Rental agreement
-
Model Tenancy Act: వారు 2 నెలల అద్దె ముందే చెల్లించాలి!
న్యూఢిల్లీ: యజమాని, కిరాయిదారుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా రూపొందిన చట్టం... ‘మోడల్ టెనన్సీ యాక్ట్’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు కీలక సంస్కరణలతో కూడిన ఈ నమూనా చట్టానికి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి భేటీలో గ్రీన్ సిగ్నల్ లభించింది. వివాదాల సత్వర పరిష్కారం కోసం జిల్లాల్లో ప్రత్యేక రెంట్ అథారిటీలు, రెంట్ కోర్టులు, రెంట్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని ఈ చట్టంలో స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు యథాతథంగా అమలు చేసుకోవచ్చు. లేదా ఇప్పటికే తమ వద్ద అమల్లో ఉన్న సంబంధిత చట్టాలకు అవసరమైన మార్పులు చేసి, అమలు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఆస్తులను అద్దెకు ఇవ్వడానికి సంబంధించిన న్యాయ ప్రక్రియలో ఈ కొత్త చట్టం ద్వారా సమూల మార్పులు వస్తాయని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి హరిదీప్‌సింగ్ పూరి తెలిపారు. ఈ చట్టం రెంటల్ హౌజింగ్‌ను ఒక వ్యాపార మోడల్‌గా నిర్వహించే అవకాశం కల్పిస్తుందని, తద్వారా దేశంలో రెంటల్ హౌజింగ్ మార్కెట్ అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని ఆదాయ వర్గాల వారికి అందుబాటులో, సమస్యలు లేని విధంగా అద్దె వసతి లభించేలా చట్టం రూపొందిందని వెల్లడించింది. 2011 జనగణన ప్రకారం దేశవ్యాప్తంగా, నగరాలు, పట్టణాల్లో దాదాపు కోటి గృçహాలు ఖాళీగా ఉన్నాయని హరిదీప్ సింగ్ పూరి వెల్లడించారు. కిరాయిదారులు ఖాళీ చేయరేమోనని, లేదా ఆక్రమించుకుంటారేమోనని, లేదా ఖాళీ చేయడానికి ఇబ్బంది పెడ్తారేమోనని భయంతో యజమానులు తమ ఆస్తులను అద్దెకు ఇవ్వడం లేదని గృహ నిర్మాణశాఖకు చెందిన ఒక అధికారి వివరించారు. ఈ తాజా చట్టంలో కిరాయిదారు, యజమానుల పాత్రను, హక్కులు, బాధ్యతలను స్పష్టంగా నిర్వచించినందున ఇకపై వారిలో ఈ భయాందోళనలు తొలగిపోతాయని భావిస్తున్నామన్నారు. ఈ చట్టం ప్రకారం.. ► నివాస సముదాయాల్లో కిరాయిదారు యజమానికి సెక్యూరిటీ డిపాజిట్‌గా గరిష్టంగా రెండు నెలల అద్దె ముందే చెల్లించాలి. అదే, వాణిజ్య సముదాయాలైతే ఆరునెలల అద్దెను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ► అన్ని కొత్త అద్దె ఒప్పందాలు ఇకపై కచ్చితంగా లిఖితపూర్వకంగా ఉండాలి. అలాగే, వాటిని సంబంధిత జిల్లా ‘రెంట్ అథారిటీ’కి సమర్పించాలి. ► ఇప్పటికే అమల్లో ఉన్న రెంటల్ అగ్రిమెంట్‌పై కొత్త చట్టం ప్రభావం ఉండదు. ► అద్దె, కాలవ్యవధులను పరస్పర అంగీకారంతో కిరాయిదారు, యజమాని నిర్ణయించుకోవాలి. లిఖిత పూర్వక ఒప్పందంలో ఆ విషయాన్ని పొందుపర్చాలి. ► యజమాని, లేదా ప్రాపర్టీ మేనేజర్ కిరాయిదారుల నివాసాలకు నిత్యావసర సదుపాయాలను నిలిపివేయకూడదు. ► అద్దె ఒప్పందం అమలులో ఉన్న సమయంలో కిరాయిదారును ఖాళీ చేయించకూడదు. ఒకవేళ ఒప్పందంలో సంబంధిత నిబంధన ఉంటే ఖాళీ చేయించవచ్చు. ► కిరాయిదారు నష్టపరిచినవి మినహా మిగతా నిర్మాణ మరమ్మతులు, రంగులు వేయించడం, పాడైన ప్లంబింగ్ పైప్‌ల మార్పు, విద్యుత్ వైరింగ్ తదితరాలను యజమానే చేయించాలి. ► డ్రైనేజ్ క్లీనింగ్, విద్యుత్ స్విచ్‌లు, సాకెట్ల మరమ్మతులు, కిచెన్‌లో అవసరమైన రిపేర్లు, మరమ్మతులు, ధ్వంసమైన కిటికీలు, ద్వారాల గ్లాస్ ప్యానెళ్ల మార్పు, గార్డెన్ నిర్వహణ.. మొదలైనవాటిని కిరాయిదారు చేయాల్సి ఉంటుంది. ► కిరాయిదారు ఆక్రమణలో ఉన్న చోట యజ మాని ఏదైనా అదనపు నిర్మాణం చేయాలనుకున్నప్పుడు, దాన్ని కిరాయిదారు వ్యతిరేకిస్తే.. యజమాని జిల్లా రెంట్ కోర్టును ఆశ్రయించాలి. ► యజమాని ముందస్తు అనుమతి లేకుండా, కిరాయిదారు తాను అద్దెకు ఉన్న ప్రాంగణంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదు. ► ప్రతీ జిల్లాలో రెంట్ ట్రిబ్యునల్‌గా జిల్లా జడ్జిని కానీ, జిల్లా అదనపు జడ్జీని కానీ హైకోర్టు సూ చనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించాలి. ► రెంట్ కోర్ట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ను కాని, తత్సమాన హోదా ఉన్న అధికారిని కానీ నియమించాలి. ► రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో డిప్యూటీ కలెక్టర్ హోదాకు తగ్గని అధికారిని ‘రెంట్ అథారిటీ’గా జిల్లా కలెక్టర్ నియమించాలి. ► యజమానికి, కిరాయిదారుకు మధ్య వివాదం తలెత్తినప్పుడు.. మొదట రెంట్ అథారిటీని ఆశ్రయించాలి. అక్కడి పరిష్కారంతో సంతృప్తి చెందనట్లయితే, తరువాత రెంట్ కోర్టును, ఆ తరువాత రెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలి. ► కిరాయిదారులను ఖాళీ చేయించే విషయంలో ఇబ్బంది పడే యజమానుల కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. అద్దె ఒప్పందంలో పేర్కొన్న మేరకు ముందస్తు నోటీసు ఇవ్వడం సహా అన్ని నిబంధనలను పాటిస్తూ ఖాళీ చేయాలని యజమాని కోరినప్పటికీ కిరాయిదారు ఖాళీ చేయనట్లయితే.. అలాగే, ఒప్పందం కాలపరిమితి ముగిసినప్పటికీ కిరాయిదారు ఖాళీ చేయనట్లయితే.. యజమాని నెలవారీ అద్దెను మొదట రెండు నెలల పాటు రెండింతలు, ఆ తరువాత ఖాళీ చేసేంతవరకు నాలుగు రెట్లు చేయవచ్చు. ► కిరాయిదారుకు చెల్లించాల్సిన రీఫండ్‌ను యజమాని సమయానికి ఇవ్వనట్లయితే.. సాధారణ వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. -
అద్దెకు బదులుగా ఆదాయంలో వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా ప్రభావం రిటైల్ రంగ ముఖ చిత్రాన్ని మార్చనుంది. ఇప్పటి వరకు భవన యజమాని, దుకాణదారు మధ్య అద్దె చెల్లించేలా ఒప్పందాలు ఉండేవి. రానున్న రోజుల్లో అద్దెకు బదులుగా ఆదాయంలో వాటా ఇచ్చేలా ఒప్పందాలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల దుకాణాలు మినహా మిగిలినవన్నీ మూతపడ్డ సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణలోకి వచ్చి మాల్స్, దుకాణాలు తెరుచుకున్నాక వ్యాపారం తిరిగి గాడిన పడేందుకు కొన్ని నెలల సమయం పట్టనుంది. వ్యాపారాలు అంతంతే నమోదు అవుతాయి కాబట్టి అద్దెలు చెల్లించే స్థాయి విక్రయదారులకు ఉండదని నిపుణులు అంటున్నారు. వ్యాపారాలు లేనందున భవన యజమానులకు మరో మార్గం లేదని, ఆదాయంలో వాటా తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. దుకాణదారులు కోలుకోవడానికి ఈ విధానం చక్కని పరిష్కారం అని వారు అభిప్రాయపడ్డారు. ఆ నిబంధన ప్రకారం.. ఫోర్స్ మెజోర్ నిబంధన ప్రకారం అద్దెలో వెసులుబాటును దుకాణదారులు కోరవచ్చు. మూతపడ్డ కాలానికి అద్దె చెల్లించలేమని చెప్పేందుకూ ఆస్కారం ఉంటుంది. సాధారణంగా మాల్స్‌లో దాదాపు 60 శాతం మేర స్థలాన్ని ప్రధాన బ్రాండ్ల యాంకర్ స్టోర్లతో నిండిపోయి ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా ఫోర్స్ మెజోర్ నిబంధనను వినియోగించుకుంటాయి. రిటైలర్ల ఆదాయంలో అద్దె ఖర్చు 12–16 శాతముంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంటోంది. మాల్ యజమానులు 45 శాతం అద్దె కోల్పోయే చాన్స్ ఉందని చెబుతోంది. ఒకవేళ రెండు నెలలకుపైగా దుకాణాలు మూసివేస్తే దాని ప్రభావంతో 62 శాతం అద్దె కోల్పోయే అవకాశం ఉందని వివరించింది. కస్టమర్ల రాక తక్కువగా ఉండడంతో దుకాణదారుల ఆర్థిక స్థితిపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని తెలిపింది. గతంలో రోజుకు ఎంతకాదన్నా దేశవ్యాప్తంగా ఉన్న మాల్స్‌లో రూ.500 కోట్ల వ్యాపారం నమోదయ్యేదని అంచనా. మొదలైన వినతులు.. అద్దెలు తగ్గించాల్సిందిగా రిటైలర్ల నుంచి వినతులు వస్తున్నాయని రియల్ ఎస్టేట్ సంస్థలు, మాల్ యజమానులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో రిటైలర్లు ఎదుర్కోబోయే సమస్యలు, సవాళ్లను రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే తెలియజేశాయి. అద్దె నుంచి మినహాయించాల్సిందిగా బిగ్‌బజార్, ఈజీడే క్లబ్ ఇప్పటికే భవన యజమానులకు విన్నవించింది. ఇదే బాటలో వీ–మార్ట్ సైతం చేరింది. ప్రస్తుత క్లిష్ట సమయంలో అద్దె చెల్లించలేమని స్థల యజమానులకు సమాచారం ఇచ్చామని వీ–మార్ట్ సీఎండీ లలిత్ అగర్వాల్ వెల్లడించారు. -
త్వరలో అద్దె చట్టం
న్యూఢిల్లీ: దేశంలో భవనాలు, స్థలాలను అద్దెకు ఇవ్వడానికి సంబంధించి పలు నిబంధనలను రూపొందిస్తూ ‘అద్దె చట్టం’ తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లుపై ఆగస్టు 1లోపు ప్రజలు తమ అభిప్రాయాలను తెలపవచ్చు. స్థల/భవన యజమానులతోపాటు అద్దెకు ఉండేవారు నష్టపోకుండా ఉండటం కోసం కేంద్రం పలు నిబంధనలను ఈ బిల్లులో ప్రతిపాదించింది. బిల్లులోని కొన్ని ప్రతిపాదనలు.. ► అద్దె పెంచాలంటే 3నెలల ముందే ఆ విషయాన్ని కిరాయిదారుకు యజమాని రాతపూర్వకంగా తెలియజెప్పాలి. ► అద్దెకు భవనం/స్థలం తీసుకున్నవారు ముందుగా ఒప్పందం చేసుకున్న కాలం కంటే ఎక్కువ రోజులు అక్కడ ఉంటూ, సమయానికి ఖాళీ చేయకపోతే 2–4 రెట్లు అధిక అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ► అడ్వాన్స్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ కింద యజమానులు వసూలు చేసే డబ్బు రెండు నెలల అద్దె కంటే ఎక్కువ ఉండకూడదు. ► ఇంట్లో ఏదైనా రిపేర్లు చేయించాల్సి వచ్చి, ఆ విషయాన్ని యజమాని పట్టించుకోకపోతే అద్దెకు ఉంటున్నవారు ఆ రిపేర్లు చేయించి, అందుకు అయిన వ్యయాన్ని అద్దెలో మినహాయించుకోవచ్చు. ఆ రిపేర్లు అద్దెకు ఉంటున్న వారే చేయించాల్సినవి అయినప్పటికీ వారు పట్టించుకోకపోతే, యజమాని ఆ పనిని చేపించి, అందుకు అయిన వ్యయాన్ని అడ్వాన్సు/సెక్యూరిటీ డిపాజిట్ నుంచి మినహాయించుకోవచ్చు. ► యజమానులు, కిరాయిదారుల ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా అద్దె వ్యవహారాల విభాగం ఏర్పాటు ► అద్దె ఒప్పందం కుదుర్చుకున్న రెండు నెలల్లోపు యజయాని, అద్దెకు వచ్చిన వారు.. ఇద్దరూ వెళ్లి అద్దె ఒప్పంద పత్రాన్ని జిల్లా అద్దె వ్యవహారాల విభాగానికి సమర్పించాలి. ఈ విభాగానికి అద్దెను నిర్ణయించడం, సవరించడం వంటి అధికారాలు కూడా ఉంటాయి. ఢిల్లీలో నకిలీ దరఖాస్తులపై ఎఫ్ఐఆర్ ప్రధాన మంత్రి (పట్టణ) ఇళ్ల పథకం కోసమంటూ నకిలీ దరఖాస్తులను వ్యాప్తి చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదైంది. ఇళ్ల నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు పెట్టారు. -
అద్దెలపై బల్దియా దృష్టి
సాక్షి, కరీంనగర్‌కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఏళ్ల తరబడిగా ఖాళీగానే ఉంటున్న షట్లర్లను అద్దెలకు ఇచ్చేందుకు బల్దియా నడుం బిగించింది. ఆదాయ వనరులను పెంచుకునేందుకు ఉన్న వనరులను ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో ఉన్న రాజీవ్‌గాంధీ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఖాళీగా ఉన్న షట్టర్లను అద్దెలకు ఇచ్చేందుకు వేలం పాటకు సిద్ధపడుతున్నారు. వీటికి తోడు రెండేళ్ల క్రితం ఐడీఎస్ఎంటీ నిధులతో నిర్మించిన నూతన షాపింగ్ కాంప్లెక్స్‌లో కూడా షట్టర్లను అద్దెలకు ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. అద్దెల ద్వారా రూ.లక్షల్లో ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇన్నాళ్లు వేలం పాటలో ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆదాయం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో ఒకటి రెండు సార్లు దుకాణాలకు వేలం పాట వేస్తున్నామని హడావిడి చేసినప్పటికీ వేలం వేయకుండానే చేతులు దులుపుకున్నారు. మున్సిపల్ ఆవరణలో ఉన్న షాపింగ్‌కాంప్లెక్స్‌లో దాదాపు నాలుగేళ్లుగా పైఅంతస్తులో 14 గదులు ఖాళీగా ఉంటున్నాయంటే అధికారులు ఏమేరకు శ్రద్ధ వహిస్తున్నారో అర్థమవుతోంది. మున్సిపల్ పాత గెస్ట్‌హౌస్ స్థలంలో ఐడీఎస్‌ఎమ్‌టీ నిధులు రూ.3.5కోట్లతో 42 షెట్టర్లను నిర్మించారు. అద్దెలకు ఇస్తే వాటిపై కూడా ఆదాయం వస్తుంది. ఇప్పటికే కాంప్లెక్స్ సెల్లార్లో పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు. గతంలో వేలం నిర్వహించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఎవరూ అద్దెలకు రాలేదు. అయితే ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా ఎలాగైనా అద్దెలకు ఇవ్వాలని అధికారులు పట్టుదలతో ఉన్నారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు నగరపాలక సంస్థ ఆవరణలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న దుకాణాలను కొంత మంది అద్దెలకు తీసుకుని ఇతరులకు ఎక్కువ కిరాయికి ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి వారిని గుర్తించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇలాంటి వారిపై ఉదాసీనంగా వ్యవహరించకుండా కఠినంగా ఉండి, అద్దె అగ్రిమెంట్ గడువు ముగియడంతోనే వారిని ఖాళీ చేయించేందుకు నోటీసులు సిద్ధం చేస్తున్నారు. అద్దెలకు తీసుకున్న వారు తప్ప ఇతరులు ఎవరైనా ఆ దుకాణాల్లో వ్యాపారం నిర్వహిస్తే మున్సిపల్ నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అద్దెలపై దృష్టి సారించాం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఖాళీగా ఉన్న షెట్టర్లతోపాటు ఐడీఎస్‌ఎమ్‌టీ నిధులతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌లోనూ షెట్లర్లు అద్దెకు ఇచ్చేందుకు దృష్టిసారించాం. ప్రస్తుతం అద్దెలకు తీసుకున్న షెట్టర్లలో ఇతరులు వ్యాపారం చేస్తే ఖాళీ చేయిస్తాం. అదనపు అద్దెల కోసం అక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి గడువు ముగిశాక ఇతరులకు ఇవ్వడం జరుగుతుంది. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు చేపడతాం. – సత్యనారాయణ, కమిషనర్ -
పాస్‌పోర్టు మరింత ఈజీ
చిరునామా ధ్రువపత్రంగా ఇకపై రెంటల్ అగ్రిమెంట్ ఇవ్వొచ్చు గెజిటెడ్ అధికారుల అటెస్టేషన్ అక్కర్లేదు పాస్‌పోర్టుల జారీలో విదేశాంగ శాఖ కొత్త నిర్ణయాలు హైదరాబాద్, విశాఖపట్నం కార్యాలయాలకు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ఉపాధి కోసం లేదా ఉద్యోగ నిర్వహణ కోసం కొత్తగా పట్టణాలకు వచ్చిన వారిలో చాలామందికి చిరునామాకు సంబంధించిన ధ్రువపత్రాలు ఉండవు. అలాంటి వారు పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకోవాలంటే ఇప్పటివరకూ చాలా ఇబ్బంది పడేవారు. కానీ పాస్‌పోర్ట్ సేవల సరళతరంలో భాగంగా రెంటల్ అగ్రిమెంట్ (అద్దె ఒప్పంద) పత్రాలను కూడా చిరునామా ధ్రువపత్రాలుగా స్వీకరించాలని విదేశాంగ శాఖ తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు అన్ని పాస్‌పోర్ట్ కార్యాలయాలకు సమాచారమిచ్చినట్టు హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. కనీసం ఏడాది నుంచి అద్దెకుండాలి ప్రస్తుతం ఓటర్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ల్యాండ్‌లైన్ టెలిఫోన్ బిల్లు, ఫొటోతో కూడిన బ్యాంక్ స్టేట్మెంట్ (నివేదిక) తదితరాలను చిరునామా ధ్రువపత్రాలుగా స్వీకరిస్తున్నారు. వాటి సరసన ఇకపై రెంటల్ అగ్రిమెంట్నూ స్వీకరిస్తారు. ఏ ఇంట్లో అయితే అద్దెకుంటున్నారో అక్కడ కనీసం ఏడాది నుంచి ఉన్నట్టు ఆ ఇంటి యజమానితో ‘1908 రిజిస్ట్రేషన్ యాక్ట్’ సెక్షన్ 17 ప్రకారం రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవాలి. పాస్‌పోర్ట్ దరఖాస్తు సమయంలో ఈ ధృవపత్రాన్ని చిరునామా నకలుగా పరిగణిస్తారు. తత్కాల్ దరఖాస్తు చేసుకున్న వారికి కూడా రెంటల్ అగ్రిమెంట్ చిరునామా నకలుగా పనిచేస్తుంది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని పాస్‌పోర్ట్ వర్గాలు పేర్కొన్నాయి. గెజిటెడ్ అటెస్టేషన్లకు చెల్లుచీటీ ఇకపై ధ్రువపత్రాల నకలు(జిరాక్స్) కాపీలపై గెజిటెడ్ అధికారుల ధ్రువీకరణ(అటెస్టేషన్) అవసరం లేదని విదేశాంగ శాఖ నిర్ణయించింది. వీటిలో కొన్ని ముఖ్యమైనవి పరిశీలిస్తే... - బర్త్ సర్టిఫికెట్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్లు తదితర జిరాక్స్‌లపై గెజిటెడ్ అధికారి అటెస్టేషన్ చేసేవారు. ఇప్పుడు ఆ అవసరం ఉండదు. సెల్ఫ్ అటెస్టేషన్(అభ్యర్థి సంతకం) చేస్తే సరిపోతుంది. వివాహ ధ్రువపత్రంపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్(పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థి) సంతకం చాలు పాస్‌పోర్ట్ దరఖాస్తుకు పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లినప్పుడు పాస్‌పోర్ట్ అధికారుల పరిశీలనకు అన్ని ఒరిజనల్ ధ్రువపత్రాలు తీసుకెళ్లాలి. కానీ పాస్‌పోర్ట్ కార్యాలయానికి కేవలం సెల్ఫ్ అటెస్టేషన్ కాపీలు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ పదవీ విరమణ పొందినా, లేదా పదవికి రాజీనామా చేసినా దీనికి సంబంధించి పెన్షన్ చెల్లింపుల ధ్రువపత్రాలుగానీ, పదవీ విరమణ చేసినట్టు ప్రభుత్వాధికారి ధ్రువీకరించిన పత్రాలుగానీ సమర్పిస్తే సరిపోతుంది. గతంలో ఉన్నట్టుగానే ఏ, సీ, డీ, ఈ, జీ, ఐ, కే, ఎల్ అఫిడవిట్లు కేవలం న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఇస్తున్నారు. ఇకపై కూడా ఏ నుంచి ఎం వరకూ అన్ని అఫిడవిట్(అనెక్సెర్)లూ స్వీకరించాలని ఎంఈఏ (మినిస్ట్రీ ఆఫ్ ఎక్ట్టర్నల్ ఎఫైర్స్) ఆదేశాలు ఇచ్చింది.