హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా ప్రభావం రిటైల్ రంగ ముఖ చిత్రాన్ని మార్చనుంది. ఇప్పటి వరకు భవన యజమాని, దుకాణదారు మధ్య అద్దె చెల్లించేలా ఒప్పందాలు ఉండేవి. రానున్న రోజుల్లో అద్దెకు బదులుగా ఆదాయంలో వాటా ఇచ్చేలా ఒప్పందాలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్త లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల దుకాణాలు మినహా మిగిలినవన్నీ మూతపడ్డ సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణలోకి వచ్చి మాల్స్, దుకాణాలు తెరుచుకున్నాక వ్యాపారం తిరిగి గాడిన పడేందుకు కొన్ని నెలల సమయం పట్టనుంది. వ్యాపారాలు అంతంతే నమోదు అవుతాయి కాబట్టి అద్దెలు చెల్లించే స్థాయి విక్రయదారులకు ఉండదని నిపుణులు అంటున్నారు. వ్యాపారాలు లేనందున భవన యజమానులకు మరో మార్గం లేదని, ఆదాయంలో వాటా తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. దుకాణదారులు కోలుకోవడానికి ఈ విధానం చక్కని పరిష్కారం అని వారు అభిప్రాయపడ్డారు.
ఆ నిబంధన ప్రకారం..
ఫోర్స్ మెజోర్ నిబంధన ప్రకారం అద్దెలో వెసులుబాటును దుకాణదారులు కోరవచ్చు. మూతపడ్డ కాలానికి అద్దె చెల్లించలేమని చెప్పేందుకూ ఆస్కారం ఉంటుంది. సాధారణంగా మాల్స్‌లో దాదాపు 60 శాతం మేర స్థలాన్ని ప్రధాన బ్రాండ్ల యాంకర్ స్టోర్లతో నిండిపోయి ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా ఫోర్స్ మెజోర్ నిబంధనను వినియోగించుకుంటాయి. రిటైలర్ల ఆదాయంలో అద్దె ఖర్చు 12–16 శాతముంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంటోంది. మాల్ యజమానులు 45 శాతం అద్దె కోల్పోయే చాన్స్ ఉందని చెబుతోంది. ఒకవేళ రెండు నెలలకుపైగా దుకాణాలు మూసివేస్తే దాని ప్రభావంతో 62 శాతం అద్దె కోల్పోయే అవకాశం ఉందని వివరించింది. కస్టమర్ల రాక తక్కువగా ఉండడంతో దుకాణదారుల ఆర్థిక స్థితిపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని తెలిపింది. గతంలో రోజుకు ఎంతకాదన్నా దేశవ్యాప్తంగా ఉన్న మాల్స్‌లో రూ.500 కోట్ల వ్యాపారం నమోదయ్యేదని అంచనా.
మొదలైన వినతులు..
అద్దెలు తగ్గించాల్సిందిగా రిటైలర్ల నుంచి వినతులు వస్తున్నాయని రియల్ ఎస్టేట్ సంస్థలు, మాల్ యజమానులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో రిటైలర్లు ఎదుర్కోబోయే సమస్యలు, సవాళ్లను రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే తెలియజేశాయి. అద్దె నుంచి మినహాయించాల్సిందిగా బిగ్‌బజార్, ఈజీడే క్లబ్ ఇప్పటికే భవన యజమానులకు విన్నవించింది. ఇదే బాటలో వీ–మార్ట్ సైతం చేరింది. ప్రస్తుత క్లిష్ట సమయంలో అద్దె చెల్లించలేమని స్థల యజమానులకు సమాచారం ఇచ్చామని వీ–మార్ట్ సీఎండీ లలిత్ అగర్వాల్ వెల్లడించారు.
అద్దెకు బదులుగా ఆదాయంలో వాటా
Published Fri, Apr 17 2020 4:05 AM | Last Updated on Fri, Apr 17 2020 4:05 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment