరించిన తీరును గుర్తుచేస్తూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
‘‘విజయాల కంటే కూడా ఇలాంటి వివాదాలతోనే హైలైట్ కావాలని చూసే ఓనర్ ఈయన ఒక్కడేనేమో! ప్రతి మ్యాచ్ తర్వాత ఇలా కెప్టెన్‌తో అందరి ముందే సంభాషిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా బిల్డప్ ఇవ్వడం ద్వారా ఏం నిరూపించాలనుకుంటున్నారు? డబ్బులు పెట్టి కొన్నంత మాత్రాన వారిని తక్కువ చేసి చూపడం సరికాదు’’ అంటూ హితవు పలుకుతున్నారు.
ఐపీఎల్-2025: లక్నో వర్సెస్ పంజాబ్ స్కోర్లు
👉వేదిక: భారత రత్న శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో
👉టాస్: పంజాబ్.. తొలుత బౌలింగ్
👉లక్నో స్కోరు: 171/7 (20)
👉పంజాబ్ స్కోరు: 177/2 (16.2)
👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో లక్నోపై పంజాబ్ గెలుపు
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69).
చదవండి: ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు నో ఛాన్స్! కెప్టెన్ ఎవరంటే?
Statement victory ✅
Skipper's second 5⃣0⃣ this season ✅
Consecutive wins ✅
Punjab Kings cap off a perfect day 🙌#TATAIPL | #LSGvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/HSrX8KwiY4— IndianPremierLeague (@IPL) April 1, 2025