సాక్షి, హైదరాబాద్ : పెట్టుబడి పథకం కింద రైతులకు అందజేసే చెక్కులపై ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మను ముద్రించే సాధ్యాసాధ్యాలను వ్యవసాయశాఖ వర్గాలు పరిశీలిస్తున్నాయి. ఎకరాకు రూ.4 వేల చొప్పున లక్షలాది మంది రైతులకు వేల కోట్ల రూపాయలు అందజేసే కార్యక్రమం కావడంతో చెక్కులపై సీఎం బొమ్మ ఉంటే బాగుంటుందని ప్రతిపాదిస్తున్నారు. ఈ మేరకు బ్యాంకు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే బ్యాంకు వర్గాలు దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ‘‘రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం చెక్కులపై ఫొటోలను ముద్రించే పరిస్థితి అయితే లేదు. ఇతర రాష్ట్రాల్లో గతంలో అలా ముద్రించారా లేదా తెలుసుకుంటాం. ప్రభుత్వమే ఆర్డరిచ్చి చెక్కులను ముద్రిస్తుండటం.. భారీ సంక్షేమ కార్యక్రమం కావడంతో ప్రత్యేక అనుమతితో సీఎం ఫొటో ముద్రించే అంశాన్ని పరిశీలిస్తాం’’అని కొందరు బ్యాంకు అధికారులు పేర్కొన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే చెక్కును గులాబీ రంగులో ముద్రించడానికి ఇబ్బందేమీ ఉండదని బ్యాంకు వర్గాలు పేర్కొన్నట్టు అధికారులు చెబుతున్నారు. త్వరలో ఈ రెండు అంశాలపై స్పష్టత రానుంది. రైతులకు గ్రామసభల్లో చెక్కులను పంపిణీ చేసే సమయంలో సీఎం బొమ్మ ఉంటేనే పథకానికి విస్త్రృత ప్రచారం వస్తుందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి.
వచ్చేనెలలో ప్రింటింగ్ షురూ!
రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్ కోసం మే 15 నాటికే రైతులకు పెట్టుబడి పథకం కింద చెక్కులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంటే మే ఒకటో తేదీ నుంచే గ్రామసభల్లో చెక్కుల పంపిణీ జరగనుంది. ప్రస్తుత అంచనా ప్రకారం 1.62 కోట్ల ఎకరాలకు చెందిన 70 లక్షలకు పైగా ఉన్న రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు. అయితే సాగుకు యోగ్యం కాని భూముల వివరాలు గుర్తించిన తర్వాత రెవెన్యూ శాఖ నుంచి కచ్చితమైన లెక్కలు వచ్చాకే చెక్కుల ముద్రణ జరగనుంది. చెక్కులను ముద్రించే బాధ్యత ఎస్‌బీఐకి అప్పగించారు. ఎస్‌బీఐ పేరుతోనే చెక్కులు వస్తాయి. 70 లక్షల వరకు చెక్కులు ముద్రిస్తున్నందున దానికి ఫీజు వసూలు చేయాలని బ్యాంకు వర్గాలు భావిస్తుండగా.. ఉచితంగానే అందజేయాలని ప్రభుత్వం కోరుతోంది. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఫొటో పెట్టాలంటే ప్రత్యేకంగా ఖర్చు అవుతుందన్న చర్చ జరుగుతోంది. చెక్కుల ముద్రణకు కనీసంగా 40 రోజుల సమయం అవసరమని అంచనా వేస్తున్నారు. ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని ప్రింటింగ్ ప్రెస్ రోజుకు 2 లక్షల చెక్కులను మాత్రమే ముద్రిస్తుంది. రైతు పేరు, ఊరుతో సహా చెక్కులు ముద్రితమై బయటకు వస్తాయి. ఆ తర్వాత వాటిని జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా బంచ్‌లుగా తయారు చేస్తారు. అందుకు ప్రత్యేకంగా వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) క్లస్టర్ వారీగా కోడ్‌లు ముద్రిస్తారని తెలుస్తోంది. ఎస్‌బీఐ ప్రింటింగ్ మొదలు కావాలంటే ముందుగా రైతుల వివరాలు, సాగు వివరాలతో సమగ్ర సమాచారం వ్యవసాయ శాఖకు అందాలి. ఆ జాబితా ఆధారంగానే ఎస్‌బీఐ ప్రింటింగ్ ప్రారంభిస్తుంది. ఈ నెల 15కల్లా రెవెన్యూ శాఖ నుంచి జాబితా రావొచ్చు. ఆ జాబితా ఆధారంగా వ్యవసాయశాఖ సాగుకు యోగ్యంకాని భూమిని గుర్తించే ప్రక్రియ ప్రారంభిస్తుంది. మొత్తంగా ఈ నెలాఖరు నాటికే కచ్చితమైన తుది జాబితా ఎస్‌బీఐకి అందే అవకాశముంది. అంటే చెక్కుల ముద్రణ మార్చిలో మొదలై ఏప్రిల్ రెండో వారానికి పూర్తికావొచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment