Investment scheme
-
ఐపీవోలకు కంపెనీల క్యూ..
ఇటీవల సెకండరీ మార్కెట్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. పెట్టుబడుల ప్రోత్సాహంతో ప్రైమరీ మార్కెట్ సైతం కళకళలాడుతోంది. ఈ ప్రభావంతో కొత్త ఏడాది (2024)లోనూ పలు కంపెనీలు నిధుల సమీకరణకు క్యూ కట్టనున్నట్లు స్టాక్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పబ్లిక్ ఇష్యూల వెల్లువ కొనసాగనున్నట్లు అంచనా వేశారు. న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది (2023)లో ఇప్పటివరకూ పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 52,000 కోట్లు సమకూర్చుకున్నాయి. ప్రధాన ఎక్సే్చంజీలైన బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టింగ్ ద్వారా దేశీ కార్పొరేట్లు సమీకరించిన నిధులివి. నిజానికి ఓవైపు వడ్డీ రేట్లు, మరోపక్క భౌగోళిక, రాజకీయ రిసు్కలు పెరిగినప్పటికీ.. ఐపీవోలు దూకుడు చూపుతున్నాయి. పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ కోసం వెల్లువలా సెబీ తలుపు తడుతున్నాయి. దీంతో వచ్చే ఏడాదిలోనూ ప్రైమరీ మార్కెట్ బుల్లిష్ ధోరణిలోనే కొనసాగనున్నట్లు పలువురు స్టాక్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతేడాది (2022)లో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీని మినహాయిస్తే పబ్లిక్ ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 20,557 కోట్లు సమీకరించాయి. అంటే దీంతో పోలిస్తే ఈ ఏడాది 36 శాతం అధికంగా పెట్టుబడులు అందుకున్నాయి. ప్రధానంగా మధ్య, చిన్న తరహా కంపెనీలు హవా చూపాయి. మార్కెట్ సెంటిమెంటు బలంగా ఉండటం ఇందుకు దోహదపడుతోంది. అయితే ప్రపంచ సవాళ్ల నేపథ్యంలో ఏడాది మొదట్లో మార్కెట్లు డీలా పడిన సంగతి తెలిసిందే. కారణాలున్నాయ్.. ప్రైమరీ మార్కెట్లు జోరందుకోవడానికి లిస్టింగ్ లాభాలు, అందుబాటు ధరల్లో డీల్స్ కారణమవుతున్నట్లు పంటోమత్ క్యాపిటల్ అడ్వయిజర్స్ ఎండీ మహావీర్ లూనావత్ పేర్కొన్నారు. ఆయా రంగాల్లోని లిస్టెడ్ కంపెనీలు అధిక విలువల్లో ట్రేడవుతుండటం ఇందుకు జత కలసినట్లు అభిప్రాయపడ్డారు. పటిష్ట నియంత్రణా వ్యవస్థలు సైతం ఇందుకు అండగా నిలుస్తున్నట్లు తెలియజేశారు. 2023లో కనిపిస్తున్న ప్రోత్సాహకర పరిస్థితులు 2024లోనూ కొనసాగనున్నట్లు ఆనంద్ రాఠీ అడ్వయిజర్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఈసీఎం వి.ప్రశాంత్ రావు అంచనా వేశారు. ఇది బంగారు కాలంగా నిలిచే వీలున్నట్లు పేర్కొన్నారు. తరలివస్తున్న దేశ, విదేశీ పెట్టుబడులు, దేశీ మార్కెట్ల వృద్ధికిగల భారీ అవకాశాల కారణంగా వచ్చే ఏడాదిలోనూ ఐపీవో మార్కెట్ మరింత జోరు చూపనున్నట్లు జేఎం ఫైనాన్షియల్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ నేహా అగర్వాల్ అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల పూర్తి తదితర అనిశి్చతులు తొలగితే మరిన్ని పెట్టుబడులు తరలివస్తాయని పేర్కొన్నారు. మరో రూ. 26,000 కోట్లు నిధుల సమీకరణకు ఇప్పటికే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి 24 కంపెనీలు అనుమతులు పొందాయి. ఇవి ఐపీవోలు చేపట్టడం ద్వారా రూ. 26,000 కోట్లు సమీకరించేందుకు వీలుంది. ఈ బాటలో మరో 32 కంపెనీలు లిస్టింగ్‌కు వీలుగా సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. వీటి నిధుల సమీకరణ అంచనా రూ. 35,000 కోట్లుగా ప్రైమ్ డేటాబేస్ పేర్కొంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం 2023లో ఐపీవోల ద్వారా 58 కంపెనీలు రూ. 52,637 కోట్లు సమకూర్చుకున్నాయి. వీటిలో రూ. 3,200 కోట్లు అందుకున్న నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రీట్ ఉంది. గతేడాది ఎల్ఐసీ (రూ. 20,557 కోట్లు) సహా.. 40 కంపెనీలు ఉమ్మడిగా రూ. 59,302 కోట్లు సమీకరించాయి. అయితే అంతకుముందు 2021లో 63 కంపెనీలు ప్రైమరీ మార్కెట్ ద్వారా ఏకంగా రూ. 1.2 లక్షల కోట్లను అందుకున్నాయి. వెరసి రెండు దశాబ్దాలలోనే అత్యధిక నిధుల సమీకరణగా 2021 నిలిచింది! అధిక లిక్విడిటీ, ఇన్వెస్టర్ల ఆసక్తి, మార్కెట్ల జోరు నేపథ్యంలో గత మూడేళ్లలో 150 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. -
నాకు ప్రతి నెలా ఇన్కమ్ కావాలి.. ఎక్కడ పెట్టుబడులు పెడితే బాగుంటుంది?
నా వయసు 62 ఏళ్లు. స్థిరమైన ఆదాయం కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. అందుబాటులో ఉన్న మార్గాలు ఏవి? – నారాయణ్ విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలంటే అందుకు తగినంత నిధిని సమకూర్చుకుని ఉండాలి. ఈ నిధి నుంచి క్రమం తప్పకుండా ఆదాయం పొందడం ద్వారా సౌకర్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. సీనియర్ సిటిజన్లు సహజంగా సంప్రదాయ మార్గాలనే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అత్యవసరాల్లో కావాల్సినప్పుడు వెంటనే పొందే లిక్విడిటీ కూడా ఉండాలని కోరుకుంటారు. ఇన్వెస్ట్ చేయడానికి ముందు ప్రతీ నెలా ఎంత మొత్తం కావాలో నిర్ణయించుకోవాలి. ఇతర మార్గాల ద్వారా ఏదైనా ఆదాయం వస్తుంటే దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అద్దె రూపంలో ఆదాయం, పెన్షన్ లేదా మరొకటి కావచ్చు. ఏటా ఎంత మొత్తం పెట్టుబడి నుంచి కావాలో స్పష్టతకు రావాలి. ఒకవేళ ఏటా 4–6 శాతానికంటే ఎక్కువ కోరుకుంటుంటే అంచనాలను తగ్గించుకోవాల్సిందే. ఉదాహరణకు మీ పెట్టుబడి నిధి రూ.కోటి ఉందనుకుంటే వార్షికంగా ఉపసంహరించుకునే మొత్తం రూ.6 లక్షలకు మించి ఉండకూడదు. ఒకవేళ 6 శాతానికి మించి వెనక్కి తీసుకుంటే కనుక ఆ తర్వాతి సంవత్సరాల్లో తక్కువ ఆదాయానికి సిద్ధం కావాల్సిందే. ద్రవ్యోల్బణాన్ని విస్మరించడానికి లేదు. నేడు నెలవారీ ఖర్చులకు రూ.50,000 సరిపోతుంటే.. 5, 10, 15 ఏళ్ల తర్వాత ఈ మొత్తం చాలదు. ఆ సమయంలో ఇంకాస్త అధికంగా కావాల్సి ఉంటుంది. అందుకనే రిటైర్మెంట్ తీసుకున్న వారు ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రాబడులను ఇచ్చే మార్గాలను చూసుకోవాలి. అందుకని రిటైర్మెంట్ తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించాలి. అప్పుడే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం మించి రాబడులకు అవకాశం ఉంటుంది. పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. 30–40 శాతం చాలు. మిగతా మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లోనే ఉంచాలి. ప్రభుత్వ హామీతో కూడిన పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక ఇన్వెస్టర్ ఈ పథకాలు అన్నింటిలోనూ కలిపి రూ.24.5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని అధిక నాణ్యతతో కూడి డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా 30–40 శాతం మేర ఉండేలా ఏడాదికోసారి పెట్టుబడులను మార్పులు (అస్సెట్ రీబ్యాలన్స్) చేసుకోవాలి. ఆర్థిక ప్రణాళికను రూపొందించుకునే విషయంలో ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి? – రేవతి మీ అవసరాలకు అనుగుణమైన ప్రణాళికను రూపొందించుకోవడమే ప్రాథమిక కర్తవ్యంగా ఉండాలి. చేతిలో అవసరాలకు కొంత నగదు, అత్యవసర నిధి ఏర్పాటు, జీవిత బీమా, ఆరోగ్య బీమా కు చోటు ఇవ్వాలి. ఆ తర్వాత మీ ఆకాంక్షల విష యానికి రావాలి. మీ పొదుపు, పెట్టుబడులకు స్థాయికి తగ్గట్టు వీటిని మార్చుకోవచ్చు. ఆర్థిక ప్రణాళిక రూపొందించుకునేందుకు కచ్చితమైన సూచనలు అంటూ ఉండవు. ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కో రకంగా ఉంటుంది. ఎవరికి వారు తమ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేసుకోవాలి. -
‘పెట్టుబడి’ చెక్కులపై సీఎం ఫొటో..
సాక్షి, హైదరాబాద్ : పెట్టుబడి పథకం కింద రైతులకు అందజేసే చెక్కులపై ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మను ముద్రించే సాధ్యాసాధ్యాలను వ్యవసాయశాఖ వర్గాలు పరిశీలిస్తున్నాయి. ఎకరాకు రూ.4 వేల చొప్పున లక్షలాది మంది రైతులకు వేల కోట్ల రూపాయలు అందజేసే కార్యక్రమం కావడంతో చెక్కులపై సీఎం బొమ్మ ఉంటే బాగుంటుందని ప్రతిపాదిస్తున్నారు. ఈ మేరకు బ్యాంకు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే బ్యాంకు వర్గాలు దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ‘‘రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం చెక్కులపై ఫొటోలను ముద్రించే పరిస్థితి అయితే లేదు. ఇతర రాష్ట్రాల్లో గతంలో అలా ముద్రించారా లేదా తెలుసుకుంటాం. ప్రభుత్వమే ఆర్డరిచ్చి చెక్కులను ముద్రిస్తుండటం.. భారీ సంక్షేమ కార్యక్రమం కావడంతో ప్రత్యేక అనుమతితో సీఎం ఫొటో ముద్రించే అంశాన్ని పరిశీలిస్తాం’’అని కొందరు బ్యాంకు అధికారులు పేర్కొన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే చెక్కును గులాబీ రంగులో ముద్రించడానికి ఇబ్బందేమీ ఉండదని బ్యాంకు వర్గాలు పేర్కొన్నట్టు అధికారులు చెబుతున్నారు. త్వరలో ఈ రెండు అంశాలపై స్పష్టత రానుంది. రైతులకు గ్రామసభల్లో చెక్కులను పంపిణీ చేసే సమయంలో సీఎం బొమ్మ ఉంటేనే పథకానికి విస్త్రృత ప్రచారం వస్తుందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. వచ్చేనెలలో ప్రింటింగ్ షురూ! రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్ కోసం మే 15 నాటికే రైతులకు పెట్టుబడి పథకం కింద చెక్కులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంటే మే ఒకటో తేదీ నుంచే గ్రామసభల్లో చెక్కుల పంపిణీ జరగనుంది. ప్రస్తుత అంచనా ప్రకారం 1.62 కోట్ల ఎకరాలకు చెందిన 70 లక్షలకు పైగా ఉన్న రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు. అయితే సాగుకు యోగ్యం కాని భూముల వివరాలు గుర్తించిన తర్వాత రెవెన్యూ శాఖ నుంచి కచ్చితమైన లెక్కలు వచ్చాకే చెక్కుల ముద్రణ జరగనుంది. చెక్కులను ముద్రించే బాధ్యత ఎస్బీఐకి అప్పగించారు. ఎస్బీఐ పేరుతోనే చెక్కులు వస్తాయి. 70 లక్షల వరకు చెక్కులు ముద్రిస్తున్నందున దానికి ఫీజు వసూలు చేయాలని బ్యాంకు వర్గాలు భావిస్తుండగా.. ఉచితంగానే అందజేయాలని ప్రభుత్వం కోరుతోంది. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఫొటో పెట్టాలంటే ప్రత్యేకంగా ఖర్చు అవుతుందన్న చర్చ జరుగుతోంది. చెక్కుల ముద్రణకు కనీసంగా 40 రోజుల సమయం అవసరమని అంచనా వేస్తున్నారు. ఎస్బీఐ ఆధ్వర్యంలోని ప్రింటింగ్ ప్రెస్ రోజుకు 2 లక్షల చెక్కులను మాత్రమే ముద్రిస్తుంది. రైతు పేరు, ఊరుతో సహా చెక్కులు ముద్రితమై బయటకు వస్తాయి. ఆ తర్వాత వాటిని జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా బంచ్లుగా తయారు చేస్తారు. అందుకు ప్రత్యేకంగా వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) క్లస్టర్ వారీగా కోడ్లు ముద్రిస్తారని తెలుస్తోంది. ఎస్బీఐ ప్రింటింగ్ మొదలు కావాలంటే ముందుగా రైతుల వివరాలు, సాగు వివరాలతో సమగ్ర సమాచారం వ్యవసాయ శాఖకు అందాలి. ఆ జాబితా ఆధారంగానే ఎస్బీఐ ప్రింటింగ్ ప్రారంభిస్తుంది. ఈ నెల 15కల్లా రెవెన్యూ శాఖ నుంచి జాబితా రావొచ్చు. ఆ జాబితా ఆధారంగా వ్యవసాయశాఖ సాగుకు యోగ్యంకాని భూమిని గుర్తించే ప్రక్రియ ప్రారంభిస్తుంది. మొత్తంగా ఈ నెలాఖరు నాటికే కచ్చితమైన తుది జాబితా ఎస్బీఐకి అందే అవకాశముంది. అంటే చెక్కుల ముద్రణ మార్చిలో మొదలై ఏప్రిల్ రెండో వారానికి పూర్తికావొచ్చని భావిస్తున్నారు. -
50 వేల కోట్ల వసూళ్లపై సెబీ కన్నెర్ర
న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ పథకాల ద్వారా భారీ స్థాయిలో నిధులు సమీకరిస్తున్నదన్న ఆరోపణలతో పీఏసీఎల్ లిమిటెడ్ (పెరల్స్ ఆగ్రోటెక్ కార్పొరేషన్)పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మూసివేత బాణాన్ని సంధించింది. అనధికారికంగా కంపెనీ నిర్వహిస్తున్న పథకాలన్నింటినీ వెంటనే మూసేయాల్సిందిగా సెబీ ఆదేశించింది. న్యూఢిల్లీలో కార్పొరేట్ కార్యాలయం, జైపూర్‌లో రిజిష్టర్డ్ కార్యాలయం కలిగిన పీఏసీఎల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఆ కంపెనీ వెబ్సైట్ సమాచారం. రిటైల్, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణం, వ్యవసాయ భూముల్ని అమ్మడం, కొనడం వంటి కార్యాకలాపాలు కూడా నిర్వహిస్తోంది. వివిధ కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పథకాల ద్వారా పీఏసీఎల్ దాదాపు రూ. 50,000 కోట్లను సమీకరించిందన్న అంచనాల నేపథ్యంలో సెబీ తాజా చర్యలు తీసుకుంది. సమీకరించిన నిధులను మూడు నెలల్లోగా ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించమంటూ పీఏసీఎల్‌కు సెబీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కంపెనీతోపాటు, తొమ్మిదిమంది ప్రమోటర్లు, డెరైక్టర్లపై తదుపరి చర్యలను చేపట్టనున్నట్లు సెబీ తెలిపింది. అంతకంటే ఎక్కువే... తమ దర్యాప్తు ఆధారంగా మొత్తం 5.85 కోట్లమంది ఇన్వెస్టర్ల నుంచి మొత్తం రూ. 49,100 కోట్లను పీఏసీఎల్ సమీకరించినట్లు సెబీ పేర్కొంది. అయితే 2012 ఏప్రిల్ 1 నుంచి 2013 ఫిబ్రవరి 25 వరకూ సమీకరించిన నిధుల వివరాలు వెల్లడిస్తే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశమున్నదని తెలిపింది. అనధికార కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ పథకాలకు సంబంధించి ఇది అత్యంత భారీ మొత్తమే కాకుండా ఇన్వెస్టర్ల సంఖ్య సైతం ఎక్కువేనని వ్యాఖ్యానించింది. అత్యంత దీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న కేసుగానూ దీనిని సెబీ పేర్కొంది. నిర్మల్ సింగ్ భంగూ, తర్లోచన్ సింగ్, సుఖ్‌దేవ్ సింగ్, గుర్మీత్ సింగ్, సుబ్రతా భట్టాచార్యసహా కంపెనీకి చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లపై సీబీఐ కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కంపెనీపై సెబీ 1998 ఫిబ్రవరిలో తొలిసారిగా నిషేధాజ్ఞలు జారీ చేసింది. 2014 మార్చి 31కల్లా 4.63 కోట్లమంది కస్టమర్లకు మొత్తం రూ. 29,421 కోట్లు చెల్లించాల్సి ఉన్నదని, అయితే రూ. 11,707 కోట్ల విలువైన భూమి మాత్రమే పీఏసీఎల్ చేతిలో ఉన్నదని సెబీ వెల్లడించింది. మరోవైపు 1.22 కోట్ల కస్టమర్లకు భూమిని కేటాయించినప్పటికీ, సేల్ డీడ్స్‌ను అందించలేదని వివరించింది. శాట్‌కు వెళతాం: పీఏసీఎల్ సెబీ ఆదేశాలపై సెక్యూరిటీస్ అపిల్లేట్ ట్రి బ్యునల్(శాట్)ను ఆశ్రయించనున్నట్లు పీఏసీఎల్ లిమిటెడ్ తెలిపింది. తాము సమర్పించిన వివరాలను సెబీ గుర్తించలేదని, తమ పథకాలను కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ కింద పరిగణించిందని పేర్కొంది. ఈ అంశంపై శాట్‌లో అపీల్ చేయనున్నట్లు తెలిపింది.