కరోనా సంక్షోభం మొదలు రైల్వేశాఖ బాదుడు మొదలైంది. సాధారణ రైళ్లకే ప్రత్యేకం పేరు పెట్టి అదనపు ఛార్జీలు వసూలు చేసింది. తక్కువ ధరకు సామాన్యులకు అందుబాటులో ఉండే ప్యాసింజర్ రైళ్లను ఎడాపెడా రద్దు చేసి పారేసింది. ఆఖరికి సామాజిక బాధ్యతగా వివిధ వర్గాలకు అందిస్తున్న రాయితీలను ఏకపక్షంగా ఎత్తేసింది. ఆఖరికి సీనియర్ సిటిజన్లపై కూడా కనికరం చూపలేదు.
మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చారు. గడిచిన రెండేళ్లుగా సీనియర్ సిటిజన్లకు రైల్వే ప్రయాణాల్లో రాయితీలు ఎత్తి వేయడం ద్వారా రైల్వేశాఖ వృద్ధ ప్రయాణికుల నుంచి అదనంగా రూ. 1500 కోట్లను తన ఖాతాలో జమ చేసుకుంది.
రాయితీలు బంద్
కరోనా కారణంగా 2020 మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. దీంతో జనజీవనం ఎక్కడికక్కడే నిలిచిపోయింది. రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ఆ తర్వాత క్రమంగా రైళ్లను పట్టాలెక్కించింది, అయితే అవన్ని ప్రత్యేక రైళ్లుగా పేర్కొంటూ.. అప్పటి వరకు అందిస్తూ వచ్చిన అన్ని రకాల రాయితీలను రైల్వేశాఖ ఎత్తేసింది. ఇందులో సీనియర్ సిటిజన్లు ఇచ్చే ప్రయాణ రాయితీ కూడా ఉంది.
సీనియర్ సిటిజన్స్
రైల్వేలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక రాయితీలు ఉన్నాయి. 58 ఏళ్లు పైబడిన స్త్రీలకు టిక్కెట్టు ధరలో 50 శాతం, 60 ఏళ్లు పైబడిన పురుషులు, థర్డ్ జెండర్ వాళ్లకు టిక్కెట్టు ధరలో 40 శాతం రాయితీ ఉంది. అయితే తొలి విడత లాక్‌డౌన్ నుంచి ఈ రాయితీలు ఏవీ అమలు కావడం లేదు. దీనికి సంబంధించిన సమాచారం ఆర్టీఐ ద్వారా సేకరించారు.
7.31 కోట్ల మంది ప్రయాణం
2020 మార్చి 20 నుంచి 2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా వివిధ రైళ్లలో 7.31 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ప్రయాణం చేశారు. ఇందులో 4.46 కోట్ల మంది పురుషులు, 2.84 కోట్ల మంది స్త్రీలు, 8,310 మంది థర్డ్ జెండర్ వాళ్లు ఉన్నారు. వీళ్లకు ఈ రెండేళ్ల కాలంలో ఎటువంటి రాయితీ కల్పించలేదు. దీంతో వీళ్ల ప్రయాణాల ద్వారా రైల్వేకు రూ.3464 కోట్ల ఆదాయం సమకూరింది.
రూ. 1500 కోట్లు
గడిచిన రెండేళ్లలో సీనియర్ సిటిజన్లకు కనుక రాయితీని అమలు చేసి ఉంటే రైల్వేశాఖ ఖజానాలో చేరిన రూ.3464 కోట్ల రూపాయల్లో కనీసం రూ. 1500 కోట్ల రాయితీగా వృద్ధులకు అక్కరకు వచ్చేది. ఈ డబ్బు వారి కనీస అవసరాలు, మందులు మాకులకు పనికి వచ్చేవి. కానీ కరోనా కష్ట సమయంలోనూ వృద్ధులపై దయ చూపేందుకు రైల్వేశాఖ ససేమిరా అంది. ప్రతీ ప్రయాణంలోనూ వారి వద్ద నుంచి ఫుల్ ఛార్జీ వసూలు చేస్తూ తన బొక్కసం నింపుకుంది.
బాధ్యత మరిచిన రైల్వే
రైల్వేశాఖలో వృద్ధులు, సైనికులు, రోగులు, మాజీ ప్రజాప్రతినిధులు, దివ్యాంగులు ఇలా మొత్తం 53 రకాల రాయితీలను అందిస్తోంది, వీటి వల్ల రైల్వే ఆదాయానికి ఏటా సగటున రూ.2000 కోట్లు తూటు పడుతోంది. అయితే ఆ మేరకు సామాజిక భద్రత లభిస్తోంది. అయితే లాభాలే ముఖ్యం సామాజిక భద్రత మా బాధ్యత కాదన్నట్టుగా ఇటీవల రైల్వే వ్యవహరిస్తుండటంతో గత రెండేళ్లుగా ఈ రాయితీలేవీ అమలు కావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment