How To Get A Monthly Income With An Investment In India, Where Should I Invest - Sakshi
Sakshi News home page

Monthly Income Investments Tips: నాకు ప్రతి నెలా ఇన్‌కమ్‌ కావాలి.. ఎక్కడ పెట్టుబడులు పెడితే బాగుంటుంది?

Published Mon, Jul 10 2023 7:10 AM

How To Get A Monthly Income With An Investment - Sakshi

నా వయసు 62 ఏళ్లు. స్థిరమైన ఆదాయం కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. అందుబాటులో ఉన్న మార్గాలు ఏవి?  – నారాయణ్‌ 

విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలంటే అందుకు తగినంత నిధిని సమకూర్చుకుని ఉండాలి. ఈ నిధి నుంచి క్రమం తప్పకుండా ఆదాయం పొందడం ద్వారా సౌకర్యవంతమైన జీవితాన్ని గడపొచ్చు. సీనియర్‌ సిటిజన్లు సహజంగా సంప్రదాయ మార్గాలనే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అత్యవసరాల్లో కావాల్సినప్పుడు వెంటనే పొందే లిక్విడిటీ కూడా ఉండాలని కోరుకుంటారు. ఇన్వెస్ట్‌ చేయడానికి ముందు ప్రతీ నెలా ఎంత మొత్తం కావాలో నిర్ణయించుకోవాలి.

ఇతర మార్గాల ద్వారా ఏదైనా ఆదాయం వస్తుంటే దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అద్దె రూపంలో ఆదాయం, పెన్షన్‌ లేదా మరొకటి కావచ్చు. ఏటా ఎంత మొత్తం పెట్టుబడి నుంచి కావాలో స్పష్టతకు రావాలి. ఒకవేళ ఏటా 4–6 శాతానికంటే ఎక్కువ కోరుకుంటుంటే అంచనాలను తగ్గించుకోవాల్సిందే. ఉదాహరణకు మీ పెట్టుబడి నిధి రూ.కోటి ఉందనుకుంటే వార్షికంగా ఉపసంహరించుకునే మొత్తం రూ.6 లక్షలకు మించి ఉండకూడదు. ఒకవేళ 6 శాతానికి మించి వెనక్కి తీసుకుంటే కనుక ఆ తర్వాతి సంవత్సరాల్లో తక్కువ ఆదాయానికి సిద్ధం కావాల్సిందే.

ద్రవ్యోల్బణాన్ని విస్మరించడానికి లేదు. నేడు నెలవారీ ఖర్చులకు రూ.50,000 సరిపోతుంటే.. 5, 10, 15 ఏళ్ల తర్వాత ఈ మొత్తం చాలదు. ఆ సమయంలో ఇంకాస్త అధికంగా కావాల్సి ఉంటుంది. అందుకనే రిటైర్మెంట్‌ తీసుకున్న వారు ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రాబడులను ఇచ్చే మార్గాలను చూసుకోవాలి. అందుకని రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించాలి. అప్పుడే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం మించి రాబడులకు అవకాశం ఉంటుంది.

పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయకూడదు. 30–40 శాతం చాలు. మిగతా మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాల్లోనే ఉంచాలి. ప్రభుత్వ హామీతో కూడిన పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌), పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక ఇన్వెస్టర్‌ ఈ పథకాలు అన్నింటిలోనూ కలిపి రూ.24.5 లక్షలు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని అధిక నాణ్యతతో కూడి డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా 30–40 శాతం మేర ఉండేలా ఏడాదికోసారి పెట్టుబడులను మార్పులు (అస్సెట్‌ రీబ్యాలన్స్‌) చేసుకోవాలి. 

ఆర్థిక ప్రణాళికను రూపొందించుకునే విషయంలో ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి? – రేవతి 

మీ అవసరాలకు అనుగుణమైన ప్రణాళికను రూపొందించుకోవడమే ప్రాథమిక కర్తవ్యంగా ఉండాలి. చేతిలో అవసరాలకు కొంత నగదు, అత్యవసర నిధి ఏర్పాటు, జీవిత బీమా, ఆరోగ్య బీమా కు చోటు ఇవ్వాలి. ఆ తర్వాత మీ ఆకాంక్షల విష యానికి రావాలి. మీ పొదుపు, పెట్టుబడులకు స్థాయికి తగ్గట్టు వీటిని మార్చుకోవచ్చు. ఆర్థిక ప్రణాళిక రూపొందించుకునేందుకు కచ్చితమైన సూచనలు అంటూ ఉండవు. ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కో రకంగా ఉంటుంది. ఎవరికి వారు తమ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని డిజైన్‌ చేసుకోవాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement