50 వేల కోట్ల వసూళ్లపై సెబీ కన్నెర్ర
న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ పథకాల ద్వారా భారీ స్థాయిలో నిధులు సమీకరిస్తున్నదన్న ఆరోపణలతో పీఏసీఎల్ లిమిటెడ్ (పెరల్స్ ఆగ్రోటెక్ కార్పొరేషన్)పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మూసివేత బాణాన్ని సంధించింది. అనధికారికంగా కంపెనీ నిర్వహిస్తున్న పథకాలన్నింటినీ వెంటనే మూసేయాల్సిందిగా సెబీ ఆదేశించింది.
న్యూఢిల్లీలో కార్పొరేట్ కార్యాలయం, జైపూర్‌లో రిజిష్టర్డ్ కార్యాలయం కలిగిన పీఏసీఎల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఆ కంపెనీ వెబ్‌సైట్ సమాచారం. రిటైల్, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణం, వ్యవసాయ భూముల్ని అమ్మడం, కొనడం వంటి కార్యాకలాపాలు కూడా నిర్వహిస్తోంది. వివిధ కలెక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ పథకాల ద్వారా పీఏసీఎల్ దాదాపు రూ. 50,000 కోట్లను సమీకరించిందన్న అంచనాల నేపథ్యంలో సెబీ తాజా చర్యలు తీసుకుంది. సమీకరించిన నిధులను మూడు నెలల్లోగా ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించమంటూ పీఏసీఎల్‌కు సెబీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కంపెనీతోపాటు, తొమ్మిదిమంది ప్రమోటర్లు, డెరైక్టర్లపై తదుపరి చర్యలను చేపట్టనున్నట్లు సెబీ తెలిపింది.
అంతకంటే ఎక్కువే...
తమ దర్యాప్తు ఆధారంగా మొత్తం 5.85 కోట్లమంది ఇన్వెస్టర్ల నుంచి మొత్తం రూ. 49,100 కోట్లను పీఏసీఎల్ సమీకరించినట్లు సెబీ పేర్కొంది. అయితే 2012 ఏప్రిల్ 1 నుంచి 2013 ఫిబ్రవరి 25 వరకూ సమీకరించిన నిధుల వివరాలు వెల్లడిస్తే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశమున్నదని తెలిపింది. అనధికార కలెక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ పథకాలకు సంబంధించి ఇది అత్యంత భారీ మొత్తమే కాకుండా ఇన్వెస్టర్ల సంఖ్య సైతం ఎక్కువేనని వ్యాఖ్యానించింది. అత్యంత దీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న కేసుగానూ దీనిని సెబీ పేర్కొంది.
నిర్మల్ సింగ్ భంగూ, తర్లోచన్ సింగ్, సుఖ్‌దేవ్ సింగ్, గుర్మీత్ సింగ్, సుబ్రతా భట్టాచార్యసహా కంపెనీకి చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లపై సీబీఐ కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కంపెనీపై సెబీ 1998 ఫిబ్రవరిలో తొలిసారిగా నిషేధాజ్ఞలు జారీ చేసింది. 2014 మార్చి 31కల్లా 4.63 కోట్లమంది కస్టమర్లకు మొత్తం రూ. 29,421 కోట్లు చెల్లించాల్సి ఉన్నదని, అయితే రూ. 11,707 కోట్ల విలువైన భూమి మాత్రమే పీఏసీఎల్ చేతిలో ఉన్నదని సెబీ వెల్లడించింది. మరోవైపు 1.22 కోట్ల కస్టమర్లకు భూమిని కేటాయించినప్పటికీ, సేల్ డీడ్స్‌ను అందించలేదని వివరించింది.
శాట్‌కు వెళతాం: పీఏసీఎల్
సెబీ ఆదేశాలపై సెక్యూరిటీస్ అపిల్లేట్ ట్రి బ్యునల్(శాట్)ను ఆశ్రయించనున్నట్లు పీఏసీఎల్ లిమిటెడ్ తెలిపింది. తాము సమర్పించిన వివరాలను సెబీ గుర్తించలేదని, తమ పథకాలను కలెక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ కింద పరిగణించిందని పేర్కొంది. ఈ అంశంపై శాట్‌లో అపీల్ చేయనున్నట్లు తెలిపింది.