
నిషేధం ఎత్తివేసిన బీసీసీఐ
న్యూఢిల్లీ: బంతిని రివర్స్ స్వింగ్ చేయగల సత్తా ఉన్న బౌలర్లకు శుభవార్త ఇది! బ్యాటర్ల బాదుడుతో ఏ దశలోనూ బంతిని నియంత్రణలో ఉంచుకోలేకపోతున్న పేసర్లకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఊరటనిచ్చింది. 2025 సీజన్‌లో బంతిపై ఉమ్మి (సలైవా)ని రుద్దేందుకు అనుమతినిచ్చింది. గురువారం జరిగిన టీమ్ కెప్టెన్ల సమావేశంలో వారి అభిప్రాయం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. సలైవాను ఉపయోగిస్తే బంతిపై నునుపుదనం పెరిగి రివర్స్ స్వింగ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
మ్యాచ్ కీలక క్షణాల్లో పేసర్లు దీనిని సమర్థంగా వాడుకోగలిగితే పైచేయి సాధించవచ్చు. క్రికెట్‌లో సుదీర్ఘ కాలంగా ఇది అమల్లో ఉంది. అయితే కోవిడ్ వచ్చిన తర్వాత నాటి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సలైవాను రుద్దడంపై నిషేధం విధించడంతో పాటు ఎవరైనా వాడితే ఆ బౌలర్లకు శిక్షలు కూడా విధించింది. అయితే ఇప్పుడు అంతా మారిపోవడంతో బౌలర్ల వైపు నుంచి అభ్యర్థనలు వచ్చాయి. దాంతో ఒక మేజర్ ఈవెంట్‌లో తొలిసారి సలైవాను వాడేందుకు అనుమతినిస్తున్నారు.
ఐసీసీ ఆంక్షలు ఇంకా ఉన్నా... ఐపీఎల్ మాత్రం దానికి సై అంది. తాజా నిర్ణయాన్ని పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ స్వాగతించాడు. లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున తొలిసారి ఆడనున్న అతను ‘సలైవా’ తమకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డాడు. ‘ఇది పేస్ బౌలర్లకు ఎంతో మంచిది. బంతితో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్న పరిస్థితుల్లో సలైవా వాడటం తప్పనిసరి. కొంతైనా రివర్స్ స్వింగ్‌కు ప్రయత్నించవచ్చు. బంతిని షర్ట్‌ను రుద్దడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు.
సలైవా వల్ల ఒకవైపు మెరుపును కొనసాగించవచ్చు. ఇది చాలా ముఖ్యం’ అని సిరాజ్ అన్నాడు. మరోవైపు ఎత్తుకు సంబంధించిన వైడ్‌లు, ఆఫ్‌సైడ్ వైడ్‌ల విషయంలో డీఆర్‌ఎస్ వాడుకునేందుకు కూడా గవర్నింగ్ కౌన్సిల్ అంగీకరించింది. రాత్రి మ్యాచ్‌లలో మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రెండో ఇన్నింగ్స్ సమయంలో 11వ ఓవర్ ఒక బంతిని మార్చేందుకు కూడా అనుమతినిచ్చారు.
కెప్టెన్‌లపై నిషేధం ఉండదు...
ఇక నుంచి ఐపీఎల్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కెపె్టన్‌లపై మ్యాచ్ నిషేధం ఉండదని గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. గురువారం జరిగిన ఐపీఎల్ జట్ల కెప్టెన్‌ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిషేధం బదులుగా కెప్టెన్‌లపై డీ మెరిట్ పాయింట్లు విధిస్తారు.
గత ఏడాది హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు మూడుసార్లు స్లో ఓవర్‌రేట్ నమోదు చేసింది. దాంతో పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం పడింది. గతేడాది హార్దిక్‌పై విధించిన ఒక మ్యాచ్ నిషేధం ఈ ఏడాది అమలు కానుంది. ఫలితంగా 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే తమ తొలి మ్యాచ్‌కు హార్దిక్ దూరమయ్యాడు. హార్దిక్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment