ఇటీవల సెకండరీ మార్కెట్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. పెట్టుబడుల ప్రోత్సాహంతో ప్రైమరీ మార్కెట్ సైతం కళకళలాడుతోంది. ఈ ప్రభావంతో కొత్త ఏడాది (2024)లోనూ పలు కంపెనీలు నిధుల సమీకరణకు క్యూ కట్టనున్నట్లు స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పబ్లిక్ ఇష్యూల వెల్లువ కొనసాగనున్నట్లు అంచనా వేశారు.
న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది (2023)లో ఇప్పటివరకూ పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 52,000 కోట్లు సమకూర్చుకున్నాయి. ప్రధాన ఎక్సే్చంజీలైన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టింగ్ ద్వారా దేశీ కార్పొరేట్లు సమీకరించిన నిధులివి. నిజానికి ఓవైపు వడ్డీ రేట్లు, మరోపక్క భౌగోళిక, రాజకీయ రిసు్కలు పెరిగినప్పటికీ.. ఐపీవోలు దూకుడు చూపుతున్నాయి. పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ కోసం వెల్లువలా సెబీ తలుపు తడుతున్నాయి.
దీంతో వచ్చే ఏడాదిలోనూ ప్రైమరీ మార్కెట్ బుల్లిష్ ధోరణిలోనే కొనసాగనున్నట్లు పలువురు స్టాక్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతేడాది (2022)లో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీని మినహాయిస్తే పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 20,557 కోట్లు సమీకరించాయి. అంటే దీంతో పోలిస్తే ఈ ఏడాది 36 శాతం అధికంగా పెట్టుబడులు అందుకున్నాయి. ప్రధానంగా మధ్య, చిన్న తరహా కంపెనీలు హవా చూపాయి. మార్కెట్ సెంటిమెంటు బలంగా ఉండటం ఇందుకు దోహదపడుతోంది. అయితే ప్రపంచ సవాళ్ల నేపథ్యంలో ఏడాది మొదట్లో మార్కెట్లు డీలా పడిన సంగతి తెలిసిందే.
కారణాలున్నాయ్..
ప్రైమరీ మార్కెట్లు జోరందుకోవడానికి లిస్టింగ్ లాభాలు, అందుబాటు ధరల్లో డీల్స్ కారణమవుతున్నట్లు పంటోమత్ క్యాపిటల్ అడ్వయిజర్స్ ఎండీ మహావీర్ లూనావత్ పేర్కొన్నారు. ఆయా రంగాల్లోని లిస్టెడ్ కంపెనీలు అధిక విలువల్లో ట్రేడవుతుండటం ఇందుకు జత కలసినట్లు అభిప్రాయపడ్డారు. పటిష్ట నియంత్రణా వ్యవస్థలు సైతం ఇందుకు అండగా నిలుస్తున్నట్లు తెలియజేశారు.
2023లో కనిపిస్తున్న ప్రోత్సాహకర పరిస్థితులు 2024లోనూ కొనసాగనున్నట్లు ఆనంద్ రాఠీ అడ్వయిజర్స్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ ఈసీఎం వి.ప్రశాంత్ రావు అంచనా వేశారు. ఇది బంగారు కాలంగా నిలిచే వీలున్నట్లు పేర్కొన్నారు. తరలివస్తున్న దేశ, విదేశీ పెట్టుబడులు, దేశీ మార్కెట్ల వృద్ధికిగల భారీ అవకాశాల కారణంగా వచ్చే ఏడాదిలోనూ ఐపీవో మార్కెట్ మరింత జోరు చూపనున్నట్లు జేఎం ఫైనాన్షియల్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ నేహా అగర్వాల్ అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల పూర్తి తదితర అనిశి్చతులు తొలగితే మరిన్ని పెట్టుబడులు తరలివస్తాయని పేర్కొన్నారు.
మరో రూ. 26,000 కోట్లు
నిధుల సమీకరణకు ఇప్పటికే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి 24 కంపెనీలు అనుమతులు పొందాయి. ఇవి ఐపీవోలు చేపట్టడం ద్వారా రూ. 26,000 కోట్లు సమీకరించేందుకు వీలుంది. ఈ బాటలో మరో 32 కంపెనీలు లిస్టింగ్‌కు వీలుగా సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. వీటి నిధుల సమీకరణ అంచనా రూ. 35,000 కోట్లుగా ప్రైమ్ డేటాబేస్ పేర్కొంది.
పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం 2023లో ఐపీవోల ద్వారా 58 కంపెనీలు రూ. 52,637 కోట్లు సమకూర్చుకున్నాయి. వీటిలో రూ. 3,200 కోట్లు అందుకున్న నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రీట్ ఉంది. గతేడాది ఎల్‌ఐసీ (రూ. 20,557 కోట్లు) సహా.. 40 కంపెనీలు ఉమ్మడిగా రూ. 59,302 కోట్లు సమీకరించాయి. అయితే అంతకుముందు 2021లో 63 కంపెనీలు ప్రైమరీ మార్కెట్ ద్వారా ఏకంగా రూ. 1.2 లక్షల కోట్లను అందుకున్నాయి. వెరసి రెండు దశాబ్దాలలోనే అత్యధిక నిధుల సమీకరణగా 2021 నిలిచింది! అధిక లిక్విడిటీ, ఇన్వెస్టర్ల ఆసక్తి, మార్కెట్ల జోరు నేపథ్యంలో గత మూడేళ్లలో 150 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment