వలస బాటలో మత్స్యకారులు
Published Thu, Jan 30 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM
కృష్ణానదిని నమ్ముకొని ఏటి ఒడ్డున బతుకుతున్న మత్స్యకారుల జీవితాలు నానాటికి మసకబారుతున్నాయి. ఐదు దశాబ్దాల కిందట పొట్ట చేతబట్టుకొని విశాఖ నుంచి విజయపురిసౌత్ వచ్చిన మత్స్యకారులు ప్రస్తుతం పలు అవస్థలు పడుతున్నారు. రోజు మొత్తం షికారు (వేట) చేసినా చేపలు చిక్కని దైన్యస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మత్స్యశాఖ గత రెండు ఏళ్ళుగా సాగర్ జలాశయంలో చేపపిల్లలను వదలక పోవటంతో షికారు జరగక మత్స్యకారుల కుటుంబాలు అల్లాడుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందక వలస బాటపట్టాయి.
విజయపురిసౌత్, న్యూస్‌లైన్ : విజయపురిసౌత్‌లోని డౌన్‌మార్కెట్, సాగర్ క్యాంప్‌లలో సుమారు 500 మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వీరికి చేపల వేటే ప్రధాన పోషణ. వీరిలో సగం మందికి పక్కా గృహాలు కూడా లేవు. చేపల వ్యాపారుల వద్ద కుటుంబ పోషణకు అడ్వాన్స్‌లు తీసుకొని చేపలను వారికే అమ్ముతుంటారు. ప్రతి ఏటా 50 నుంచి 60 లక్షల చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులు గుంటూరు, నల్లగొండ జిల్లాల్లోని నాగార్జునసాగర్ జలాశయంలో ఇరువైపుల వదులుతుండేవారు. రెండేళ్లుగా చేప పిల్లలను వదలకపోవడంతో వారి జీవనోపాధి దెబ్బతింది. సహజంగా
కుటుంబంలోని మగవారంతా షికారు (చేపల వేట) చేస్తారు. అనంతరం వచ్చిన చేపలను వేరు చేసేందుకు మహిళలు సహకరిస్తారు. పెద్ద చేపలను విక్రయించి చిన్న చేపలను ఎండబెట్టడం, కూర వండుకోవటం చేస్తుంటారు. వీరంతా ప్రతి రోజు చేపలతోనే భోజనం చేస్తారు. షికారు జరగని రోజు ఏటి ఒడ్డునే పస్తులు ఉంటారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ డ్యాం భద్రతా దృష్ట్యా కృష్ణా జలాశయం ఒడ్డున ఉన్న లాంచీస్టేషన్ నుంచి సాగర్‌మాత దేవాలయం వరకు ప్రభుత్వం సేఫ్టీవాల్ నిర్మాణం చేపట్టడంతో మత్స్యకారులు చేపలు షికారు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరో రెండు మూడు నెలల్లో సేఫ్టీవాల్ నిర్మాణం పూర్తయితే కృష్ణా జలాశయంలోకి పుట్టీలతో ఎలా దిగాలని మత్స్యకారులు వాపోతున్నారు.
దీనికి తోడు గత రెండు సంవత్సరాలుగా జలాశయంలో చేపపిల్లలను వదలక పోవటంతో చేపల వేట లేక సుమారు 200 మత్స్యకార కుటుంబాలు పుట్టీలతో సహా వివిధ ప్రాంతాలకు జీవనం కోసం తరలివెళ్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని హోస్‌పేట, ఆల్మట్టి, మన రాష్ట్రంలోని వైజాగ్, కరీంనగర్, తుంగభద్ర ప్రాంతాలకు తరలివెళ్తున్నట్లు మత్స్యకారులు పేర్కొన్నారు.చేపపిల్లలను వదలలేదు... కృష్ణా జలాశయంలో గత రెండు ఏళ్ళుగా చేపపిల్లలను వదలక పోవటం వాస్తవమే. ప్రపంచ బ్యాంక్ నిధులతో 40 లక్షల చేపపిల్లలను వదలాల్సి ఉంది. అయితే కొన్ని సాంకేతిక లోపాల వల్ల జరగలేదు. తిరిగి టెండర్లు పిలిచి జలాశయంలో చేపపిల్లలను వదులుతాం. మత్స్యకారుల అభివృద్ధి కోసం పొదుపు పథకాలు, దేశాలమ్మ గుడి వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, జెట్టీల నిర్మాణం, చేపల మార్కెట్ల నిర్మాణం చేపడుతున్నాం.
- బల రాం, జిల్లా మత్స్యశాఖ డీడీ
Advertisement