చైనాలో దారుణం.. కెనడా పౌరులకు ఉరిశిక్ష | Canada People Death In China | Sakshi
Sakshi News home page

చైనాలో దారుణం.. కెనడా పౌరులకు ఉరిశిక్ష

Published Fri, Mar 21 2025 7:08 AM | Last Updated on Fri, Mar 21 2025 12:44 PM

Canada People Death In China

టొరంటో: డ్రగ్స్‌ సంబంధిత ఆరోపణలపై తమ నలుగురు పౌరులకు చైనా ప్రభుత్వం ఇటీవల ఉరిశిక్ష అమలు చేసిందని కెనడా వెల్లడించింది. ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండించింది. ద్వంద పౌరసత్వం ఉన్న ఈ నలుగురికీ క్షమాభిక్ష ప్రకటించాలని మాజీ ప్రధాని జస్టిన్‌ ట్రూడో, తాను గతంలో చైనాను కోరినట్లు విదేశాంగ మంత్రి మెలనీ జోలీ గురువారం చెప్పారు. 

ఇక, ఈ ఘటనపై ఒట్టావాలోని చైనా ఎంబసీ స్పందించింది. ద్వంద పౌరసత్వాన్ని తమ ప్రభుత్వం గుర్తించడం లేదని, ఆ నలుగురికీ డ్రగ్‌ సంబంధిత నేరాలపై ఉరి శిక్ష అమలు చేసిందని వివరించింది. ఇటువంటి నేరాలపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, నలుగురిపై ఆరోపణలకు ఆధారాలు పక్కాగా ఉన్నాయని కూడా తెలిపింది. ఈ విషయంలో బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయవద్దని కెనడా ప్రభుత్వాన్ని కోరింది. 

ఇలా ఉండగా, డ్రగ్‌ స్మగ్లింగ్‌ కేసులో మరణ శిక్షను ఎదుర్కొంటున్న రాబర్ట్‌ షెల్లెన్‌బర్గ్‌ అనే కెనడా పౌరుడికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ చైనాను కోరామని మంత్రి జోలీ వెల్లడించారు. చైనా తయారీ ఎలక్ట్రిక్‌ వాహనాలు, స్టీల్‌ అల్యూమినియం ఉత్పత్తులపై గతేడాది అక్టోబర్‌లో కెనడా టారిఫ్‌లు విధించింది. ప్రతిగా, కెనడా వ్యవసాయ, ఆహారోత్పత్తులపై చైనా టారిఫ్‌లు ప్రకటించింది. 2018లో హువై మాజీ చీఫ్‌ను కెనడా అధికారులు అరెస్ట్‌ చేసినప్పటి నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతలు టారిఫ్‌ యుద్ధంతో మరింత ముదిరాయి. కాగా, కెనడాకు చైనా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement